రాష్ట్రంలో 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన
విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్
తొలి కేబినెట్ ఏర్పాటుతోనే సామాజిక విప్లవం ఆవిష్కరణ
మేనిఫెస్టోయే దిక్సూచి.. 99 శాతం హామీల అమలుతో విశ్వసనీయత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్
వివక్ష, లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు జమ
ఈ సొమ్ము సద్వినియోగంతో 11.77 శాతం నుంచి 4.19 శాతానికి తగ్గిన పేదరికం
గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
ఇందులో ఈ 58 నెలల్లో నియమించినవే 2.13 లక్షలు
ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ
నాడు–నేడుతో పాఠశాలలకు కొత్త రూపు.. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్
అమ్మ ఒడితో ప్రభుత్వ పాఠశాలల్లో 98.73 శాతానికి పెరిగిన విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం
ఆరోగ్యశ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జనన్న ఆరోగ్య సురక్షతో నాణ్యమైన వైద్య సేవలు
సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రగామి.. పారిశ్రామికాభివృద్ధి వేగవంతం
ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం
జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే ఈ విప్లవం కొసాగాలని కోరుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు, మేధావులు
ఐదేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను గెలవటం ఓ విప్లవం.. ఆ తర్వాత.. స్కూళ్లు, విద్యార్థుల నుంచి.. చెప్పే చదువుల వరకూ విద్యా రంగం సమూలంగా మారింది.
ఇంటికే వైద్యులు, గ్రామాల్లోనే పరీక్షలు సహా... పేదల ప్రతి చికిత్సకూ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోంది.
ఆర్‌బీకేల నుంచి పంటల కొనుగోళ్లు, బీమా వరకూ ప్రతి చర్యా రైతుకు భరోసా ఇస్తోంది.
ఈ రాష్ట్ర మహిళలకు సొంతింటి పట్టాలున్నాయి. సొంత కాళ్లపై నిలబడగలిగే సత్తా ఉంది.
ఇవే కాదు.. ఇంటింటికీ పథకాలు చేరవేసే వలంటీర్లు, గ్రామాల్లో పాలన భవనాలు, వ్యవసాయ– వైద్యారోగ్య కేంద్రాలు.. ఇవన్నీ ఐదేళ్లలోనే. కోవిడ్ కబళించిన రెండేళ్లను మినహాయిస్తే మూడేళ్లలోనే ఇంతటి సంక్షేమాభివృద్ధితో కూడిన విప్లవాన్ని... బహుశా ఈ రాష్ట్రమే కాదు.. ఏ రాష్ట్రమూ ఇదివరకెన్నడూ చూడలేదు.
సమాజంలోని అట్టడుగు వర్గాలనూ అభివృద్ధిలో భాగం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ఫలితమే ఈ విప్లవం. అందుకే దేశంలో ఏ నాయకుడూ చెప్పని విధంగా ఆయన ధైర్యంగా జనానికి ఓ మాట చెబుతున్నారు. ‘గత ఎన్నికల ముందు చేస్తానని చెప్పినవన్నీ చేశా. మీ కుటుంబానికి మంచి జరిగిందని మీరు నమ్మితేనే మళ్లీ నాకు ఓటెయ్యండి’ అని. ఇలాంటి నాయకత్వమే అసలైన విప్లవం. విప్లవంతోనే చరిత్ర మారుతుంది.
దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో గత 58 నెలలుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది.
2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోనే దిక్సూచిగా పరిపాలిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి.. మద్యపాన నియంత్రణ, సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు వంటి వాటిని ఎందుకు అమలు చేయలేదో సహేతకమైన కారణాలు చెప్పడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్నారు.
దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భారీ ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో 58 నెలల్లో నియమించిన వారే 2.13 లక్షలు కావడం గమనార్హం.
ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు.
–సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment