(ఫైల్ ఫోటో)
సాక్షి, తిరుపతి: పేదల ఆరోగ్యం విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మొదటి నుంచీ అవగాహన ఉందని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రిలో ‘ఆరోగ్య శ్రీ ఆసరా’ పథకం లబ్ధిదారులకు సోమవారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ తిరుపతిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలోనే వైఎస్సార్ పేదల కోసం ఆలోచించారని తెలిపారు. ఆ తర్వాతే ఆయన పులివెందులలో ఒక్క రూపాయికే పేదప్రజలకు ఆరు సంవత్సరాల పాటు వైద్యం అందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి వైఎస్సార్ ప్రజలందరి గుండెల్లో కొలువయ్యారని తెలిపారు. ఇలా పేదల కోసం వైద్య పథకాన్ని తీసుకురావడం అప్పట్లో దేశ చరిత్రలోనే రికార్డు అని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకువేశారని, చికిత్స అనంతరం నిరుపేద ప్రజలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని, రోగులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారికి ఏ కష్టం ఎదురుకాకుండా సహాయం చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా దేశంలో గొప్ప చరిత్ర అని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ఈ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment