సాక్షి, కర్నూలు : మొన్న ప్రభుత్వ ఆదీనంలో పాసు పుస్తకాలు ముద్రణ.. నిన్న యూనిక్ కోడ్.. నేడు ఈ-పాసు పుస్తకాలు.. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ పాసుపుస్తకాల కుంభకోణాలను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు నకిలీల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కానీ నకిలీ పాసు పుస్తకాలతో రూ. లక్షలాది రుణాలు దోచేసి అటు బ్యాంకులకు, ఇటు ప్రభుత్వానికీ టోకరా వేసిన ఘనులు ఇకపై మోసాల్లో ‘పాస్’ కాలేరంటోంది ప్రభుత్వం.
జిల్లాలో మైనార్టీ.. క్రిస్టియన్.. బంజరు భూములే కాక, పరాయి భూములను సైతం పక్కాగా అమ్ముతూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న ఘనులున్నారు. కర్నూలులో ఇలా ప్రభుత్వ భూములను విక్రయిస్తూ.. నకిలీ పాసు పుస్తకాలు, తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి అడ్డదారిలో బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ.. అక్రమాలకు తెగబడుతున్న భూ మాఫియా కారణంగా ప్రభుత్వ రెవెన్యూకు భారీగా గండిపడుతోంది. దీన్ని అరికట్టే దిశగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు మొక్కుబడిగానే మారుతున్నాయి.
కొత్తగా ‘ఈ-పాస్’ విధానం చాలా వరకు నకిలీలను అరికట్టే విషయమై ఫర్వాలేదనిపిస్తున్నా ఆచరణలో మాత్రం లోపాలు వేలెత్తి చూపిస్తూనే ఉన్నాయి. పట్టదారు పాసుపుస్తకం కావాలంటే నిన్నటి వరకు తహశీల్దార్‌కు అర్జీ పెట్టుకుని అధికారుల చుట్టూ తిరగాల్సిందే. నూతన విధానంలో ఇప్పుడా పరిస్థితి ఉండదు. నేరుగా మీ-సేవా కేంద్రాలకు వెళ్లి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే కొత్త పాసుపుస్తకం హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో ముద్రితమై చేతికొస్తుంది. కాగా, ఈ విధానంలోనూ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
అడ్డుకట్ట పడేనా?
కొత్త పాసు పుస్తకాల విధానంతో నకిలీలను అడ్డుకోగలమని, వాటిని పూర్తిగా నియంత్రించగలమని రెవెన్యూశాఖ చెబుతోంది. అయితే కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చినంత వేగంగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. దీంతో నకిలీలకు మార్గాలు గతంలో మాదిరిగానే తెరిచే ఉంటున్నాయి. గతంలో పాసుపుస్తకాల విధానాలు మార్చినప్పుడు కూడా నకిలీలకు అడ్డుకట్ట పడుతుందని ఆశించినా ప్రయోజనం నెరవేరలేదు.
దీనికి కారణం.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే విధానాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది తహశీల్దార్లకు వీటిపై అవగాహన పూర్తిగా లేదు. పని ఒత్తిడి వల్ల తెలుసుకునే వెసులుబాటు కూడా ఉండటం లేదని చెబుతున్నారు. వీటికోసం ఇప్పటికీ కంప్యూటర్ ఆపరేటర్లపై ఆధారపడుతుండటంతో డిజిటల్ సంతకాలు కూడా వారే చేసేస్తున్నారు.
ఈ-పాసు పుస్తకం విధానంలో కొత్త పుస్తకం పొందిన రైతులు.. అనంతరం తమకున్న భూమిలో కొంత వేరొకరికి అమ్మితే కొనుగోలు చేసిన సదరు రైతుకు సైతం కొత్త పుస్తకం లభిస్తుంది. అయితే ఒకే విస్తీర్ణంపై ఇద్దరూ బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చు. ఈ మార్పులు రిజిస్ట్రార్ వ్యవస్థతో కలిపి వెంటనే చేయకుంటే విస్తీర్ణాలు పెరిగిపోవడంతో పాటు, రాజమార్గంలోనే నకిలీలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.
ఈ-‘పాస్’ అయ్యేనా!
Published Sun, Jul 13 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement