ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం దిక్సూచిగా నిలుస్తోంది.
తరలివస్తొన్న మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు
సిద్దిపేట జోన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కె. చంద్రశేఖర్‌రావు తన కేబినెట్‌లోని సింహభాగం మంత్రులు, అధికార యంత్రాంగాన్ని తీసుకుని బుధవారం సిద్దిపేటకు రానున్నారు. పట్టణ శివారులోని మంచినీటి పథకం తీరు తెన్నులను రాష్ట్ర పాలక, అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో వివరించి భవిష్యత్తులో వాటర్ గ్రిడ్ సఫలీకృతానికి శ్రీకారం చుట్టారు.
తాగునీటి సమస్య తీర్చిన ఆ ఇద్దరు
సుమారు రూ. 25 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గడపకు తాగునీరును అందించి ఫ్లోరైడ్ భూతాన్ని నిర్మూలించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాంటి ప్రాజెక్ట్ రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో వ్యక్తికి కూడా అపారమైన అనుభవం ఉంది. అతడే ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం నిర్వహణలో కీలక పాత్ర పోషించి నేడు రాష్ట్ర ప్రభుత్వ వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న సత్యపాల్‌రెడ్డి. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చడానికి అపర భగీరథ ప్రయత్నం చేసిన ఆ ఇద్దరు మళ్లీ సిద్దిపేట గడ్డపై బుధవారం గత సృ్మతులను గుర్తు తెచ్చుకోనున్నారు.
తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న క్రమంలో సుమారు 185 గ్రామాలకు దప్పిక తీర్చి ప్రాజెక్ట్ రూపకల్పనలో నిర్వీరామంగా కృషి చేసిన సత్యపాల్‌రెడ్డి పేరు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమే. సిద్దిపేట ప్రాజెక్ట్ నిర్వహణలో చోటుచేసుకున్న అపార అనుభవంతో జిల్లాలోని సింగూర్ నీటి పథకంతో పాటు, గుంటూరు, కృష్ణా జిల్లాలో తాగునీటి పథక నిర్వహణలో ఆయన భాగస్వాములయ్యారు. ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ పొందినప్పటి కీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్ గ్రిడ్ రూపకల్పనలో సాంకేతిక సలహాలతో పాటు పర్యవేక్షణకు సత్యపాల్ సేవలను వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కన్సల్‌టెంట్ హోదాలో సత్యపాల్‌రెడ్డి మంగళవారం సిద్దిపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను, కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యాం ను, మార్గమధ్యలో ఇన్‌టెక్ వెల్‌లను మాక్ ట్రయల్‌గా పరిశీలించి పథకం పని తీరును తెలుసుకున్నారు.
సిద్దిపేట తాగునీటి పథక స్వరూపమిది
పాతికేళ్ల క్రితం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నం గునూరు మండలాలతో పాటు పట్టణం లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ క్రమంలోనే 1999లో అప్పటి ఎమ్మె ల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మా నేరు డ్యాం నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి తాగునీరు అందించేందుకు శాశ్వ త మంచినీటి పథక రూపకల్పన చేశారు. ఈ నిర్వహణ బాధ్యతను గ్రా మీణ మంచినీటి సరఫర శాఖ విభాగానికి అప్పగించారు. అప్పట్లో స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న సత్యపాల్‌రెడ్డితో శాశ్వత మంచినీటి పథ కం గూర్చి ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ పలుమార్లు సమీక్షించారు.
సుమారు రూ.60 కోట్ల వ్యయంతో కరీంనగర్ జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి 407 కిలోమీటర్ల పైప్ లైన్ పొడుగుతో మార్గమధ్యన మూడు ఇన్‌టెక్ వెల్ నిర్మాణాల ద్వారా భూగర్భం నుంచి తాగునీటిని లిఫ్టింగ్ చేసే ప్రక్రియను చేపట్టారు. రెండేళ్ల సుదీర్ఘ కృషి అనంతరం 2001లో సిద్దిపేట నియోజకవర్గంలోని సుమారు 185 గ్రామాల ప్రజలకు తాగునీటి అందించే ప్రక్రియ సఫలీకృతమైంది. సిద్దిపేట పథకం సత్ఫలితాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దొమ్మాట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సింగూరు నీటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథక నిర్వహణలో కూడా సత్యపాల్‌రెడ్డి సిద్దిపేటలోని అపార అనుభవాన్ని సాంకేతిక పరిజ్ఞాన రూపంలో దోహదపడ్డారు.