కౌలు చేలల్లో.. సంక్షేమ ఫలాలు  | Government Welfare Schemes For Tenant Farmers | Sakshi
Sakshi News home page

కౌలు చేలల్లో.. సంక్షేమ ఫలాలు 

Published Sun, Jul 5 2020 7:59 AM | Last Updated on Sun, Jul 5 2020 7:59 AM

Government Welfare Schemes For Tenant Farmers - Sakshi

పంటల సాగుకు అందించే సంక్షేమ ఫలాలు కౌలు రైతులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీసీఆర్‌సీ(క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ సర్టిఫికెట్‌) (పంట సాగు హక్కు) పత్రం పొందిన ప్రతి కౌలు రైతుకూ ఇకపై సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ఇందుకు గాను లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ప్రారంభించాయి. 

చిత్తూరు అగ్రికల్చర్‌ : జిల్లాలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటలు దాదాపు 2.70లక్షల హెక్టార్లలో సాగవుతాయి. అందులో వ్యవసాయ పంటలు 2.20 లక్షల హెక్టార్లు, పడమటి మండలాల్లో అత్యధికంగా టమాట సుమారు 50వేల హెక్టార్లలో సాగవుతుంది. వర్షాధార పంటగా వేరుశనగ లక్ష హెక్టార్లకు పైబడి సాగు చేస్తారు. ఈ పంటల్లో 40 శాతం మేరకు కౌలు రైతులు సాగు చేస్తుండడం గమనార్హం. గతంలో పంటల సాగులో ఎలాంటి నష్టం వచ్చినా కౌలు రైతులు భరించాల్సిందే. నష్టం వచ్చినా భూములిచ్చినందుకు యజమానులకు మాత్రం ఒప్పందం మేరకు దిగుబడి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేగాక ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి కారణంగా పంట నష్టానికి ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కూడా భూ యజమానులకే దక్కేది. ఫలితంగా కౌలు రైతులకు ఎలాంటి సంక్షేమ ఫలమూ అందే పరిస్థితి ఉండేది కాదు. తద్వారా కౌలు రైతులు నష్టాలను చవిచూడడమే గాకుండా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండేది. 

కౌలు రైతులకు పెద్దపీట 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కౌలు రైతులను కూడా అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపడుతోంది. అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకూ రైతు భరోసాతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలు, బ్యాంకు నుంచి పంట రుణాలను కూడా అందించనుంది. ఇందుకోసం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులను గుర్తించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. 

గుర్తింపు ఇలా.. 
జిల్లాలో కౌలు రైతులను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నాయి. సాగవుతున్న పంటలను వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతారు. ఎవరైనా కౌలుకు పంటలు సాగు చేస్తుంటే గుర్తించి వారికి కౌలు సర్టిఫికెట్‌ పొందడానికి అర్హతలను తెలియజేస్తారు. భూయజమాని సమ్మతిస్తే వారి సహకారంతో సీసీఆర్‌సీ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంటారు. దీన్ని వీఆర్వో పరిశీలించి, భూ యజమాని సమ్మతితో పంట సాగుదారు అర్హత పత్రం కోసం తహసీల్దార్‌కు ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదన మేరకు తహసీల్దార్‌ సీసీఆర్‌సీ మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికి జిల్లాలో గతేడాది 1,194 మందిని గుర్తించారు. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాక మే 16 నుంచి ఇప్పటివరకు 29 మందిని గుర్తించి, పత్రాలను అందించారు. ఈ సంఖ్యను మరింత పెంచాలన్న ఉద్దేశంతో ప్రతి కౌలు రైతునూ గుర్తించే పనిలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరి ధిలో కనీసం ఐదుగురు కౌలు రైతులను గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. 

సంక్షేమ ఫలాలు ఇలా.. 
ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సాగవుతున్న పంటలను రైతుల వారీ వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేపట్టనుంది. అదే సమయంలో సీసీఆర్‌సీ పత్రం ఉన్న కౌలు రైతులు సాగు చేసిన పంటలను కూడా వారి పేరున నమోదు చేస్తారు. ఈ విధంగా నమోదైన పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం అందించే పరిహారం, బీమా తదితరాలు నేరుగా కౌలు రైతులకే అందుతుంది. అదేగాక వారికి బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. 

రైతు భరోసాకు అర్హత ఇలా.. 
కౌలు రైతులు కూడా రైతు భరోసా కింద ముందస్తుగా పంటలకు పెట్టుబడి నిధిని పొందే విధంగా చర్యలు తీసుకుంది. ఇందుకుగాను కనీసం 2.5 ఎకరాల పైబడి భూమి ఉన్న యజమానుల నుంచి భూములను కౌలుకు తీసుకుని ఉండాలి. ఈ విధంగా కౌలు తీసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సొంత భూములు లేకుండా ఉన్న వారు రైతు భరోసాకు అర్హత పొందుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement