సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో వక్ఫ్ భూములు కబ్జా కోరల్లోకి వెళ్తున్నాయి. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో.. నగర నడిబొడ్డున ఉన్న వక్ఫ్‌బోర్డుకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమిని అక్రమార్కులు ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. రీ సర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్(ఆర్‌ఎస్‌ఆర్)లో స్పష్టంగా వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలం అని ఉన్నా.. ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్ జరుగుతోంది. అదేమంటే.. ఇది వక్ఫ్‌బోర్డు భూమి అని తమకు లేఖ అందలేదని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సెలవిస్తున్నారు. మొత్తం మీద కేసీ కెనాల్‌కు పక్కనే జొహరాపురం రోడ్డులో సర్వే నెంబర్లు 911, 912లోని 7.25 ఎకరాల భూమిలో ఇప్పటికే సుమారు 4 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఇక్కడ ఎకరా భూమి విలువ ఏకంగా రూ.5 కోట్లకు పైమాటే. ఈ లెక్కన రూ.20 కోట్లకు పైగా విలువ చేసే భూమి అక్రమార్కులపరమైంది. మిగిలిన భూమినీ సబ్ డివిజన్లు చేసి కాజేసేందుకు రంగం సిద్ధమయింది.
ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా..
వాస్తవానికి 911, 912 సర్వే నెంబర్లలోని భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదనే విషయం ఆర్‌ఎస్‌ఆర్‌లో స్పష్టంగా ఉంది. 911 సర్వే నెంబర్‌లోని 4.89 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డునకు చెందినది. అయితే మసీదు ముజావర్ అహ్మద్ హుసేని ఖాద్రీ పేరుతో ఈ భూమి ఉంది. వాస్తవానికి ఈయన హక్కుదారు కాదు. ఒక విధంగా చెప్పాలంటే కేవలం కాపలాదారు మాత్రమే. ఇక 912 సర్వే నెంబరులో 2.36 ఎకరాల భూమి మహమ్మెదాన్ శ్మశానవాటిక(గోరీలు)కు చెందిన భూమి అని స్పష్టంగా ఉంది. అయితే, ఇప్పటికే 911 సర్వే నెంబర్‌లోని 4.89 ఎకరాల్లో 4.49 ఎకరాల భూమి ఇతరుల పేర్లతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.
డివిజన్లు చేసి ఢమాల్
911, 912 కేవలం రెండు సర్వే నెంబర్లే. అయితే కబ్జారాయుళ్లు ఈ నెంబర్లను డివిజన్లు చేసి కాజేస్తున్నారు. ఇప్పటికే 911 సర్వే నెంబరులోని 4.89 ఎకరాలను 911/ఎ నుంచి 911/ఈ దాకా ఐదు సబ్ డివిజన్లు చేసి 4.49 ఎకరాలను ఆక్రమించుకున్నట్టు సమాచారం. మిగిలిన 912 సర్వే నెంబరును కూడా మూడు సబ్ డివిజన్లు చేశారు. ఇందులో 912/ఏ-98 సెంట్లు, 912/బిలో 1.19 ఎకరాలు, 912/సీలో 19 సెంట్లను సబ్‌డివిజన్లు చేసి రెవెన్యూ రికార్డులో ఉంచారు.
అంటే ఈ భూమిని కూడా కాజేసేందుకు రంగం సిద్ధమైందనే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి 912లో ఉన్నదంతా శ్మశాన భూమి. అక్రమార్కులు ఈ భూమిలోనూ పాగ వేయడం చూస్తే ఎంతటి కక్కుర్తికి పాల్పడుతున్నారో అర్థమవుతోంది. ఇదిలాఉంటే ఈ భూములు వక్ఫ్ బోర్డునకు చెందినవంటూ లేఖ రాయాలని పలు విన్నపాలు వచ్చినప్పటికీ బోర్డుకు అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కాలయాపన చేస్తున్న కమిటీ
వక్ఫ్ భూములను కాపాడేందుకు కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూములను ఈ కమిటీ గుర్తించి రక్షణ గోడలను ఏర్పాటు చేయాలి.
ఇప్పటికే కబ్జా అయిన భూములను గుర్తించి వెంటనే వారి పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసి.. వక్ఫ్ బోర్డు పరిధిలోకి మార్చాలి. అయితే, జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ ప్రక్రియను పూర్తిగా విస్మరించింది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగా.. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి మాత్రమే సమావేశమవడం కమిటీ పనితీరుకు అద్దం పడుతోంది.
వక్ఫ్ భూములనే సమాచారం లేదు
గతంలో కల్లూరు గ్రామ పంచాయతీ కింద ఉండి.. కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన సర్వే నెంబర్లు 911, 912లోని మొత్తం 7.25 ఎకరాల భూమి వక్ఫ్ పరిధిలోనిదనే సమాచారం మాకు లేదు. అందువల్లే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.
- మహబూబ్ బాషా,
కర్నూలు రిజిస్ట్రార్-1
వక్ఫ్ భూమి.. అయితేనేమి!
Published Thu, Jul 30 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement