పల్లె క‘న్నీరు’
గుక్కెడు నీటి కోసం పల్లె కన్నీరుపెడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పల్లె ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లు, కాలినడకన నీటి కోసం పాట్లు పడుతున్నారు. మైదానం, అటవీప్రాంతం అనే తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్లు లేనిచోట లేకపోగా..ఉన్నచోట నిర్లక్ష్యం వెంటాడుతోంది. చేతిపంపులు, ట్యాంకులు, పైపులైన్లకు మరమ్మతులు చేయించడంలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పంపు ఆపరేటర్ల అలసత్వం..విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో మైదాన ప్రజల నోళ్లు ఎండుతున్నాయి. పక్కనే గోదావరి ఉన్నా చెలమల నీళ్లే అడవి బిడ్డలకు దిక్కయ్యాయి. వెరసి పల్లె క‘న్నీటి’ గోడు ఎవరికీ పట్టడంలేదనేందుకు ఈ కథనాలే నిదర్శనం...
వేలేరుపాడు, న్యూస్‌లైన్: దాహం దాహం అంటూ గుక్కెడు నీటికోసం పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. మండు వేసవిలో గొంతు తడుపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మండలంలోని ఎర్రతోగు, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, పాతరెడ్డిగూడెం, ఒంటిబండ, బోళ్లపల్లి, మేడేపల్లి, బుర్రెడ్డిగూడెం, చింతలపాడు తదితర గ్రామాల్లో ఉన్న తాగునీటి పథకాలు, చేతి పంపులు చెడిపోయి నెలలు దాటుతుతోంది. కొన్ని చోట్ల చేతిపంపులు కూడా లేకపోవడంతో వాగులు, కాల్వలు, చెలమల నీరుతాగాల్సి వస్తోంది. ఎర్రతోగు గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపు చెడిపోయి నాలుగునెలలు కావస్తున్నా మరమ్మత్తులు చేపట్టడం లేదు. ఇక్కడ మొత్తం 55 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామస్తులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.
వీరంతా అరకిలోమీటరు దూరంలోని ఎర్రకాల్వ వద్ద చెలమల నీరు తెచ్చుకొని తాగుతున్నారు. ఈ కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. 80 కుటుంబాలున్న బోళ్ళపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం చెడిపోయి ఏడునెలలు అవుతుంది. గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపే దిక్కైంది. పాతరెడ్డిగూడెం గ్రామంలో మంచినీటి పథకం చెడిపోయి పదిరోజులకు పైగా అవుతుంది. ఈ గ్రామస్తులు అరకిలోమీటరు దూరంలోని పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఒంటిబండ గ్రామంలోనూ పథకం మరమ్మతులకు గురై వారం దాటుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేడేపల్లిలో తాగునీటి పథకం సక్రమంగా పనిచేయడం లేదు. పైప్‌లైన్ నీరు ట్యాంక్ ఉన్న ప్రాంతంలోని కొన్ని ఇళ్ళకు మాత్రమే అందుతున్నాయి.
పాఠశాల ఉన్న గుంపునకు అసలు నీళ్ళురావడం లేదు. ఈ ప్రాంత గిరిజనులు చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్ గ్రామాల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో పెదవాగు, లోతువాగు చెలమల నీరు తాగుతున్నారు. అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించి సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.
మణుగూరు,న్యూస్‌లైన్: మండలంలోని సమితిసింగారం పంచాయతీలో సర్వయ్యగుంపు వలస గిరిజనులకు తోగునీరే తాగునీరవుతోంది. ఐదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 32 కుటుంబాల వలస గిరిజనులు రేగలగండి చెరువు సమీపంలో నివాసం ఉంటున్నారు. జనావాసాలకు దూరంగా ఉంటున్న ఈ గిరిజనులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. వీరికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. వీరి నివాసప్రాంతానికి సమీపంలోని రేగులగండి చెరువుకు వెళ్లే తోగునీటినే తాగునీరుగా వాడుతున్నారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని తోగులో నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అత్యంత మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామంలో ఓ చేతిపంపును నిర్మించాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుంపువాసులు కోరుతున్నారు.
తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని గ్రామాలలో నీటి వసతి లేక, మరికొన్ని గ్రామాలలో నీరున్నా విద్యుత్ కొరత, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని తిరుమలాయపాలెం, పాతర్లపాడు, మేకలతండా, జింకలగూడెం, మహ్మదాపురం శివారు బోడా తండా తదితర గ్రామాలలో తాగునీటి సమస్య వేధిస్తోంది. పాతర్లపాడు తదితర గ్రామాలలో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ సకాలంలో నీరు సరఫరా కావడం లేదు. పంచాయతీ సిబ్బందని ప్రశ్నిస్తే విద్యుత్ కొరతతో సరఫరా చేయలేకపోతున్నామని సాకులు చెపుతున్నారు. తమ గ్రామంలో రెండురోజులకు ఒకసారి నీరు సరఫరా చేసేవారని, ఇటీవలి కాలంలో అది కూడా సక్రమంగా రావడం లేదని స్థానికులు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.