పంట నష్టం.. సర్వే గగనం!
Published Fri, Nov 25 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
కరువు మండలాల్లో సా..గుతున్న సర్వే
– సహకరించని రెవెన్యూ అధికారులు
– కలెక్టర్ ఆదేశాలు లేవంటూ అంటీముట్టనట్లుగా విధులు
–గడువు పెంచుతూపోతున్న జిల్లా అధికారులు
–దిక్కుతోచని స్థితిలో వ్యవసాయాధికారులు
కర్నూలు(అగ్రికల్చర్):
ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన వర్షాభావంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఆగస్టులో చినుకు జాడ లేకపోవడంతో పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. జిల్లాలోని అన్ని మండలాలు కరువు బారిన పడినా.. జిల్లా యంత్రాంగం కేవలం 38 మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఈ మండలాల్లో పంట నష్టాన్ని అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంది. గ్రామం వారీగా, సర్వే నెంబర్ వారీగా రైతులు ఏ పంటలు వేశారు? ఎంత నష్టం జరిగింది? తదితరాలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది కలసి సర్వే చేయాలి. గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ, వ్యవసాయ విస్తరణ అధికారి, పంచాయతీ కార్యదర్శులుగా ఎన్యూమరేషన్ కోసం టీములు ఏర్పాటయ్యాయి. మండల స్థాయిలో వ్యవసాయాధికారి, తహసీల్దార్లను టీములుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే ఈ నెల 7వ తేదీకే ముగించాల్సి ఉంది. కానీ అప్పటికి సర్వే మొదలే కాలేదు. తర్వాత గడువులు పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఎన్యూమరేషన్‌లో పురోగతి కరువైంది. పంట నష్టంపై సర్వేకు తహసీల్దార్లు, వీఆర్‌ఓలు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు లేవంటూ సహకరించని పరిస్థితి. కొందరు సహకరిస్తున్నా.. మరి కొందరు సర్వేతో మాకు సంబందం లేదంటూ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ సిబ్బందికే సర్వే నెంబర్, ఖాతా నెంబర్లు తదితర వాటిపై అవగాహన ఉంటుందని, వారు సర్వేకు సహకరించకపోవడం వల్ల సత్తనడకన సాగుతోందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పంట నష్టం సర్వేకు రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడం వల్ల సర్వేలో అనేక తప్పులు జరిగే ప్రమాదం ఏర్పడింది.
నర్వేలో చేతి చమురు వదలాల్సిందే..
కరువు పాంత్రాల్లో చేపడుతున్న సర్వే వ్యవసాయాధికారులకు కష్టాలను తెచ్చిపెడుతోంది. ఐదేళ్లలో మూడు సార్లు కరువు ఏర్పడింది. ఎన్యూమరేషన్ తర్వాత రైతులు పేర్లను కంప్యూటరీకరణ చేయాల్సి ఉంది. ఒక్కో రైతు వివరాలను కంప్యూటరీకరణ చేయాలంటే రూ.2 చార్జి చెల్లించాల్సి ఉంది. ఒక్కో మండలంలో సగటున 12వేల మంది రైతుల వివరాలను కంప్యూటరీకరణ చేపట్టాలి. అంటే దీనికి రూ.24వేలు వ్యయం చేయాల్సి ఉంది. ఈ వివరాలను ప్రింట్ తీసి వాటిని నాలుగైదు సెట్లు జిరాక్స్ తీసి జేడీఏ, ఏడీఏలకు పంపాలి. ఒక కాపీని గ్రామ పంచాయతీకి ఇవ్వాలి. ఒక కాపీని తమ వద్ద ఉంచుకోవాలి. 500 పేజీలను కనీసం ఐదు కాపీలు జిరాక్స్ తీయడానికి రూ.4వేల ఖర్చు చేయాలి. దీనికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఈ ఖర్చులను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన కార్యరూపం దాల్చని పరిస్థితి. దీంతో పంట నష్టం సర్వే అంటేనే వ్యవసాయాధికారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రెవెన్యూ సిబ్బంది సహకరిస్తేనే..
పంట నష్టం ఎన్యూమరేషన్‌లో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఎక్కువగా ఉంటుంది. వారికి గ్రామాల వారీగా సర్వే నెంబర్ల వివరాలు, ఖాతా నెంబర్లు బాగా తెలిసి ఉంటాయి. అయితే మాకు తగిన ఆదేశాలు లేంటూ సర్వేకు సహకరించడం లేదు. కొన్ని చోట్ల సహకరిస్తున్నా మరికొన్ని చోట్ల సర్వేకు దూరంగా ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రెవెన్యూ, వ్యవసాయాధికారులు కలసికట్టుగా సర్వే నిర్వహించేలా చూడాలి. సర్వే తర్వాత రైతుల వివరాలను కంప్యూటరీకరణకు, జిరాక్స్‌లకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి.
- రవిప్రకాష్, ఏఓ, వెల్దుర్తి మండలం
వ్యవసాయాధికారులపై ఒత్తిడి
కరువు మండలాల్లో పంట నష్టం సర్వేను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు కలసికట్టుగా చేస్తే నాణ్యతగా ఉంటుంది. ఎలాంటి విమర్శలకు తావుండదు. కానీ సర్వేను రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవట్లేదు. వారిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. దీనిపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. రెవెన్యూ సిబ్బంది సహకారం లేకపోవడం వల్ల సర్వేకు ఆకంటకం కలుగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పంట నష్టంపై జరుగుతున్న ఎన్యూమరేషన్‌కు రెవెన్యూ సిబ్బంది సహకిరంచే విధంగా చూడాలి.
- సురేష్, ఏఓ, సి.బెళగల్ మండలం
Advertisement
Advertisement