అసెంబ్లీ సాక్షిగా.. టీడీపీ బరితెగింపు | AP Assembly Session 2023: TDP Leaders Over Action At Assembly - Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా.. టీడీపీ బరితెగింపు

Published Fri, Sep 22 2023 3:23 AM | Last Updated on Fri, Sep 22 2023 2:54 PM

TDP Leaders Over Action At AP Assembly Sessions - Sakshi

అసెంబ్లీలో స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి గొడవ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ప్రతిష్టను దిగ­జా­రుస్తూ, స్పీకర్‌ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఎలాగైనా సరే సస్పెండ్‌ అవ్వాలన్న ఉద్దేశంతోనే సభలో అడుగుపెట్టిన వారు ఆద్యంతం వీధి రౌడీలను మరిపిస్తూ చిల్ల­రగా వ్యవహరించారు. పోడియంపైకి చేరుకుని అసభ్య చేష్టలు, సైగలతో రెచ్చిపో­యారు. పయ్యావుల, తది­తరులు సీనియర్‌ ఎమ్మెల్యేలు అయినప్పటికీ సభా మర్యాద పాటించలేదు. సభలో వీడియో చిత్రీకరణ నిషేధం అని తెలిసినప్పటికీ ఆ పనే చేస్తూ.. ఇలాంటి వాళ్లా మన ప్రజాప్రతిని­ధులు అని ప్రజలు ఛీదరించుకునేలా దిగజారి నడుచుకున్నారు. అరుపులు, కేకలు, బూతులే తమకు తెలుసన్నట్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. 

సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా టీడీపీ గురు­వారం ఇంకో మెట్టు దిగజారింది. సభలో ఏం మాట్లా­డాలో తెలియక అడ్డగోలుగా వ్యవహరించింది. బూతులు మాట్లాడుతూ.. స్పీకర్‌ను అడ్డుకుంటూ.. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉదయం 9 గంటలకు సభలో క్వశ్చన్‌ అవర్‌లో కల్యాణమస్తు పథకంపై ఎమ్మెల్యే వి.కళావతి అడిగిన ప్రశ్నకు మంత్రి మేరుగు నాగార్జున సమాధానం చెబుతుండగా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్ర­బాబు అరెస్ట్‌ అంశంపై వాయిదా తీర్మానం కింద చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, బాల­వీరాంజనేయస్వామి, చిన్నరాజప్ప తదితరులు నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియంలోకి చొచ్చుకు­వెళ్లారు.

వీరితోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే­లు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా కేకలు వేస్తూ వెళ్లి వారితో కలి­శారు. ఇరు వైపుల నుంచి స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్‌లు విసురుతూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో చంద్రబాబు పాత్రపై టీడీపీ వాయిదా తీర్మానం కోరిందని, ఆ సభ్యులకు కావా­ల్సి­నంత సమయం ఇచ్చి చర్చి­ద్దామని, అంతవరకు సంయమనం పాటించాలని శాసన సభ వ్యవహా­రాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్వీకర్‌ ద్వారా టీడీపీ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు.

సభ ప్రారంభమైనప్పటి నుంచి 28 నిమి­షా­లపాటు వా­రు నినాదాలు చేస్తూనే వికృత చేష్టలకు పాల్పడ్డారు. స్పీకర్‌ కుర్చీని సైతం లాగి పడేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కల్పించుకుని చంద్రబాబు అరెస్టు అంశం కోర్టు తేలుస్తుందని, ఆ విషయం అక్కడ వాదించుకోవాలని సూచించారు.

సభలో టీడీపీ సభ్యులు ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని, సభా మర్యాదలకు భంగం కలు­గుతుందని చెబుతుండగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పీకర్‌ టేబుల్‌పై ఉన్న పత్రాలను విసిరేసి, కంప్యూటర్‌ మానిటర్‌ను లాగిపడేశారు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ గ్లాసులో నీటిని టేబుల్‌పై పోయడంతో పలు పేపర్లు తడిచిపో­యా­యి. అయినా స్పీకర్‌ తమ్మినేని సంయ­మనంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 

ఎథిక్స్‌ కమిటీతో విచారణకు సిఫారసు
శాసనసభలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరిస్తే 365 నియమావళి ప్రకారం సదరు సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రాబడతామని స్పీకర్‌ సీతారాం చెప్పారు. వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు ఫైల్‌ చించి వేయడం, బాటిల్‌ను పగలగొట్టడం, స్పీకర్‌ పోడియం వద్ద మానిటర్, వైర్లను తుంచి వేయడం గర్హనీయ­మన్నారు.

సభా మర్యాదలను కాలరాస్తూ ప్రతిపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన, సభాపతి స్థానాన్ని ధిక్కరిస్తూ చోటుచేసుకున్న ఘటనలను పూర్తిగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లను సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు.

సరైన ఫార్మేట్‌లో వస్తే చర్చకు సిద్ధం
సభలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలి క్రిమినల్‌ చర్యల కిందకు వస్తుందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు సరైన ఫార్మేట్‌లో వాయిదా తీర్మానం ఇస్తే ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభను అటంక పరుస్తూ ఉండటంతో తొలుత 15మంది సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఈ క్రమంలో టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్, కింజారపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మ­కాయల చినరాజప్ప, ఘన వెంకటరెడ్డి నాయుడు, గద్దె రామ్మోహన్‌రావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిలతోపాటు ఉండవల్లి శ్రీదేవిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

అయితే వారు బయటకు వెళ్లకుండా నినా­దాలు చేస్తూ సభకు అడ్డుతగలడంతోపాటు బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరిస్తుండగా అధికార పక్ష సభ్యులు రోజా, ఉషశ్రీ చరణ్‌లు స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత పయ్యావుల కేశవ్‌ను ఒక రోజే సస్పెండ్‌ చేసినా.. నిబంధనలు తుంగలో తొక్కి వీడియోలు చిత్రీకరించినందుకు ప్రస్తుత సభాకాలం మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యులు ఎంతకీ సభలోనే నినాదాలు చేస్తుండటంతో వారిని బయటకు పంపించాలని స్పీకర్‌ మార్షల్స్‌ను ఆదేశించారు. 

సెల్‌ఫోన్లు సభ బయటే..
శాసనసభలో సభ్యులు సెల్‌ఫోన్ల వినియోగంపై స్పీకర్‌ స్పష్టమైన రూలింగ్‌ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జీరో అవర్‌లో మాట్లాడిన మంత్రి.. ప్రతిపక్ష సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడాన్ని తప్పుపట్టారు. ‘సెల్‌ఫోన్లు సభలోకి తీసుకురావచ్చా? తీసుకొస్తే వీడియోలు తీయోచ్చా? స్పీకర్‌ రూలింగ్‌ ఇవ్వాలి’ అని కోరారు. రూలింగ్‌ ఇచ్చిన తర్వాత కూడా నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష విధించాలో కూడా చెప్పాలన్నారు.

లేకుంటే సభలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్టు చిత్రీక­రించుకుని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రూలింగ్‌పై స్పీకర్‌ స్పందిస్తూ ఎటువంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్, ఫోన్లు, కెమెరాలు సభలో వినియోగించకూడదని బిజినెన్స్‌ రూల్స్‌లో స్పష్టంగా ఉన్నాయని చదివి వినిపించారు. అయినప్పటికీ సభ్యుల సెల్‌ఫోన్లను సభ వెలుపలే డిపాజిట్‌ చేసిన తర్వాత లోనికి వచ్చేలా విధానాన్ని తీసుకొస్తామన్నారు. జీరో అవర్‌ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

మీసం మెలేసి కవ్వించిన బాలకృష్ణ
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసి ‘చూసుకుందాం రా’ అన్నట్టు వేలు చూపిస్తూ కవ్వించారు. బాలకృష్ణ చర్యలను తప్పుబట్టిన మంత్రి రాంబాబు మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదని హితవుపలికారు. ఈలోగా వైఎస్సార్‌సీపీ ఎమ్మె­ల్యే­లు కొందరు కలుగజేసుకుని టీడీపీ ఎమ్మె­ల్యేల తీరును తప్పుపడుతూ మాట్లా­డారు. ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. గందరగోళ పరిస్థితుల మధ్య సభ అదుపు తప్పుతుండటంతో స్పీకర్‌ సభను కొద్ది నిమిషాలు వాయిదా వేశారు.

తిరిగి 11.05 గంట­లకు సభ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్‌ను ముట్టడించేందుకు యత్నిస్తుండగా మార్షల్స్‌ వారిని అడ్డుకున్నారు. ఇక్కడా బాలకృష్ణ రెండోసారి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చూస్తూ వికృతంగా చప్పట్లు కొట్టారు. దీంతో మరోసారి రభస మొదలైంది. మంత్రి బుగ్గన మాట్లాడుతూ స్పీకర్‌ పట్ల అవమానకరంగా ప్రవర్తించి సభా మర్యాదలకు భంగం కలిగించిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోకుంటే ఇదే అలవాటైపోతుందని, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశా­రు.
శాసనసభలో అసభ్యకరంగా సైగలు చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ 

టీడీపీ సభ్యులు పట్టు వీడకపోవడంతో వారి నినా­దాల మధ్య స్పీకర్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ‘సభ అత్యంత గౌరవించే సభాపతి స్థానాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభాపతిని అగౌరవ పరిచేలా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యహితంగా నిరసన తెలుపకుండా సభ ఔన్నత్యాన్ని కించపరిచేలా తొడలు చరుస్తూ, మీసాలు మెలివేస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వెల్‌లోకి వచ్చి మీసాలు మెలివేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలో­దకాలు ఇచ్చారన్నారు. దీనిని మొదటి తప్పుగా భావిస్తున్నామని.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ రాద్ధాంతం 
ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా
శాసన సభ వేదికగా అవినీతికి పాల్పడి, పేద విద్యార్థులను మోసం చేసిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష సభ్యులు రా­ద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఉప ముఖ్య­మంత్రి అంజాద్‌ బాషా మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా స్పీకర్‌ స్థానాన్ని అగౌరవ పరుస్తూ ప్రభుత్వ ఆస్తులను నాశనం చే­స్తున్న సభ్యు­లపై కఠిన చర్యలు తీసుకో­వాలని కోరారు. ట్రెజరీ బెంచ్‌ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నా­రు. చంద్రబాబు దోపిడీకి పూర్తి ఆధారా­లు­న్నందునే జైలుకు వెళ్లగా, దాని నుంచి ప్రజ­ల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ సభ్యులు సభాకాలాన్ని దుర్వినియోగం చేస్తున్నా­ర­న్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement