
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థకు అవసరమైన శస్త్రచికిత్సను చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పేదవాళ్లకు ఇంగ్లిష్ మీడియం అందించాలనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం అని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ఇంగ్లిష్ మీడియంపై టీడీపీ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు ఎవరైనా ప్రభుత్వ స్కూళ్లలోని తెలుగు మీడియంలో చదువుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. సమాజ గతి మారాలంటే ప్రాథమిక దశలో ఆంగ్ల మాధ్యమం కావాలని చెప్పారు.
కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు అందాలనేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. సాంకేతిక విద్యకు పేదలు దగ్గర కావాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు భాషకు ఎనలేని కృషి చేసిన మహాకవులు ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో చేయలేదని అన్నారు. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ మీడియాన్ని స్వీకరించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసేవారి కంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వారికి విద్యార్హతలు ఎక్కువ అని పేర్కొన్నారు. బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ సాహసమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా తెలుగు తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment