సాక్షి, అమరావతి: రోడ్లపై కుయ్.. కుయ్‌మని సౌండ్ చేస్తూ తిరిగే 108 అంబులెన్సు.. ఆరోగ్యశ్రీ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004కి ముందు బడుగు, బలహీనవర్గాలు, పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఏవైనా పెద్ద జబ్బుల బారినపడితే ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి. పెద్ద జబ్బులు వస్తే ప్రాణాలపైన ఆశలు వదులుకోవాల్సిందే.
వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని.. అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి దైన్యంతో నిండిపోయిన కుటుంబాలే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ ఆరోగ్య దాతగా.. అభయ ప్రదాతగా నిలిచారు. పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టి ఎంతోమంది రోగులకు ఆయుష్షు పోశారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దైన్యం.. అప్పుల సుడిగుండంలో చిక్కుకోవాల్సిన బాధలు తప్పాయి.
ఆపద్బంధు 108
ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడమే కాకుండా ప్రమాదాల్లో గాయపడిన వారిని, అనారోగ్యంతో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్సును కేటాయించారు. అవసరమున్నవారు ఎవరైనా 108కి ఫోన్ చేస్తే నిమిషాల్లోనే వారి వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడానికి 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో 18 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వివిధ పేర్లతో అమలు చేస్తుండటం విశేషం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. అదే విధంగా 108, 104 సేవలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.
కొత్త ఊపిరిలూదిన సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో పడకేసిన ఆరోగ్యశ్రీ సేవలకు కొత్త ఊపిరిలూదారు. 108, 104 పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంతోపాటు వీటి సంఖ్యను మరింత పెంచారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ప్రొసీజర్లను 1,059 నుంచి ఏకంగా 3,257కు పెంచారు. అంతేకాకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయానికి రోగులకు నెలకు రూ.5 వేల వరకు భృతిని కూడా అందిస్తున్నారు.
వైద్య విద్య బలోపేతానికి కృషి
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య విద్య బలోపేతానికి వైఎస్సార్ చేసిన కృషి అమోఘం. ఆయన సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో కడప, ఒంగోలు, శ్రీకాకుళం, ఆదిలాబాద్‌ల్లో రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లను ఏర్పాటు చేశారు. అలాగే కడపలో దంత వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలోపేతమైంది.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకే. ఈ క్రమంలో సీఎం జగన్ ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఐదు వచ్చే ఏడాది, మిగిలిన ఏడు 2025–26 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment