గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిపుణుల కమిటీతో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన దిశగా అడుగు ముందుకు పడింది. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శాఖపై ఆయన ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన మందులు అందజేయాలని చెప్పారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఈ పథకం కింద దేశంలో ఎక్కడైనా వైద్య సేవలు పొందవచ్చు. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ‘108’, ‘104’ అంబులెన్స్ సేవలను మరింతగా అభివృద్ధి చేయాలని సీఏం సూచించారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. హాస్పిటళ్లలో సరిపడా సిబ్బందిని నియమించాలని చెప్పారు. బాగా పేరున్న డాక్టర్లను జిల్లాల్లో నియమించాలని, వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
మందుల సరఫరా వ్యవస్థ లోపభూయిష్టం
ప్రస్తుతం రాష్ట్రంలో మందుల కొనుగోలు, సరఫరా వ్యవస్థ అత్యంత లోపభూయిష్టంగా ఉందని నిపుణుల కమిటీ సభ్యుడు డా.దుట్టా రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న టెండరింగ్ విధానాలు పారదర్శకంగా లేవని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యులైన డా.చంద్రశేఖర్‌రెడ్డి, డా.సాంబశివారెడ్డిలు కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి, డీఎంఈ డా.కె.బాబ్జీ, ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి సీఈఓ డా.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కమిటీ సభ్యులు జిల్లాల పర్యటనకు వెళ్లాలి
ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలోని సభ్యులు బృందాలుగా ఏర్పడాలని, ఒక్కో బృందం మూడు జిల్లాల్లో పర్యటించాలని కమిటీ చైర్‌పర్సన్ సుజాతారావు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులతో పాటు నర్సులు, ఏఎన్‌ఎంలు, డాక్టర్లతో మాట్లాడాలని, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతోనూ చర్చించి, వారి సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పారు.
ఆగస్ట్ 20న ముఖ్యమంత్రికి నివేదిక!
వచ్చే నెల 3వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు సమావేశం కావాలని నిపుణుల కమిటీ సభ్యులు నిర్ణయించారు. జులై 20న ముఖ్యమంత్రిని సంప్రదించి, ఆయన సూచనల మేరకు ముందుకెళ్లాలని తీర్మానించారు. ఆగస్ట్ 20వ తేదీలోగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తమ నివేదిక అందజేయాలని భావిస్తున్నారు.
నిపుణులు కమిటీ తొలి భేటీ
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖలో సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ చైర్‌పర్సన్ సుజాతారావు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో కమిటీ తొలిసారి సమావేశమైంది. వివిధ కీలక అంశాలపై చర్చించారు. ఇకపై 20 పడకల ఆసుపత్రులనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని పలువురు సభ్యులు సూచించారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఆ పైస్థాయి ఆస్పత్రులన్నీ 24 గంటలూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రతి మండలానికి ఒక ‘108’ వాహనం, ఒక ‘104’ వాహనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాత వాహనాలు పనిచేయకపోతే కొత్తవి సమకూర్చుకోవాలని సభ్యులు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఒక మోడల్‌గా ఉండాలని కమిటీ సభ్యులు చెప్పారు. ఇలాంటి సమూల మార్పులు రెండేళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుందని చర్చించారు. ఈ సమావేశంలో వైద్యవిద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ మండలి తదితర విభాగాల అధికారులు తమ నివేదికలను సమర్పించారు.
ఆరోగ్య సేవల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి
నిపుణుల కమిటీకి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
ఆరోగ్యసేవల విషయంలో దేశానికి మోడల్‌గా రాష్ట్రం ఉండాలని, దీనికోసం కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యసేవల్లో సంస్కరణల కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యింది. సుమారు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు అంశాలపై కమిటీ సభ్యులకు రాష్ట్రంలో ఆరోగ్యసేవలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే ఆరోగ్యశ్రీని పూర్తిగా సమీక్షించాలని, రోగి వైద్యానికి రూ. 1,000 బిల్లు దాటితే ఆ రోగికి వైద్యం ఉచితంగా అందేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ అందడం లేదన్న వ్యాఖ్యలు వినిపించకూడదని స్పష్టం చేశారు. ఎంత పెద్ద జబ్బు చేసినా పేదలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో మండలానికొక 104 వాహనాన్ని ఏర్పాటు చేసి, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మందులు అందజేయాలని సూచించారు. అలాగే 108 అంబులెన్సులు కొత్తవి కొనుగోలు చేసి బాధితుడు ఫోన్ చేసిన 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంబులెన్సుల కొనుగోలుకు ఈ బడ్జెట్‌లోనే నిధులిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 104, 108, ఆరోగ్యశ్రీ పథకాల్లోని ప్రస్తుత పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నారు, బాధితులకు సత్వరమే సేవలందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నియమించిన ఈ నిపుణుల కమిటీ పని సిఫార్సులు చేయడం వరకే కాదని, ఆరోగ్యసేవలు ఎలా అందుతున్నాయో, పేదలకు లబ్ధి జరుగుతోందా లేదా అన్న దానిపైన పర్యవేక్షణ కూడా చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కమిటీతో తాను 15 రోజులకోసారి సమావేశం నిర్వహించి ఆరోగ్య సేవలను సమీక్షిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య క్యాంపులు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ప్రాథమిక దశలోనే జబ్బులను గుర్తించి దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment