మా గ్రామాల్లో సర్వే వద్దు
కొండాపురం: గండికోట ప్రాజెక్టు కింద కొండాపురం మండలంలో రెండో విడత ముంపు గ్రామాలైన యర్రగుడి, చామలూరు, తాళ్లప్రొద్దుటూరు గ్రామాల్లో సామాజిక, ఆర్థిక సర్వే చేసేందుకు వెళ్లిన తహసీల్దార్ల బృందాన్ని ఆయా గ్రామాల నిర్వాసితులు అడ్డుకున్నారు. 11 మంది తహసీల్దార్లతో కూడిన బృందం సోమవారం జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం, ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో ముంపు గ్రామాలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినాయకం మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక సర్వే చేస్తే ఎంత మంది నిర్వాసితులు ఉన్నారనేది జాబితా వస్తుందని, ఆ తర్వాత ఇక్కడి సమస్యలపై కలెక్టర్‌కు నివేదిక పంపుతామని, సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరగా తమకు పరిహారంపై హామీ ఇచ్చేంత వరకు గ్రామాల్లో సర్వే చేయొద్దని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముందు తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతనే సర్వే చేయాలంటూ నిర్వాసితులు తాళ్లప్రొద్దుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న రెవెన్యూ బృందాన్ని అడ్డుకున్నారు.
ప్రాజెక్టు కింద మొదటి గ్రామాలకు కటాఫ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి 01–01–2007 వరకు చనిపోయిన వారికి, వివాహమైన ఆడ పిల్లలకు ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. తల్లి దండ్రులకు రేషన్ కార్డు ఉండి అందులో అనివార్య కారణాల వల్ల పిల్లల పేర్లు లేని వారికి కూడా ప్యాకేజి వర్తింపజేయాలన్నారు. తమ గ్రామాల్లో సామాజిక సర్వే ఎప్పుడు చేస్తారో అప్పటినుంచి కటాఫ్ డేట్ ను ప్రకటించాలన్నారు. రేషన్ కార్డు లేదా, ఆధార్‌కార్డు లేదా ఓటరు కార్డులలో ఏవి ఉన్నా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు.
రెండో విడత ముంపు గ్రామాల్లోకి కలెక్టర్ రావాలి
గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్లప్రొద్దుటూరు, యర్రగుడి, చామలూరు గ్రామాల్లో రెండో విడత సర్వే చేయాలంటే తొలుత జిల్లా కలెక్టర్ బాబురావునాయుడు తమ గ్రామాల్లో పర్యటించాలని పట్టుబట్టారు. అంతవరకు తాము సర్వేకు సహకరించేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయకు ఫోన్ చేసి నిర్వాసితులు సర్వేకు సహకరించడం లేదని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మూడు గ్రామాల్లో ఉన్న పెద్దలతో చర్చించారు. చివరకు కలెక్టర్‌కు తమ సమస్యలను వివరిస్తామని అందుకు అధికారులు సహకరించాలని గ్రామస్తులు కోరగా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వాసితులతో సమావేశం ఉంటుందని హాజరు కావాలని ఆర్డీఓ వినాయకం చెప్పడంతో నిర్వాసితులు శాంతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొండాపురం సీఐ రవిబాబు, కొండాపురం ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ కృష్ణయ్య పర్యవేక్షించారు