శీతాకాలం వెళ్లి ఎండాకాలం వచ్చేసింది. భానుడు తన ప్రచండ రూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో అగ్ని ప్రమాదాలూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అయితే వీటి నివారణకు ప్రభుత్వ పరంగా చర్యలు చాలా తక్కువగా ఉన్నాయి. అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలన్నీ సమస్యలతో సతమతమవుతున్నాయి.ఫైరింజన్ల కొరత వేధిస్తోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమాచారం అంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నా నీటి ఎద్దడితో నష్టాన్ని తగ్గించలేకపోతున్నారు.
కర్నూలు(రాజ్‌విహార్): ‘ఇల్లు కాలిన ఆరు నెలలకు ఫైర్ ఇంజిన్ వచ్చింది’ అన్నట్లు తయారైంది జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల పరిస్థితి. తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నా జిల్లా అధికారులు మేల్కోవడం లేదు. నిబంధనల ప్రకారం 50వేల మంది జనాభకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. అయితే జిల్లాలో 12 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 15 వాహనాలు, మరో రెండు చిన్న వాహనాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో 40.40లక్షల జనాభా ఉంది. నిబంధనల ప్రకారం జిల్లాకు 81 అగ్నిమాపక కేంద్రాలు ఉండాలి. కాని ఉన్నవి 12 మాత్రమే. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసినా 54 కేంద్రాలు ఉండాల్సి ఉంది. కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణ కేంద్రాల్లో రెండేసి వాహనాలు ఉండగా శ్రీశైలం, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ పట్టణాల్లో ఒక్కో అగ్ని మాపక కేంద్రం ఉంది. నందికొట్కూరు, కోవెలకుంట్ల పాణ్యం, మంత్రాలయంలో ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించినా ఇప్పటివరకు ప్రభుత్వం మంజూరు చేయలేదు.
జిల్లాలో అనుబంధంగా ఎక్కడా ఆంబులెన్స్‌లు లేకపోవడం గమనార్హం. సొంత భవనాల్లోనే కేంద్రాలు ఉన్నప్పటికీ ఆదోని, నంద్యాల స్టేషన్లు శిథిలావస్థకు చేరాయి. ఆలూరు, ఆదోని, ఆళ్లగడ్డలోని వాహనాలు పదేళ్లకు పైబడి సేవలందిస్తూ పాతబడ్డాయి. దీంతో ఈ వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి.జిల్లాలో ఆలూరు, డోన్, పత్తికొండ, శ్రీశైలం, ఆళ్లగడ్డ కేంద్రాల్లో నీటి సమస్య వెన్నాడుతోంది. ప్రమాదం జరిగితే సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని నింపుకొని రావాల్సిన పరిస్థితి. పలు ప్రాంతాల్లో 10కిలో మీటర్లకు పైగా దూరం వెళితేకాని నీరు లభించని పరిస్థితి.
నియోజకవర్గ కేంద్రాలైన పాణ్యం, మంత్రాలయం, నందికొట్కూరులో ఫైర్ స్టేషన్లు లేకపోవడం శాపంగా మారింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తులు, ప్రాణాలకు భద్రత ఉండని పరిస్థితి ఉంది.
కర్నూలు నుంచి ఆత్మకూరు మధ్యలో 75 కిలోమీటర్లు, కర్నూలు-నంద్యాల మధ్య 72 కిలో మీటర్ల దూరం ఉంది. మధ్యలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయలేదు. మంత్రాలయంతోపాటు గ్రామీణ ప్రాంతాల తాకిడి ఎక్కువగా ఉన్న కోవెలకుంట్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఎంతైనా ఉంది.
- ప్రస్తుతం ఉన్న ఫైరింజన్లకు తగ్గట్లు 155 మంది ఫైర్‌మెన్లు ఉండాలి. కాని 116 మంది మాత్రమే ఉండడంతో 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 44 మంది డ్రైవర్లకు 38 మంది ఉన్నారు. దీంతో హోం గార్డులతో కాలం సాగదీస్తున్నారు. అన్నిమాపక శాఖలో నిధుల కొతర వేధిస్తోంది. 2014-15 వార్షిక సంవత్సరానికి గాను రూ.80లక్షలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.45.71లక్షలు మాత్రమే ఇచ్చారు. మరో 20 శాతం ట్రెజరీలో ఫ్రీజ్ అయ్యాయి. రూ.23లక్షలు మంజూరు కాకపోవడంతో ఆరు నెలలుగా వేతనాలు అందన హోం గార్డులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల సహకారం అవసరం :
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా తీసుకోవాలి. మంట ప్రారంభమైన వెంటనే ఆర్పేందుకు కృషి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆలస్యం చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు మంటలు పెద్దగా వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రం కావచ్చు. ప్రస్తుతానికి ఆలూరు తప్ప అన్ని కొత్త వాహనాలే. నందికొట్కూరు, కోవలకుంట్ల, పాణ్యం, మంత్రాలయంలలో ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. ఎం. భూపాల్‌రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్.
సమస్యల ఫైర్
Published Mon, Mar 2 2015 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement