ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల చుట్టూ ఉన్న 190 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.628 కోట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల చుట్టూ ఉన్న 190 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.628 కోట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీహెచ్‌ఎంసీకి శివార్లలో ఉన్న ఈ గ్రామాలకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ గ్రామాలకు నీటి సరఫరా బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) నుంచి జల మండలికి బదలాయించాలని, ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఇంటింటికి నీటిసరఫరా కోసం రూ.628 కోట్ల అంచనా వ్యయంతో కొత్త తాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి.
వీటిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో.. ఈ ప్రాజెక్టు పనులకు పాలనాపర అనుమతులు ఇస్తూ ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది. మిషన్ భగీరథ పథకంలో అంతర్భాగంగానే ఈ కొత్త తాగునీటి సరఫరా ప్రాజెక్టును నిర్మించనున్నారు.