26 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రారంభం
ప్రతి రైతుకు 14 నంబర్ల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ
కౌలుదారులకు కూడా..
ఈ రిజిస్ట్రీ ఆధారంగానే సంక్షేమ పథకాలు
అగ్రిస్టాక్ ప్రాజెక్టు అమలుకు కమిటీల ఏర్పాటు
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రాష్ట్రంలోనూ రంగం సిద్ధమైంది. ఇందులో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు 14 నంబర్లతో విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ కోడ్) కేటాయించనున్నారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు యూసీ జారీ చేయనున్నారు.
ఏపీలో మాత్రం భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా యూసీలు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రీ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రి సెన్సస్–2019 ప్రకారం రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 41.84 లక్షల మంది ఉన్నారు.
కౌలు రైతులు 16.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో సెంటు భూమి కూడా లేని కౌలుదారులు 8 నుంచి 10 లక్షల మంది ఉండగా, దేవాదాయ, అటవీ భూముల సాగుదారులు 1.50 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ఫార్మర్ రిజిస్ట్రీలో యూసీలు జారీ చేస్తారు.
ప్రాజెక్టు నిర్వహణ, స్టీరింగ్, అమలు కమిటీలు ఏర్పాటు
జాతీయ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్– అగ్రిస్టాక్ ప్రాజెక్టు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు నేతృత్వంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ (ఎస్‌పీఎంయూ) ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ నేతృత్వంలో అమలు కమిటీ గురువారం ఏర్పాటయ్యాయి. మాస్టర్ ట్రైనీస్‌కు గురువారం నుంచి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
26న నుంచి నమోదు
ఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 24న ప్రాజెక్టు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తారు. 26 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రారంభమవుతుంది. ముందుగా జనవరి 21వ తేదీలోగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వీటిని జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రైతులు, కౌలు రైతులకు ఇస్తారు.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా తొలుత ఆర్‌ఎస్‌కే సిబ్బంది వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసి యూసీలు కేటాయిస్తారు. వాటిని తహసీల్దార్లు అప్రూవ్ చేస్తారు. రైతులు లేవనెత్తే అభ్యంతరాలను మండల వ్యవసాయ శాఖాధికారులు పరిష్కరిస్తారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు.
ఎన్నో ప్రయోజనాలు..
యూనిక్ కోడ్‌తో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను ఈ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్‌ఫామ్స్‌కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలు రైతులతో పాటు భూమి లేని కూలీలకు సైతం ఆధార్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ ఐడీలను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్‌తో కూడిన ఆర్ధిక సేవలు పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
పారదర్శకంగా రైతు విశిష్ట సంఖ్య నమోదు: ఢిల్లీరావు
రైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైతు సేవా కేంద్రంలో నమోదు ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ బ్లూ ప్రింట్‌తో క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ, విశిష్ట సంఖ్య నమోదులో వ్యత్యాసాలను పరిశీలించారు.
ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, లోటుపాట్లపై డిజిటల్ సిబ్బంది, ఆర్‌ఎస్‌కే సహాయకులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎరువుల సరఫరా, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ లింకేజ్‌లు ఇతర సౌకర్యాలకు రైతు విశిష్ట సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment