సాక్షి, అమరావతి: ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ సూళ్ల స్థితిగతులను బాగు చేస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచుతున్నట్టు తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు సభకు చెప్పారు. ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థలపై చాలా ఫిర్యాదులు అందాయలని, ఈ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మీడియంపై రాద్ధాంతం చేస్తూ.. పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని ప్రతిపక్ష సభ్యులను కోరారు. ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని, పోటీప్రపంచంలో నెగ్గుకురాగలమన్న ధీమా వారిలో ఏర్పడుతుందన్నారు. సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపి ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారని, ఇక, గ్రామీణ ప్రజలు, నిరుపేదలు అప్పులు చేసైనా తమ పిల్లలన ఇంగ్లిష్ మీడియం చదివించాలని ఆశ పడుతున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం తీసుకోవడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.
ఇంగ్లిష్ భాషలో చదివి ఉండకపోతే తాను ఆర్బీఐ అధికారిగా, ఐఏఎస్ అధికారిగా అయ్యేవాడిని కాదని, ఇంగ్లిష్ భాషలో ఎన్నో పరీక్షలు రాశానని తన అనుభవాలను పంచుకున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందని, దీనిపై రాద్ధాంతం రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగుకు నష్టం జరగదని, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయడం వల్ల భాష ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. పై చదవుల్లో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండటం వల్ల పెద్ద కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు ఆ భాషను అర్థం చేసుకోలేక ఆత్యహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని, ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుతుందన్నారు.
పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు మీడియం చదివిన వారికి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం రాదని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించడం ద్వారా విద్యార్థులు ఆ భాష మీద పట్టు పెంచుకుంటారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కచోట కూడా ఇంగ్లిష్ మీడియం పెట్టలేదని అన్నారు. ఎవరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఇప్పుడు తెలుగు మీడియం మీద టీడీపీ రాద్ధాంతం చేస్తోందని, తాను పీహెచ్‌డీ చేసే సమయంలో ప్రీ-పీహెచ్‌డీ పరీక్షను తెలుగులో రాస్తే.. దానిపై తెలుగుయువత విభాగం రాద్ధాంతం చేసిందని, తనను డిస్‌క్వాలిఫై చేయమని ఆనాడు గొడవకు దిగిందని గుర్తు చేశారు. తనకు పీహెచ్‌డీ పట్టా ఇవ్వవద్దని ఆందోళన చేయడంతో తాను హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment