ఫ్యాను స్పీడుకు పార్టీలన్నీ ఖాళీ
- జనాదరణ చూసి ప్రతిపక్షాల గుండెల్లో వణుకు
- రోడ్‌షోలో భూమన కరుణాకరరెడ్డి
- తిరుపతిలో వైఎస్‌ఆర్ సీపీ రోడ్‌షోకు విశేష స్పందన
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: తిరుపతిలో ఉప్పెనలా వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జనప్రవాహాన్ని ఆపే సత్తా ఎవ్వరికీ లేదని, సీలింగ్ ఫ్యాను స్పీడుకు ఇతర పార్టీలన్నీ ఖాళీ అవుతాయని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలోని సుందరయ్యనగర్, మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్, వీవీమహల్‌రోడ్డు, భవానీనగర్, తీర్థకట్టవీధి, దొడ్డాపురంవీధి, తుడా సర్కిల్, తాతయ్యగుంట, పెద్దకాపువీధి ప్రాంతాల్లో శుక్రవారం భూమన కరుణాకరరెడ్డి వేలాదిమందితో రోడ్‌షో నిర్వహించారు.
రోడ్‌షోలో ఆయనకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టి, యువత పూలవర్షం కురిపిస్తూ నీరాజనం పలికారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజ ల్లో విశ్వసనీయత కలిగిన ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ కాం గ్రెస్ మాత్రమేనన్నారు. అందుకే ఎక్కడికెళ్లినా ప్రజలు అభిమానిస్తూ ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. సీమాంధ్రలో జోరుగా వీస్తున్న ఫ్యానుగాలికి ఇతర పార్టీలన్నీ కొట్టుకుపోతాయన్నారు.
వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ వెంట నడుస్తున్న జనసంద్రాన్ని చూసి ప్రతి పక్షాల గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గానికీ ఎలాం టి మంచి చేయని చంద్రబాబు ఇప్పుడు అవిచేస్తా ఇవి చేస్తానంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. అవినీతి, కుంభకోణాల్లో దోచుకున్న డబ్బును దాచుకునేందుకు కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర విభజనకు వీరిద్దరూ ప్రధాన కారకులన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇంతగా ద్రోహం చేసి ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతావంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
ఆరేళ్ల పాలనలో ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి చేశారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను గెలిపించాలని, జగనన్న అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల్లోని దాదాపు రూ.20వేల కోట్ల మహిళా రుణాలను మాఫీ చేస్తారని తెలిపారు. బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500లు ఇస్తారని గుర్తు చేశారు. రూ.6వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తారని హామీ ఇచ్చారు.
వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రతినెలా రూ.700 నుంచి వెయ్యి వరకు పెన్షన్ ఇప్పిస్తామని, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్‌కే.బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, షఫీ అహ్మద్‌ఖాదరీ, ఎంవీఎస్. మణి, బోయళ్ళ రాజేంద్రరెడ్డి, నాగిరెడ్డి, మునిరామిరెడ్డి, తిరుత్తుణి వేణుగోపాల్, దొడ్డారెడ్డి శంకర్‌రెడ్డి, గురవారెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, చింతా భరణీయాదవ్, చింతా రమేష్‌యాదవ్, ఈతమాకుల సురేష్‌యాదవ్, జయరాంయాదవ్, ఎస్‌కే. ముస్తఫా, నూరుల్లా, చెలికం కుసుమారెడ్డి, పుణీత పాల్గొన్నారు.