చిత్తూరు జిల్లా మంచినీటి పథకంలో రూ.600 కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాకు తాగునీరు అందించే పథకం పేరుతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రూ. 600 కోట్లు ముడుపులు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఈ కుంభకోణంపై ఒక సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి సోదరుడు ఎన్.సంతోష్‌కుమార్‌రెడ్డి దళారీ పాత్ర పోషించారని, నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ శ్రీధర్‌రెడ్డి చక్రం తిప్పారని ధ్వజమెత్తారు. పైకి చూడటానికి ఈ పథకం చిత్తూరుకు నీరందించేదిగా ఉందని వాస్తవానికి ఇది ముఖ్యమంత్రి జేబులు నింపే వ్యవహారంగా ఉందని ఆయన విమర్శించారు.
కమిషన్లకు కక్కుర్తిపడి ఈ పథకం అంచనా వ్యయాన్ని 30 నుంచి 40 శాతం మేరకు పెంచేసి టెండర్లు పెంచారన్నారు. నెల్లూరు జిల్లా కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు 6.6 టీఎంసీలను తరలించాలనే ఈపథకం ద్వారా ప్రజల దాహార్తి తీరుతుందని పైకి చెబుతున్నా ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రూ. 2500 కోట్ల రూపాయల అంచనాతో పూర్తయ్యే ఈ పథకం వ్యయాన్ని రూ.5300 కోట్లకు పెంచి సుమారు రూ.2000 కోట్లు కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా చేసి అందులో నుంచి రూ. 600 కోట్లు ముఖ్యమంత్రి కాజేయాలనుకుంటున్నారని భూమన వివరించారు. ఐదు ప్యాకేజీలుగా విభజించిన ఈ టెండర్లలో ఎవరినీ పాల్గొననీయకుండా తమకు రహస్యంగా డబ్బు ఇచ్చే కంపెనీలనే అధికారుల చేత సాంకేతికంగా అర్హత పొందేలాగా చేసుకున్నారని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను ఏదో ఒక సాంకేతిక కారణాలు చూపి అనర్హులుగా చేశారన్నారు.
ఈ బిడ్లను సోమవారం తెరిచి తాము అనుకున్న విధంగా కంపెనీలకు ప్యాకేజీలు క ట్టబెట్ట బోతున్నారన్నారు. తనది నిజాయితీ, పారదర్శక పాలన అని పైకి చెప్పుకుంటున్న కిరణ్ వాస్తవానికి మేక వన్నె గల పులిలాగా అవినీతికి బాటలు వేస్తున్నారని, రాష్ట్ర విభజన విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. సమైక్యవాదినని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకు కేంద్రానికి అన్ని విధాలా ఎలా సహకరిస్తున్నారో ఇందులో కూడా తాగునీటి పథకం అని చెప్పి ముడుపులు కైంకర్యం చేసే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. కిరణ్ ద్విముఖుడు అని పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి అని ఆయన దుయ్యబట్టారు. మరో మూడు నెలల్లో ముగియనున్న తన పాలన ఆరిపోయే దీపంలాగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి ముడుపులు దండుకునే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నది రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఏమాత్రం కాదని చరమాకంలో అందిన కాడికి ముడుపులు దండుకోవడానికేనని విమర్శించారు.
నిజంగా కిరణ్ సమైక్యవాది అయితే విభజన ప్రక్రియను ప్రారంభించినపుడే తన పదవికి రాజీనామా చేసి ఉండేవారని అలా చేయకుండా ఇంకా కొనసాగుతున్నారంటే ముడుపులు దండుకోవడానికేనన్నారు. పార్లమెంటుకు బిల్లు రాకముందే విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి అసెంబ్లీని సమావేశ పర్చమని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినా కిరణ్ పట్టించు కోకుండా విభజనకు అన్ని తలుపులూ తెరిచి ఉంచారన్నారు. చివరకు టీచర్ల బదిలీల్లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే లక్ష రూపాయల చొప్పున ముడుపులు దండుకునే కార్యక్రమం జరుగుతోందని ఆయన విమర్శించారు. కిరణ్ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యానించాల్సిందిగా కోరగా ‘ఆయనది ఓ అసమర్థుని జీవన యాత్ర...మూడేళ్లయితేనేమి, ముప్ఫై ఏళ్లయితేనేమి!’ అని భూమన అన్నారు.
సి.ఎం.రమేష్ ఓ లఫంగి
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, సోనియాగాంధీతో కుమ్మక్కు అయ్యారని,జగన్ వెళ్లి సోనియాను అడిగితే రాష్ట్ర విభజన ఆగిపోతుందని లేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అర్థం లేకుండా ఓండ్ర పెడుతున్న రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ ఒక రాజకీయ లఫంగి అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబ్బులిచ్చి రాజ్యసభ టికెట్ కొనుక్కున్న వాడివి, దొంగసారా అమ్మినవాడివి, కల్తీసారా తయారీలో నిష్ణాతుడివి అయిన నువ్వా...జగన్ మీద ఆరోపణలు చేసేది, అసలు నువ్వేమిటి, రాజకీయ సన్యాసం చేయడం ఏమిటి! నీకు రాజకీయం ఏముంది, నువ్వు సారా సన్నాసివి, ఒట్టి సన్నాసివి, సన్నాసులు కూడా సవాళ్లు విసరడం దిగజారుడుతనం తప్ప మరొకటి కాదు’ అని భూమన విమర్శించారు.
సోనియాతో అవగాహన ఉన్నందునే జగన్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదే పదే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని చెబుతున్న టీడీపీ నేతలు రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చినపుడు చంద్రబాబునాయుడు ఆయనను కలవడానికి అనుమతి ఎందుకు కోరలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరితే ఇవ్వలేదనడం అర్థరహితమని తాము కలవడానికి అనుమతి కోరామని పత్రికలకు టీడీపీ వాళ్లు చెప్పడమే తప్ప వాస్తవానికి వారడిగిందే లేదన్నారు. ప్రణబ్ వంటి అందరి మన్ననలూ పొందిన మేధావిపై అభాండాలు వేయడం తగదన్నారు. అవిశ్వాసతీర్మానం, ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌తో సహా అడుగడుగునా కాంగ్రెస్‌తో కుమ్మక్తవుతున్నది చంద్రబాబేనని ఆయన అన్నారు.