సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన)
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తెలంగాణ కేబినెట్ భేటీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత సమావేశమైన కేబినెట్ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment