ఎప్పుడైనా కూలిపోవచ్చు.. జాగ్రత్త సుమా! | Beware fetch the collapse ever ..! | Sakshi
Sakshi News home page

ఎప్పుడైనా కూలిపోవచ్చు.. జాగ్రత్త సుమా!

Published Sat, Feb 21 2015 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

Beware fetch the collapse ever ..!

‘‘ పైకప్పు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కార్యాలయాల్లో కూర్చుని విధులు నిర్వహించవద్దు.’’ అంటూ రోడ్లు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులు చేసిన హెచ్చరికలు జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు రేపుతున్నాయి. సాక్షాత్తూ.. జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌లోనే ఈ పరిస్థితి నెలకొంది.
 
 కర్నూలు అగ్రికల్చర్: ‘‘ పైకప్పు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కార్యాలయాల్లో కూర్చుని విధులు నిర్వహించవద్దు.’’ అంటూ రోడ్లు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులు చేసిన హెచ్చరికలు జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు రేపుతున్నాయి. సాక్షాత్తూ.. జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌లోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల రెండు రోజుల పాటు ఆర్‌అండ్‌బీ డీఈ ఇందిర, అసిస్టెంటు ఇంజినీర్లు కలెక్టర్ కార్యాలయం, దానిపైన ఉన్న వ్యవసాయ శాఖ జేడీఏ కార్యాలయాలను పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి చాంబర్లను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇచ్చిన కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఈ కార్యాలయాలను ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు. గోడలు బాగా దెబ్బతిని ఉండటాన్ని గుర్తించి దీనిపైన ఉన్న వ్యవసాయ శాఖ జేడీఏ కార్యాలయాన్ని పరిశీలించారు.
 
  పై కప్పు పెచ్చులుగా ఊడిపడి ఉండటాన్ని గుర్తించి ఆర్‌అండ్‌బీ అధికారులు విస్తుపోయారు. పెచ్చులు ఊడటానికి కారణాలను లోతుగా పరిశీలించగా కడ్డీలు మొత్తం కరిగిపోయినట్లు గుర్తించారు. సిమెంటు కాంక్రీటు పటిష్టంగా ఉండటానికి ఇనుప కడ్డీల సపోర్టు అవసరం. కడ్డీలు కరిగి బలహీనంగా మారడంతో  సిమెంటు కాంక్రీటు పెచ్చులుగా ఊడి పడుతున్నట్లు గుర్తించారు. పైకప్పు ఎప్పుడు కూలిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, వీటి కింద కూర్చొని విధులు నిర్వహించవద్దని వ్యవసాయ అధికారులకు గట్టిగానే చెప్పారు. అంతేగాక ఒక్కరోజు కూడా ఇందులో కూర్చోవద్దని హెచ్చరించడం వ్యవసాయశాఖలో కలకలం రేపింది. ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించింది... కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కలెక్టర్ కార్యాలయం పైన ఉన్న జేడీఏ కార్యాలయాలను మాత్రమే. వ్యవసాయ శాఖ కార్యాలయ పరిస్థితే స్టేట్ ఆడిట్, డీఆర్‌డీఏ-డ్వామా కార్యాలయాల్లోను నెలకొని ఉంది. కలెక్టరేట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆఫీసుల్లో కూర్చుని విధులు నిర్వహించడానికి అధికారులు హడలి పోతున్నారు.
 
 నిర్మాణం ఇలా..
 కలెక్టరేట్ భవన సముదాయానికి 1983 జులై నెల 5న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శంకుస్థాపన చేశారు. 1991కి పనులు పూర్తయ్యాయి. 1998 ఆగస్టు 18న అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. దాదాపు 23 సంవత్సరాల కాలానికే కలెక్టర్ కార్యాలయం పైకప్పులు ఊడి పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పైన వర్షపు నీరు ఎక్కువగా నిలుస్తుండటం వల్ల కాంక్రీట్‌లోని ఇనుప కడ్డీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందువల్ల కాంక్రీటుకు సపోర్టు లేక పైకప్పు పెచ్చులుగా ఊడి పడుతోంది. ఇది ఉద్యోగులు, అధికారులకు గుబులు రేపుతోంది. ఏడాదిన్నర క్రితం జేడీఏ ఠాగూర్ నాయక్ తనచాంబర్‌లో విధులు నిర్వహిస్తుండగా పైకప్పు పెచ్చులుగా ఊడి పడింది. ఈ సంఘటనలో జేడీఏకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
 
 ఇందులో ఉండి విధులు నిర్వహించలేం...
 కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంపై కప్పు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నందున ఇందులో కూర్చుని విధులు నిర్వహించలేమని అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఇతర భవనాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరనున్నట్లుగా అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement