ఓర్వలేకే అనారోగ్యపు రాతలు! | Eenadu Ramojirao Fake News On YSRCP Govt Medical Services | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే అనారోగ్యపు రాతలు!

Published Fri, Aug 11 2023 4:38 AM | Last Updated on Fri, Aug 11 2023 8:15 AM

Eenadu Ramojirao Fake News On YSRCP Govt Medical Services - Sakshi

సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెత. అలాంటి పరిస్థితే ఈనాడు అధిపతి రామోజీరావుకు దాపురించింది. ఒకప్పుడు అస్థవ్యస్థంగా ఉన్న ప్రజారోగ్యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో కుదుటపడుతుంటే.. ఈ కామెర్ల రోగి కుంటి సాకులు వెతుకుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏపీ 108 సౌండ్‌ గురించి చర్చిస్తుంటే.. రాజగురువుకు భయమేస్తున్నట్లుంది. అందుకే ‘వైద్య సేవల మెరుగు ఉత్తదే’ అంటూ ఉత్తుత్తి కథనం అచ్చే­శారు. రాష్ట్రంలో 108 వాహనాలు 768 ఉన్నాయి. మొబైల్‌ క్లినిక్స్‌ 104లు 936, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కింద 500 వాహనాలు సేవలందిస్తున్నాయి. మొత్తం 2,204 వాహనాల ద్వారా ప్రజల ప్రాణా­లను అత్యంత వేగంగా కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇదే రామోజీ కడుపుమంటకు అసలు కారణం.

ఇప్పుడు మండలానికి ఒక అంబులెన్సు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సుల సంఖ్య 531. అవి కూడా నిర్వహణ సక్రమంగా లేక మూలనపడి మూలుగుతున్నాయి. 336 వాహనాలు అరకొరగా రోడ్లపై కనిపించేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్‌ కూడా లేని దుస్థితి. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్‌ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులె­న్సులను ప్రారంభించారు. 26 నియోనాటల్‌ అంబులెన్స్‌ సేవ­లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది.

ఇందు కోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈ వాహ­నాలు ప్రజల ప్రాణాలు కాపాడాయి. 2022 అక్టోబర్‌లో అదనంగా మరో 20 108 అంబులెన్సులను గిరిజన ప్రాంతాల్లో చేర్చా­రు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. ఇప్పుడు 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలో మీటర్ల­కుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రభుత్వం ఈ ఏడాది కొనుగోలు చేసింది.

దీని కోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చి­స్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108అంబులెన్సుల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ కళ్లకు గంతలు, చెవుల్లో దూది పెట్టుకున్న­రామోజీకి ఇవేవీ కనిపించడం లేదు. వినిపించడం లేదు.

108లు నాడు–నేడు..
గతంతో పోలిస్తే అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చే సమయం బాగా తగ్గింది. వీటికి తోడు ఇపుడు నియోనాటల్‌ అంబులెన్సులు పెట్టడంతో నవజాత శిశు మరణాల రేటు తగ్గింది. అప్పట్లో 86 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్సులు ఉంటే వాటి సంఖ్య ఇప్పుడు 216కు పెరిగింది. గతంలో కొన్ని కేసులకు మాత్రమే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ) సూచించేవారు. ఇప్పుడు ప్రత్యేక ఫిజీషియన్‌ ద్వారా ఈఆర్‌సీ కేసులు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. అన్ని అంబులెన్స్‌లలోనూ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ లొకేషన్‌ సిస్టమ్స్‌ను పెట్టారు.

గతంలో మొబైల్‌ డేటా టెర్మినల్‌ లేదు. ఇçప్పుడు అన్ని అంబులెన్స్‌ల్లో అమర్చారు. సగటున 108 అంబులెన్సులు రోజుకు 3,809 కేసుల్లో సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి 2023 జూన్‌ వరకు 33,35,670 మందికి అత్యవసర సేవలు అందించాయి. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్సుకు ఫోన్‌ చేస్తే చేరే నిర్దేశిత సమయం 15 నిమిషాలుగా ఉంది. ఈ జూలై నాటికి అది 14.17 నిమిషాలకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 20 నిమిషాలు నిర్దేశిత సమయం కాగా ఇపుడు 17 నిమిషాల్లోనే చేరుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గతంలో 30 నిమిషాలుగా ఉంటే ఇపుడు అది 17–23 నిమిషాలకు తగ్గింది.

తల్లీబిడ్డలు క్షేమంగా!
గతంలో కేవలం 279 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ఉంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పేరిట గతంలో ఓమ్ని వాహనాలను వినియోగించేవారు. ఒకే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది గర్భిణులను తరలించేవారు. ఏసీ సదుపాయం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విశాలమైన ఎకో మోడల్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.

ఒక వాహనంలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నెల నుండి ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి  ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలలో మొత్తం 3,47,245 ప్రసవాలు జరగగా, అందులో  2,89,307 మంది బాలింతలను (83.3శాతం) ప్రసవానంతరం సురక్షితంగా వారి ఇళ్ళకు తరలించారు. ఇందుకు  ఒక్కో మహిళకు రూ.895 చొప్పున మొత్తం రూ.24,32,35,045లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

మారిన 104ల స్వరూపం
ప్రస్తుత ప్రభుత్వంలో 104 సర్వీసులు పూర్తిగా మార్పులు చేశారు. జూలై 2020లో 656 వాహనాలను (104లను) సీఎం జగన్‌ ప్రారంభించారు. తర్వాత మరో 20 వాహనాలను గిరిజన ప్రాంతాల్లో సేవలకోసం కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయడానికి వీలుగా అదనంగా 260 వాహనాలను (104లను) ప్రవేశపెట్టారు. మొత్తంగా 910 మొబైల్‌ క్లినిక్‌ యూనిట్లు నడుస్తు­న్నాయి.

వీటి ద్వారా జూలై 2022 నుంచి మే 2023 వరకూ 2,84,81,484 మంది రోగులు సేవలందుకున్నారు. ప్రతి రోజూ ఒక వాహనం ద్వారా గత ఏడాది 42 మంది సగటున సేవలు అందుకుంటే.. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం వల్ల ఆ సంఖ్య 75 మందికి పెరిగింది. ప్రభుత్వ వైద్యులు 15,50,783 కుటుంబాల దగ్గరకు వెళ్లి ఈ మొబైల్‌ యూనిట్ల ద్వారా సేవలందించారు. 12,39, 984 మంది గిరిజనులు ఈ మొబైల్‌ క్లినిక్స్‌ ద్వారా ఆరోగ్య సేవలు అందుకున్నారు. ఏడాదికి 108, 104 నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.334.72 కోట్లు వెచ్చిస్తోంది. 

విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
► వైద్యారోగ్య రంగంలో రాష్ట్రప్రభుత్వం దాదాపు 50వేల పోస్టులను భర్తీ చేసింది.
► నాడు – నేడు ద్వారా సుమారు రూ. 16,800 కోట్లు ఖర్చు చేస్తోంది. పీహెచ్సీలు, సీహెచ్సీలు, 
ఏరియా ఆస్పత్రులు, వైద్యకళాశాలల్లో సమూల మార్పులు తీసుకువచ్చింది.
► కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు, అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలు, మూడు క్యాన్సర్, ఒక కిడ్నీ ఆస్పత్రి, ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు నిర్మిస్తోంది.
► ప్రతి సచివాలయంలో విలేజ్‌ అర్బన్‌ క్లినిక్‌ ను పెట్టింది.
► మంచి ప్రమాణాలున్న మందులనే అందిస్తోంది.
► 2019 నాటికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు వేయి ఉంటే వాటిని 3,255కి పెంచింది. 
► చికిత్స తర్వాత రోగి కోలుకునేంత వరకూ అండగా నిలుస్తూ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా అందిస్తోంది.  

దేశంలో అగ్రస్థానంలో ఏపీ
25 కోట్లకుపైగా జనం ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 988 అంబులెన్సులు సేవలందిస్తుండగా అంతకంటే ఐదు రెట్లు తక్కువ జనాభా కలిగిన ఏపీలో 768 అంబులెన్సులు సేవల్లో ఉన్నాయి. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లో చాలా తక్కువ సంఖ్యలో అంబులెన్సులు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్సు ఉంది. తెలంగాణలో 75, 524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్‌లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒక అంబులెన్సు మాత్రమే ఉండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement