మూసీ నది వెంట సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు
రెండో రోజూ తీవ్ర నిరసనల సెగ.. పలుచోట్ల ఉద్రిక్తత
ఇల్లు కూల్చేస్తారనే బాధతో యువకుడి ఆత్మహత్యాయత్నం
చాలా చోట్ల రోడ్లపై బైఠాయించిన బాధితులు.. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
అభివృద్ధి పేరిట తమ జీవితాలను నాశనం
చేయవద్దంటూ ఆక్రోశం.. పలుచోట్ల ఉద్రిక్తతల
మధ్యే పోలీసు బందోబస్తుతో ఇళ్లకు మార్కింగ్
మరికొన్ని చోట్ల వెనుదిరిగిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్‌జోన్‌లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.
రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్‌నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి..
మూసీ పరీవాహకంలో లంగర్‌హౌస్‌లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి.
మూడు గంటలు దిగ్బంధం
కార్వాన్‌లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
కంటిమీద కునుకు కరువు!
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు.
ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు
30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02)
భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా?
పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 )
అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్‌తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్
56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి?
1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్‌గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్
Comments
Please login to add a commentAdd a comment