చేనే‘తలరాతలు’ మారేనా?
సాక్షి, కర్నూలు : చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధి బహుళ ప్రయోజనార్థం, 2009-10 చేనేత గణాంకాల సవరణ చేయడానికి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నారు. జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగలదిన్నె గ్రామం నుంచి సమగ్ర సర్వే ప్రారంభించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ సర్వే 30 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జరుగనుంది. చేనేతపై ఆధారపడిన కార్మిక కుటుంబాల పరిస్థితులను గుర్తించి.. అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు జౌళిశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో దాదాపు 14 వేల మగ్గాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిపై 25 వేల వరకు నేత కార్మికులు పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా నేతపని ద్వారా కుటుంబాన్ని పోషించలేక.. వేలాది మంది కార్మికులు ఈ వృత్తిని వీడుతున్నారు. దీంతో నేతపై ఆధారపడిన కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా చేనేత పరిరక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా పోతున్నాయి. అర్హులైన ఏ ఒక్క కార్మికుడూ సంక్షేమ ఫలాలు పొందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో సర్కారు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తోంది.
బోగస్ సంఘాలు బయటపడేనా?
జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లో 43 చేనేత సహకార సంఘాలుండగా.. 19 సంఘాలు మాత్రమే కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలోనే బోగస్ సంఘాలు కూడా ఉన్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా సంఘ పాలకవర్గాలు ఇచ్చే అమ్యామ్యాలకు కక్కుర్తిపడి వాటి ఊసే ఎత్తడం లేదని పలువురు కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. ఒక్కో సంఘంలో పదుల సంఖ్యలో కార్మికులుంటే వందల సంఖ్యలో లెక్క చూపించి సంఘ నాయకులు ప్రభుత్వ రాయితీలు నొక్కేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సర్వే నిర్వహిస్తే అలాంటి బోగస్ సంఘాలు కచ్చితంగా బయటపడతాయి.
చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నంద్యాలలో, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ కార్పొరేషన్(అపిట్కో) ఆధ్వర్యంలో కర్నూలు, ఆదోని డివిజన్లలో సర్వే జరుగుతుంది. సర్వే నిర్వహణను దక్కించుకున్న సంస్థ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎన్ని మగ్గాలు ఉన్నాయి, ఎంతమంది నేత నేస్తున్నారు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డులు ఉన్నాయా? వారి స్థితిగతులు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తారు.
సంక్షేమ పథకాలెన్నో..
మహాత్మాగాంధీ బుంకర్ బీమా యోజన కింద రూ. 80 వార్షిక ప్రీమియం చెల్లిస్తే సహజ మరణానికి రూ. 60 వేలు, ప్రమాద కారణంగా మృతి చెందింతే రూ. 1.50 లక్షలు చెల్లిస్తారు. జిల్లాలో 1,234 మంది ఈ పథకంలో ఉన్నారు. ఈ పథకంలో సభ్యులుగా ఉన్న కార్మికుల పిల్లలకు 9వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ. 1,200 ఉపకార వేతనాన్ని అందిస్తారు.
రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కొత్తగా ప్రారంభించారు. జనవరి నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఏడాదికి రూ. 37,500 వైద్యాన్ని ఉచితంగా అందిస్తారు. జిల్లాలో 4194 మంది ఈ పథకంలో ఉన్నారు.
చేనేత పరిరక్షణకే సర్వే : ఏడీ
జిల్లాలో చేనేత కార్మికుల స్థితిగతులను ఆధ్యయనం చేసేందుకు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్, అపిట్కో సంస్థ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు(ఏడీ) పి. సత్యనారాయణరావు చెప్పారు. చేనేత కార్మికులు తమ ఫొటోలు, చేనేత ఫొటో గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, రేషన్‌కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, నూలు పాసుపుస్తకం తదితర వాటిని సర్వే సిబ్బందికి చూపి సహకరించాలని కోరారు.