ఐడీల ఆధారంగానే సంక్షేమ పథకాల వర్తింపు
ఇందుకోసం డిజిటల్ అగ్రిమిషన్–అగ్రి స్టాక్ ప్రాజెక్ట్ కింద ‘స్టేట్ ఫార్మర్స్ రిజిస్ట్రీ’ ఏర్పాటు
సీసీఆర్సీలు పొందిన కౌలుదారులకూ గుర్తింపు కార్డులు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో యూనిక్ కోడ్ (యూసీ) ఐడీలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డిజిటలైజేషన్ దిశగా..
వ్యవసాయ రంగాన్ని పూర్తి గా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ప్రతి రై తుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయా లని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతోపాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్–అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (ఎస్‌పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. అనంతరం 14 అంకెల విశిష్ట సంఖ్యతో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తారు.
యూనిక్ ఐడీ ద్వారానే సంక్షేమ ఫలాలు
ఈ కార్డుల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ఈ యూనిక్ కోడ్‌ను తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్‌లో విక్రయించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
అగ్రి సెన్సెస్–2019 ప్రకారం లెక్క ఇదీ
వ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం: 67.44 లక్షల హెక్టార్లు
వెబ్‌ల్యాండ్ డేటా ప్రకారం రైతులు: 76,06,943 మంది
2.5 ఎకరాలలోపు ఉన్న రైతులు: 52,01,870 మంది
2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులు: 15,62,042 మంది
5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు: 8,43,031 మంది
కౌలు రైతులు: 16.50 లక్షల మంది
సెంటు భూమి కూడా లేని కౌలుదారులు: 810 లక్షల మంది
దేవదాయ, అటవీ భూముల సాగుదారులు: 1.50 లక్షల మంది
Comments
Please login to add a commentAdd a comment