సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంచాయతీల్లో అక్రమ లేఔట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. వేలాది ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు పుట్టుకొస్తుండగా.. పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా తేలిన ప్రాథమిక అంచనా మేరకు 80 గ్రామాల్లో ఏకంగా 4,200 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నట్లు వెల్లడైంది.
ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా మొత్తం 899 పంచాయతీల్లో సర్వే చేస్తే సుమారు లక్ష ఎకరాల్లో అక్రమ లే-ఔట్లు తేలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అక్రమంగా వేసిన ఈ లే-ఔట్లలో పంచాయతీలకు భూమిని వదలడంలోనూ రియల్టర్లు తమ మార్కు కనబరుస్తున్నారు. వేసిన లే-ఔట్లలో 10 శాతం భూమిని పంచాయతీకి వదలకుండా దానిని కూడా విక్రయిస్తున్నారు. ఇంత తతంగం నడుస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
అక్రమ లే-ఔట్లలోనూ అక్రమాలే..
నిబంధనల మేరకు పంచాయతీ పరిధిలో ఏదైనా లే-ఔట్ వేస్తే 10 శాతం భూమిని సంబంధిత పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ భూమిలో సదరు పంచాయతీ ద్వారా పార్కును అభివృద్ధి చేయడం కానీ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ చేపట్టాలి. అంటే లే-ఔట్లలో నిర్మించే గృహాల్లో నివసించే కుటుంబాలకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. పంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న ఈ అక్రమ లే-ఔట్లలో రియల్ వెంచర్లు 10 శాతం భూమిని కూడా వదలకుండా విక్రయించేస్తున్నారు. అంటే పంచాయతీ పేరిట భూమిని వదలడం లేదన్నమాట. ప్రాథమిక అంచనా మేరకు సర్వే చేసిన 80 గ్రామాల్లో 483 అక్రమ లే అవుట్లను గుర్తించారు. ఇందులో 4,137 ఎకరాల్లో అక్రమ లేఔట్లు వేసినట్టు ప్రాథమిక సర్వేలో తేలింది. నిబంధనల మేరకు ఇందులో 10 శాతం పంచాయతీకి దక్కాలి. అయితే, అక్రమ లే అవుట్ల వేసిన రియల్టర్లు కేవలం 25 ఎకరాలు మాత్రమే వదిలారు. వాస్తవానికి నిబంధనల మేరకు 10 శాతం అంటే 413 ఎకరాల మేరకు పంచాయతీకి రావాలి.
అంటే మరో 388 ఎకరాల మేరకు పంచాయతీకి దక్కాల్సిన భూమిని కాస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 899 గ్రామాల్లో సర్వే చేస్తే ఇంకా ఎంత విలువైన భూమి పంచాయతీలకు దక్కకుండా పోయిందో ఊహిస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని సర్వేలో పాల్గొన్న పంచాయతీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు మాత్రం అక్రమ లే-ఔట్లపై కొరఢా ఝలిపించేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది.
ఉన్న సిబ్బందీ ఒకే చోట!
జిల్లాలో మొత్తం 889 పంచాయతీలు ఉన్నాయి. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో(కర్నూలు, ఆదోని, నంద్యాల) 54 మండలాలు ఉండగా.. పంచాయతీ క్లస్టర్లు మాత్రం 570 ఉన్నాయి. ఈ పంచాయతీ క్లస్టర్లను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. నాలుగు గ్రేడ్ల పంచాయతీ క్లస్టర్లకు కలిపి 478 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 92 పోస్టులు ఖాళీ ఉండగా.. ఉన్న పోస్టుల్లోనూ అధికశాతం పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-1 పంచాయతీల్లోనే కొనసాగుతున్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో వాస్తవంగా 40 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండాల్సి ఉండగా.. ఏకంగా 67 మంది పని చేస్తున్నారు. మరోవైపు గ్రేడ్-3 పంచాయతీల్లో 203 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేయాల్సి ఉండగా.. 59 మంది మాత్రమే ఉన్నారు.
అంటే అసలే సిబ్బంది కొరత వేధిస్తుండగా.. ఉండాల్సిన వారి కంటే ఒకే చోట అధిక మంది ఉండటం పరిస్థితి మరింత దారుణంగా మారేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఫలితంగా ఒక్కో పంచాయతీ కార్యదర్శికే రెండు, మూడు గ్రామాలను అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా పంచాయతీల్లో ఏమి జరుగుతున్నా వీరు పట్టించుకునే అవకాశం లేకుండాపోతోంది. దీంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ విస్తరణ అధికారులు(ఈవోలు) 53 మందికి గానూ 52 మంది ఉండటంతో ఈ శాఖ పనితీరు అధ్వానంగా మారింది.
లేఔట్ల.. పంచాయితీ!
Published Sun, Apr 19 2015 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement