సాక్షి, హైదరాబాద్: పాలమూరు పట్టణం తాగునీటి సరఫరా పథకం వ్యయ అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే అనుమానంవచ్చి వెనక్కి పంపితే ఒక్కసారిగా భూమికి దిగివచ్చాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ పథకం అంచనా వ్యయం రూ.350 కోట్ల నుంచి రూ.121 కోట్లకు తగ్గిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ పట్టణంలో పర్యటించిన సందర్భంగా స్థానికంగా నెలకొన్న నీటి ఎద్దడిపై ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్లలో కేవలం 15 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పట్టణానికి నీటి సరఫరా చేస్తున్న పథకం సామర్థ్యం సరిగా లేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చుకున్నారు.
దాంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం జలాలను మహబూబ్‌నగర్‌కు తరలించి కొత్త పథకం నిర్మించాలని సీఎం అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఆగమేఘాల మీద మహబూబ్‌నగర్ పట్టణాన్ని సందర్శించి .. పట్టణాభివృధ్దిపై సర్వే జరిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు అందులో విలీనమైన 10 గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు రూ.350 కోట్లతో కొత్త తాగునీటి పథకం, బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.88 కోట్లు, ఇతర అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కలిపి మొత్తం రూ.500 కోట్ల అంచనాలతో నివేదిక రూపొందించారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ ‘భారీ’ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఆగ్రహంతో కాగితాలను నేలపై విసిరికొట్టినట్లు సమాచారం. ఒక్క పట్టణానికే రూ.500 కోట్లా? అని అక్కడే ఉన్న ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ ముఖ్య ఇంజనీర్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించడంతో కంగుతిన్నఅధికారులు.. పాలమూరు తాగునీటి పథకానికి మళ్లీ రూ.121 కోట్ల అంచనా వ్యయంతో మరో నివేదికను సిద్ధం చేసి, శనివారం సీఎం కార్యాలయంలో సమర్పించారు. మూడు రోజుల్లోనే పథకం అంచనాలు తగ్గిపోవడం గమనార్హం.
అసలేం జరిగింది..?
శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎల్లూరు జలాశయానికి తరలించి అక్కడి నుంచి మహబూబ్‌నగర్ పట్టణానికి సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎల్లూరు జలాశయం నుంచి పట్టణానికి నీటిని తరలించి, శుద్ధి చేసి పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, ప్రతిపాదనల దశలో ఓ నేత జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. అవసరం లేకపోయినా కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, ప్రస్తుత సరఫరా పైప్‌లైన్ల మార్పు, సరఫరా మెయిన్స్ మార్పు, మీటర్లతో నల్లా కనెక్షన్లు తదితర పనులతో పథకం అంచనా వ్యయాన్ని రూ.360 కోట్లకు పెంచేశారు. ఆ నేత జోక్యంవల్లనే అంచనాలు పెరిగాయని చర్చజరుగుతోంది.
పాలమూరుకు ‘నీళ్ల’లా అంచనాలు
Published Sun, Feb 1 2015 1:51 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement
Advertisement