
తిరుపతి మంగళం: వైఎస్సార్ కుటుంబానికి తాను ఎప్పటికీ విధేయుడినేనని, తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. మహాత్మ గాంధీ ఆత్మకథ పునఃముద్రణ పుస్తక ఆవిష్కరణ సభలో తాను యథాతథంగా పలికిన గాంధీ మహాత్ముడి మాటలను కొన్ని పత్రికలు, చానల్స్ వక్రీకరించడం బాధాకరమన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
► మహాత్మాగాంధీ ఆత్మకథ పునఃముద్రణ పుస్తకాన్ని శనివారం భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆవిష్కరించే సభలో నేను మాట్లాడిన మాటలకు కొంత మంది దురుద్దేశాలు ఆపాదించారు.
► నేను చాలా నిబద్ధత కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిని. వైఎస్ కుటుంబంతో నాకు 48 ఏళ్ల అనుబంధం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమేయం వల్ల నేను తీవ్రవాద రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చా. ఆయన కుటుంబానికి రాజకీయ సేవ చేసుకోవడం కోసమే నేను ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉన్నాను.
► నా ఊపిరి ఉన్నంత వరకు నా రాజకీయ జీవితం మా నేత జగన్‌తోనే కొనసాగుతుంది. నా నాయకుడి మీద నేను అసహనం చూపిస్తే నాకంటే పాపి మరొకరు ఉండరని తెలుగు ప్రజలకు మనవి చేస్తున్నా.