సీఎం వైఎస్‌ జగన్‌: ఆరోగ్య కాంతులు | AP Govt Released 4 GO's in One Day on Implementing Aarogyasri Scheme - Sakshi
Sakshi News home page

ఆరోగ్య కాంతులు

Published Sun, Oct 27 2019 3:38 AM | Last Updated on Mon, Oct 28 2019 11:16 AM

Four key orders were released in a single day in relation to the Aarogyasri scheme - Sakshi

ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ.. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులకే కష్టమొచ్చి వ్యాధుల బారినపడి మంచానికే పరిమితమైన దుస్థితి.. ఆస్తులమ్ముకున్నా కూడా వైద్యానికి సరిపోక.. ప్రభుత్వం ఆదుకోక.. జీవశ్ఛవాలుగా మారిన దయనీయ పరిస్థితి.. వారందరి కష్టాలను 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా విన్నారు.. కళ్లారా చూశారు.. ‘జగన్‌ అనే నేను.. ఉన్నాను’ అంటూ అభయమిచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదునెలలైనా కాకముందే ఇచ్చిన మాట మేరకు పేదలందరికీ మరోజన్మను ప్రసాదించే ‘ఆరోగ్యశ్రీ’ పథకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సీఎం నిర్ణయాలపై సర్వత్రా ‘దటీజ్‌ వైఎస్‌ జగన్‌..’ అంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, అమరావతి: లక్షలాది మంది వ్యాధిగ్రస్తులకు వైద్యం అందక, సొంతంగా వ్యయం చేసి వైద్యం చేయించుకోలేక రకరకాల బాధలు అనుభవిస్తున్న పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి కానుక ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి శనివారం నాలుగు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గుండె జబ్బులు, న్యూరో, ప్లాస్టిక్‌ సర్జరీ, రేడియేషన్‌ అంకాలజీ వంటి పలు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఇకపై నవంబర్‌ 1 నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లోనూ పొందడానికి అవకాశం కల్పించారు. రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన బాధితుడు కుటుంబ పోషకుడైతే ఆ కుటుంబం వీధినపడే పరిస్థితి ఇకపై ఉండదు. రకరకాల వ్యాధులతో మంచానపడిన వారికి నెలవారీ పెన్షన్‌ ఖరారు చేసింది.

రోగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే ఇంట్లో భార్యా పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకూ పరిష్కారం చూపుతూ.. కుటుంబ పెద్ద.. రోగంతో మంచానపడితే చికిత్స తర్వాత కోలుకునే వరకూ రోజుకు రూ.225 చొప్పున ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇన్నాళ్లూ అత్తెసరు వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.16 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ కీలక నిర్ణయాలతో రాష్ట్రంలో సామాన్య ప్రజలందరికీ సర్కారు దీపావళి కానుక ప్రకటించినట్టయింది. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వైఎస్‌ జగన్‌ వడివడిగా అడుగులు ముందుకేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులపై నిపుణుల కమిటీ నియమించి, ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని వాటి అమలుకు శ్రీకారం చుట్టారు.

716 జబ్బులకు నవంబర్‌ 1 నుంచి ఇతర రాష్ట్రాల్లో వైద్యం
సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అవసరమైన పలు జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో వైద్యం అందడం లేదు. 2019 నవంబర్‌ 1వ తేదీ నుంచి ఈ జబ్బులన్నిటికీ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో వైద్యం చేయించుకునేందుకు అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 17 సూపర్‌ స్పెషాలిటీ సేవల్లో భాగంగా 716 జబ్బులను సర్కారు పేర్కొంది. ఈ జబ్బులన్నింటికీ రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లో నిర్ణయించిన జాబితాలోని ఆస్పత్రుల్లోగానీ ఉచితంగా వైద్యం పొందే అవకాశం కల్పించింది. రోగులకు మరింత మెరుగైన సేవలకు 71 మంది ఆరోగ్యమిత్రలను, ముగ్గురు ఆఫీస్‌ అసోసియేట్లను, ముగ్గురు జిల్లా కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

పేద రోగులకు ఎంతో మేలు 
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద రోగులకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదే. ఆయన తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు పథకాన్ని నీరుగార్చాయి. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఆసుపత్రులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని ఆస్పత్రుల్లోనూ ఈ పథకం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. దీనివల్ల ఎంతో మంది పేదల ప్రాణాలు నిలిచే అవకాశం ఏర్పడింది. మంచి వైద్యం పొందేందుకు వీలుంటుంది. ఇది చాలా కీలక నిర్ణయం. 
–  జిలానీ బాషా, మెకానిక్, కర్నూలు

కోలుకునే సమయంలో కొండంత అండ
కుటుంబాన్ని పోషించే వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరితే ఆ కుటుంబానికి దిక్కెవరు? ఇకపై ఇలాంటి ప్రశ్నలకు తావు లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు ఆస్పత్రిలో చేరి కోలుకుంటున్న సమయంలో కొండంత అండగా ఉన్నామంటూ రోజుకు రూ.225 చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా సర్జరీ చేయించుకుంటే కనీసం వారం రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో ‘పోస్ట్‌ ఆపరేటివ్‌ అసిస్టెన్స్‌ (చికిత్స అనంతరం రోగికి సాయం) పేరుతో ఆ రోగికి రోజుకు రూ.225 చొప్పున ఇస్తారు. ఈ సొమ్ము గరిష్టంగా రూ.5 వేల వరకు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇలా చికిత్స సమయంలో ఆసరా పొందే బాధితులు ఏటా 80 వేల నుంచి లక్ష మంది ఉంటారని అంచనా. మొత్తం 131 జబ్బులకు సంబంధించి రోగులు ఇలా ఆస్పత్రిలో కోలుకోవాల్సి ఉంటుందని, వాళ్లకు ఇది కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వం వారికి సాయం ప్రకటించింది. ఈ సాయం 2019 డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

పేదలపై ప్రేమ కనిపిస్తోంది 
పేదలంటే ఆ గొప్ప మనసులో ఉన్న ప్రేమ ఆయన ప్రతి నిర్ణయంలో రాష్ట్ర ప్రజల కళ్లకు కనిపిస్తోంది. ఒక పేద కుటుంబంలో కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద ఆసుపత్రి పాలైతే ఆ కుటుంబం అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. అటువంటి సమయంలో ఆ ఇంటి పెద్దగా ముఖ్యమంత్రే ఆదుకునేలా ఆసుపత్రిలో చేరిన కుటుంబ యజమానికి రోజుకు 225 రూపాయలు ప్రభుత్వం తరపున ఇవ్వాలన్న నిర్ణయం సీఎం దయార్ధ హృదయాన్ని లోకానికి చాటుతోంది.
– గుబ్బల నరసింహమూర్తి, రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్‌
దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి జీవితాంతం మంచానికే పరిమితమైతే ఆ వ్యక్తి పరిస్థితేమిటి? ఆ కుటుంబానికి ఆ బాధితుడి వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. తలసేమియా బాధితుడు ఒక్కసారి రక్తం ఎక్కించుకోవాలంటే ఎంత వ్యయమవుతుంది? పక్షవాతానికి గురైన బాధితుడి పరిస్థితేమిటి? ఇలాంటి ఇబ్బందులు, బాధలకు తావులేకుండా వారికి నెలవారీ పెన్షన్‌ ఇస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. పెన్షన్‌పై తీసుకున్న ఈ నిర్ణయం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ జబ్బును బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ప్రకటించింది. నిపుణుల కమిటీ పలు జిల్లాలో పర్యటించి ఇచ్చిన నివేదికతో పాటు, వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్య నిపుణులు కూడా బాధితుల ఇబ్బందులపై నివేదిక ఇచ్చారు. దీనిపై సర్కారు తక్షణమే స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.


 నా పేరు పి.మదన్‌. కవిటి మండలం శ్రీహరిపురం అనే చిన్న పల్లెటూరులో ఉంటున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం మాది. ఐదారేళ్ల కిందట నాకు కిడ్నీ వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు. దీంతో నాకున్న కొద్దిపాటి భూమిని సైతం అమ్మేసి విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకున్నాను. ప్రస్తుతం కవిటి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దయవల్ల నెలకు రూ.10 వేల పెన్షన్‌ వస్తోంది. దీంతో వైద్యం కోసం బెంగ లేకుండా వైద్య సేవలు పొందుతున్నాను. అంతకుముందు నా భార్యాబిడ్డల సంపాదనతోనే నా వైద్యం సాగేది. జన్మజన్మలకూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేను. 
– పి.మదన్, కిడ్నీ బాధితుడు, శ్రీహరిపురం, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా

పారిశుధ్య కార్మికులకు వేతనం పెంపు
పారిశుధ్య పనులంటే అందరూ చేయలేని పని. ప్రత్యేక పరిస్థితుల్లోనే వాళ్లు పనిచేస్తుంటారు. అలాంటి వారు తక్కువ వేతనంతో ఎలా మనగలుగుతారు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ వేతనం పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకూ నెలకు రూ.6,500 మాత్రమే పారిశుధ్య కార్మికులకు వేతనం ఇస్తుండగా..వారి వేతనం నెలకు రూ.16 వేలకు పెంచుతున్నట్లు శనివారం సర్కారు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పెంచిన వేతనాలు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ పెంచిన వేతనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. పెంచిన వేతనాలు శానిటేషన్‌/కంటిజెంట్‌ వర్కర్లందరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మాకు మంచి రోజులు వచ్చాయి
నేను ఎంతో కాలంగా ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు మాకు ఇచ్చే జీతం ఏ మూలకూ సరిపోయేది కాదు. కానీ మా ఇబ్బందులు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగనన్న మాకు జీతాలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వడంతో మాకు మంచి రోజులు వచ్చాయి. నెలకు రూ.16 వేలు ఇచ్చేలా జీవో ఇవ్వడం  ఆనందంగా ఉంది. నాతో పాటు ఇక్కడ 200  మందికిపైగా పని చేస్తున్నారు. వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 
– గంటా జయమేరి, పారిశుద్ధ్య కార్మికురాలు, విజయవాడ

చాలామందికి భరోసా కల్పించినట్టే
రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడం వారికి భరోసా కల్పించినట్టే. దీనివల్ల చాలామందికి లబ్ధి కలుగుతుంది. దీన్ని నాలుగు కేటగిరీలుగా విభజించి అమలు చేయబోతున్నాం. ప్రధానంగా ఆపరేషన్‌ చేయించుకునే పేషెంట్లకు ఇది మంచి భరోసా ఇస్తుంది. ఉచితంగా వైద్యం లభిస్తుంది, చికిత్స సమయంలో సాయం అందుతుంది. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది కీలక నిర్ణయం.
–డా.ఎ.మల్లికార్జున, సీఈఓ, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ

మనసున్న ముఖ్యమంత్రి
మేము చాలా జిల్లాల్లో పర్యటించాం. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీకి అనుమతులు ఇవ్వడం, రోగికి కోలుకునే సమయంలో సాయం చేయడం గొప్ప నిర్ణయం. ముఖ్యమంత్రికి బాధితులకు సాయం చేయాలని మనసుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు వేగంగా తీసుకోగలిగారు.
డా.కె.సతీష్‌కుమార్‌రెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు

బాధితులు ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేదు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారో సర్కారుకు నివేదిక ఇచ్చాం. పెన్షన్‌కు ఎంతమంది అర్హులో చెప్పాం. వాళ్లకు పెన్షన్‌ ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దీనివల్ల ఇప్పటి వరకు మంచంలో ఉన్న ఈ బాధితులు ఈ పెన్షన్‌ వల్ల ఎవరిమీదా ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉండదు.
–డా.కె.వెంకటేష్, వైద్య విద్య సంచాలకులు

 ఐదు మాసాల్లో ఆరోగ్య శాఖలో సీఎం కీలక నిర్ణయాలు
– ఆశా వర్కర్లకు ఎన్నికలకు కొద్ది నెలల ముందు అప్పటి ప్రభుత్వం రూ.3 వేల పారితోషికం మాత్రమే ప్రకటించింది. అది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఆశా వర్కర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచారు. దీనివల్ల 40 వేల మందికి పైగా ఆశా వర్కర్లకు లబ్ధి.
– కిడ్నీ బాధితులకు రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచారు. ప్రధానంగా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది.
– రాష్ట్రంలో ఆస్పత్రుల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, రెండేళ్ల తర్వాత పరిస్థితులు దీనిద్వారా చూపిస్తారు. దీనికి సుమారు రూ.1,800 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 174 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 28 ఏరియా ఆస్పత్రులు, 11 జిల్లా ఆస్పత్రులు అభివృద్ధి చేస్తారు.
– ఉద్దానం ప్రాంతంలో రక్షిత మంచినీటి కోసం రూ.600 కోట్ల విలువైన పనులు ఇప్పటికే జుడిషియల్‌ ప్రివ్యూకు వెళ్లాయి. 
– పలాస, మార్కాపురంలో కిడ్నీ పరిశోధనా కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం. ఇప్పటికే పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు  ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. 
– మండలానికి ఒక 108 అంబులెన్స్, ఒక 104 వాహనం ఏర్పాటుకు నిర్ణయం. కొత్త వాహనాల కొనుగోలు టెండర్ల దశలో ఉన్నాయి. జనవరి నుంచి మార్చి నాటికి కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయి.
– 2020 జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద పైలెట్‌ ప్రాజెక్టుగా చికిత్స అందిస్తారు. వైద్యం బిల్లు రూ.వెయ్యి దాటిన పేదలందరూ ఈ పథకంలోకి వస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమలు అనంతరం నెలకొక జిల్లా చొప్పున అన్ని జిల్లాల్లో అమలు చేస్తారు. 
– జనవరి నుంచి అన్ని జిల్లాల్లో 1200 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందిస్తారు.
– డెంగీతో పాటు మరికొన్ని సీజనల్‌ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతించారు. 
–  డిసెంబర్‌ 21న రాష్ట్రంలో అందరికీ కొత్త హెల్త్‌కార్డులు (ఆరోగ్యశ్రీ) అందుబాటులోకి వస్తాయి. ఈ కార్డులో బాధితుడికి సంబంధించిన పూర్తి డేటా నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడు ఏ జబ్బుతో ఆస్పత్రికి వెళ్లినా గతంలో వచ్చిన జబ్బుల గురించి తెలుసుకోవచ్చు.  
– పాడేరు, విజయనగరం, మార్కాపురం, ఏలూరు, పులివెందుల, గురజాల, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికలు ఇప్పటికే తయారు చేస్తున్నారు.
– రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల నోటిఫికేషన్‌లో భాగంగా ఇప్పటికే 13,500కు పైగా ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేశారు. బోధనాసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
– రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు. దీనికోసం ఇప్పటికే 500 రకాల మందులతో అధికారులు జాబితా తయారు చేశారు.
– బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాంటీన్ల ఏర్పాటు. 
– ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి వస్తే వారికి వైద్యం నిరాకరించకూడదు. డబ్బుల్లేవని వారిని వెనక్కు పంపకూడదు. ప్రభుత్వమే దీనికి రూ.50 వేల వరకూ భరిస్తుంది. 
– ఇప్పటి వరకు ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ పథకంలో భాగంగా 65 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.8 లక్షల మంది విద్యార్థులకు కంటి చూపు సమస్యలున్నట్టు గుర్తించారు. వాళ్లందరికీ ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. త్వరలోనే కాలేజీ విద్యార్థులకు, మిగతా వారికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 
– ఆరోగ్యశ్రీలో డబుల్‌ కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ను చేర్చాలని సీఎం ఆదేశించారు.
– నియోజక వర్గానికి ఒకటి చొప్పున 175 ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement