Unique code
-
ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రాష్ట్రంలోనూ రంగం సిద్ధమైంది. ఇందులో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు 14 నంబర్లతో విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ కోడ్) కేటాయించనున్నారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు యూసీ జారీ చేయనున్నారు. ఏపీలో మాత్రం భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా యూసీలు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రీ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రి సెన్సస్–2019 ప్రకారం రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 41.84 లక్షల మంది ఉన్నారు. కౌలు రైతులు 16.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో సెంటు భూమి కూడా లేని కౌలుదారులు 8 నుంచి 10 లక్షల మంది ఉండగా, దేవాదాయ, అటవీ భూముల సాగుదారులు 1.50 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ఫార్మర్ రిజిస్ట్రీలో యూసీలు జారీ చేస్తారు.ప్రాజెక్టు నిర్వహణ, స్టీరింగ్, అమలు కమిటీలు ఏర్పాటుజాతీయ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్– అగ్రిస్టాక్ ప్రాజెక్టు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు నేతృత్వంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ నేతృత్వంలో అమలు కమిటీ గురువారం ఏర్పాటయ్యాయి. మాస్టర్ ట్రైనీస్‌కు గురువారం నుంచి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.26న నుంచి నమోదుఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 24న ప్రాజెక్టు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తారు. 26 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రారంభమవుతుంది. ముందుగా జనవరి 21వ తేదీలోగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వీటిని జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రైతులు, కౌలు రైతులకు ఇస్తారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా తొలుత ఆర్ఎస్కే సిబ్బంది వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసి యూసీలు కేటాయిస్తారు. వాటిని తహసీల్దార్లు అప్రూవ్ చేస్తారు. రైతులు లేవనెత్తే అభ్యంతరాలను మండల వ్యవసాయ శాఖాధికారులు పరిష్కరిస్తారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు.ఎన్నో ప్రయోజనాలు..యూనిక్ కోడ్‌తో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను ఈ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్‌ఫామ్స్‌కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలు రైతులతో పాటు భూమి లేని కూలీలకు సైతం ఆధార్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఐడీలను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్‌తో కూడిన ఆర్ధిక సేవలు పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.పారదర్శకంగా రైతు విశిష్ట సంఖ్య నమోదు: ఢిల్లీరావురైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైతు సేవా కేంద్రంలో నమోదు ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ బ్లూ ప్రింట్‌తో క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ, విశిష్ట సంఖ్య నమోదులో వ్యత్యాసాలను పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, లోటుపాట్లపై డిజిటల్ సిబ్బంది, ఆర్ఎస్కే సహాయకులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎరువుల సరఫరా, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ లింకేజ్లు ఇతర సౌకర్యాలకు రైతు విశిష్ట సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
రైతులకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో యూనిక్ కోడ్ (యూసీ) ఐడీలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటలైజేషన్ దిశగా.. వ్యవసాయ రంగాన్ని పూర్తి గా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ప్రతి రై తుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయా లని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతోపాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్–అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. అనంతరం 14 అంకెల విశిష్ట సంఖ్యతో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తారు. యూనిక్ ఐడీ ద్వారానే సంక్షేమ ఫలాలు ఈ కార్డుల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ఈ యూనిక్ కోడ్‌ను తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్లో విక్రయించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.అగ్రి సెన్సెస్–2019 ప్రకారం లెక్క ఇదీవ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం: 67.44 లక్షల హెక్టార్లు వెబ్‌ల్యాండ్ డేటా ప్రకారం రైతులు: 76,06,943 మంది 2.5 ఎకరాలలోపు ఉన్న రైతులు: 52,01,870 మంది 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులు: 15,62,042 మంది 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు: 8,43,031 మంది కౌలు రైతులు: 16.50 లక్షల మంది సెంటు భూమి కూడా లేని కౌలుదారులు: 810 లక్షల మంది దేవదాయ, అటవీ భూముల సాగుదారులు: 1.50 లక్షల మంది -
ఈ-‘పాస్’ అయ్యేనా!
సాక్షి, కర్నూలు : మొన్న ప్రభుత్వ ఆదీనంలో పాసు పుస్తకాలు ముద్రణ.. నిన్న యూనిక్ కోడ్.. నేడు ఈ-పాసు పుస్తకాలు.. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ పాసుపుస్తకాల కుంభకోణాలను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు నకిలీల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కానీ నకిలీ పాసు పుస్తకాలతో రూ. లక్షలాది రుణాలు దోచేసి అటు బ్యాంకులకు, ఇటు ప్రభుత్వానికీ టోకరా వేసిన ఘనులు ఇకపై మోసాల్లో ‘పాస్’ కాలేరంటోంది ప్రభుత్వం. జిల్లాలో మైనార్టీ.. క్రిస్టియన్.. బంజరు భూములే కాక, పరాయి భూములను సైతం పక్కాగా అమ్ముతూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న ఘనులున్నారు. కర్నూలులో ఇలా ప్రభుత్వ భూములను విక్రయిస్తూ.. నకిలీ పాసు పుస్తకాలు, తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి అడ్డదారిలో బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ.. అక్రమాలకు తెగబడుతున్న భూ మాఫియా కారణంగా ప్రభుత్వ రెవెన్యూకు భారీగా గండిపడుతోంది. దీన్ని అరికట్టే దిశగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు మొక్కుబడిగానే మారుతున్నాయి. కొత్తగా ‘ఈ-పాస్’ విధానం చాలా వరకు నకిలీలను అరికట్టే విషయమై ఫర్వాలేదనిపిస్తున్నా ఆచరణలో మాత్రం లోపాలు వేలెత్తి చూపిస్తూనే ఉన్నాయి. పట్టదారు పాసుపుస్తకం కావాలంటే నిన్నటి వరకు తహశీల్దార్‌కు అర్జీ పెట్టుకుని అధికారుల చుట్టూ తిరగాల్సిందే. నూతన విధానంలో ఇప్పుడా పరిస్థితి ఉండదు. నేరుగా మీ-సేవా కేంద్రాలకు వెళ్లి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే కొత్త పాసుపుస్తకం హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో ముద్రితమై చేతికొస్తుంది. కాగా, ఈ విధానంలోనూ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అడ్డుకట్ట పడేనా? కొత్త పాసు పుస్తకాల విధానంతో నకిలీలను అడ్డుకోగలమని, వాటిని పూర్తిగా నియంత్రించగలమని రెవెన్యూశాఖ చెబుతోంది. అయితే కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చినంత వేగంగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. దీంతో నకిలీలకు మార్గాలు గతంలో మాదిరిగానే తెరిచే ఉంటున్నాయి. గతంలో పాసుపుస్తకాల విధానాలు మార్చినప్పుడు కూడా నకిలీలకు అడ్డుకట్ట పడుతుందని ఆశించినా ప్రయోజనం నెరవేరలేదు. దీనికి కారణం.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే విధానాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది తహశీల్దార్లకు వీటిపై అవగాహన పూర్తిగా లేదు. పని ఒత్తిడి వల్ల తెలుసుకునే వెసులుబాటు కూడా ఉండటం లేదని చెబుతున్నారు. వీటికోసం ఇప్పటికీ కంప్యూటర్ ఆపరేటర్లపై ఆధారపడుతుండటంతో డిజిటల్ సంతకాలు కూడా వారే చేసేస్తున్నారు. ఈ-పాసు పుస్తకం విధానంలో కొత్త పుస్తకం పొందిన రైతులు.. అనంతరం తమకున్న భూమిలో కొంత వేరొకరికి అమ్మితే కొనుగోలు చేసిన సదరు రైతుకు సైతం కొత్త పుస్తకం లభిస్తుంది. అయితే ఒకే విస్తీర్ణంపై ఇద్దరూ బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చు. ఈ మార్పులు రిజిస్ట్రార్ వ్యవస్థతో కలిపి వెంటనే చేయకుంటే విస్తీర్ణాలు పెరిగిపోవడంతో పాటు, రాజమార్గంలోనే నకిలీలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.