కర్నూలు సిటీ: వర్షాకాలంలోనూ ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాలులతో ప్ర‘జల’ దాహార్తి తీరడం లేదు. గ్రామాల్లో నీటి ఎద్దడి పరిష్కారం కాకపోవడంతో ట్యాంకర్లతో అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంతా తాగునీటి కోసం వెచ్చిస్తున్న ఖర్చు తడిసి మోపెడవుతోంది. జిల్లాలో 893 గ్రామ పంచాయతీలు, 1498 గ్రామాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 29,04,177 మంది ఉన్నారు. వీరికి తాగు నీటిని అందించేందుకు 2504 ప్రజా నీటి పథకాలు(పి.డబ్ల్యూ.ఎస్ స్కీమ్స్), 56 సీ.పి.డబ్ల్య స్కీమ్స్, 15,051 చేతి పంపులు ఉన్నాయి.
ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అవసరమైన బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది వేసవిలో కాలంలో తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా తాత్కాలికంగా నివారించడం కోసం గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం శాఖ అధికారులు రూ. 5,70,00,000 రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వం మాత్రం 3,55,000 మంజూరు చేసింది. ఇప్పటి వరకు సుమారు రూ. 3 కోట్ల దాకా ఖర్చు చేశారు. వరుణుడు కరుణించక పోవడంతో తాగు నీటి కోసం ఇంకా కొంత నిధులు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఎనిమిది గ్రామాలలో మాత్రమే తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో తుగ్గలి మండలం జొన్నగిరి, కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె, ఉయ్యాలవాడ మండలం పుచ్చకాయలపల్లి, పాణ్యం మండలం సుగాలిమెట్ట, ప్యాపిలి మండలం అలేబాద్‌తాండా, రాచర్ల, నేరేడుచెర్ల, జలదుర్గం గ్రామాలు ఉన్నాయి. మరో మూడు గ్రామాలకు మాత్రం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండే రైతుల బోర్లను అద్దెకు తీసుకోని తాగు నీటిని సరఫరా చేస్తున్నామంటున్నారు. ఇందులో కొత్తపల్లి మండలం బట్టువారిపల్లి, డోన్ మండలం తాడూరు, కొత్త బురుజు గ్రామాలు ఉన్నాయి. గతేడాది వేసవిలో రూ. 2.5 కోట్లకు చేసిన ప్రతిపాదనలు చేస్తే రూ. 1.05 కోట్లు మంజూరు చేసింది. గతేడాది రూ. 2 కోట్లదాక ఖర్చు అయినట్లు తెలిసింది.
ఈఏడాది వర్షా కాలం మొదలై నెల రోజులు కావస్తున్నా...నేటికీ ఆశించిన మేరకు వర్షాలు కురవక పోవడంతో తాగు నీటి ఖర్చులు మరింత పెరిగాయి. వీటికి అదనంగా సీ.పి.డబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణ ఖర్చులు, చేతి పంపుల నిర్వహణ, మరమ్మతులు, నీటి పథకాల మరమ్మతుల ఖర్చులు అదనంగా అవుతాయి.
నీటి ఖర్చు తడిసి మోపెడు
Published Fri, Jul 3 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement