2009లో చేసిన శంకుస్థాపన శిలాఫలకం
తాగునీటి సదుపాయం కోసమంటూ మంచినీళ్ల ప్రాయంలా కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నట్టుగా హడావుడి చేస్తున్న అధికార పార్టీ నేతలు ఆ నీడలో కమీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్ హయాంలో నిధులు మంజూరై పనులు జరిగినా తమ ఖాతాలో వేసుకుంటూ ప్రారంభోత్సవాలకు సమాయత్తమవడాన్ని చూసి జనమే నవ్వుకుంటున్నారు. ఇంకోవైపు రక్షిత మంచినీటి పథకాల శుభ్రతంటూ నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా నీటి పథకాల డొల్లతనాలపై ప్రత్యేక కథనాలు.
తూర్పుగోదావరి, పిఠాపురం: 2009 మార్చి 2న అప్పటి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు పిఠాపురంలో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా అప్పటి తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరు కాగా అప్పటి మున్సిపల్ చైర్‌పర్సన్ దేవరపల్లి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఆ నుంచి ప్రారంభమైన మంచినీటి పథకం పనులు తరువాత ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ హయాంలో అంటే 2014కి 80 శాతం పూర్తయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేత 2014లో ఎమ్మెల్యేగాఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ నిధులున్నా ఎందుకు పూర్తి చేయడం లేదంటూ అప్పటి ఎమ్మెల్యేపై విరుచుకు పడిన సంఘటనలున్నాయి.
అలాగే తనను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తానని హామీలు కూడా ఇచ్చారు కానీ ఈ నాలుగున్నరేళ్లు ఆ పథకం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గత ఎమ్మెల్యే వంగా గీత హయాంలో ఐదేళ్లు, ఇప్పుడు నాలుగున్నరేళ్లు పనులు జరిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయ్యాయి. 2009 నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా పనులు సాగడం, అదనపు నిర్మాణాలు చేపట్టడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగి రూ.21.90 కోట్లు నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చయింది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఎమ్మెల్యే వర్మ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు, తమ ప్రభుత్వమే ఈ పథకం నిర్మించినట్లు చెప్పుకోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు 2009లో పనులు ప్రారంభమైతే 2014లో 80 శాతం పూర్తయితే ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రూ.35 కోట్లు మంజూరు చేయడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గతమంతా అవినీతా...?
గత ప్రభుత్వం హయాంలో అవినీతి చోటుచేసుకుంటే అధికారంలోకి వచ్చిన తమరు ఆ అవినీతిని ఎందుకు బయటపెట్టలేదని, అలాగే 20 శాతం మాత్రమే మిగిలి ఉన్న పనులను గత నాలుగున్నరేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేక పోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి వనరులు కల్పించడం కష్టంగా మారిన నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే పెండెం దొరబాబు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ పథకానికి నిధులు మంజూరు చేశారు. పిఠాపురం పట్టణ దాహార్తిని తీర్చడానికి గత 11 ఏళ్ల క్రితం రూ.20 కోట్లు వెచ్చించి చిత్రాడ చెరువులో నిర్మించిన మంచినీటి పథకం ప్రారంభానికి ముందే కూలిపోతోంది. రూ.21.90 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ మంచి నీటి పథకం గత పదేళ్లుగా కొనసాగుతుండగా ఈ ఏడాది పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వర్మ హయాంలో జరిగిన పనుల్లో ఇంతలోనే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ చేసే స్టోరేజ్ ట్యాంక్ ప్రారంభానికి ముందే అండలు జారి కూలిపోతుండగా నిండా నీరుపెడితే పరిస్థితి ఏమిటని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రారంభించాలన్న హడావిడి తప్ప పక్కా పర్యవేక్షణ కొరవడడంతో నాణ్యాతాలోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి వల్ల పనులు జరగలేదన్న ఎమ్మెల్యే వర్మ ఇప్పుడు నాణ్యతా లోపాలపై పెదవి విప్పకపోవడం వెనుక రహస్యం ఏమిటో ఆయనకే తెలియాలని స్థానికులు మండిపడుతున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రమంత్రి నారా లోకేష్‌తో శుక్రవారం ప్రారంభించడానికి ఎమ్మెల్యే వర్మ సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment