ముత్యం రెడ్డితో హరీష్, రామలింగారెడ్డి
సాక్షి, మెదక్ : దుబ్బాక నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించేందుకు గులాబీ దళం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించింది. ఆపధర్మ మంత్రి హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆదివారం చెరుకు ముత్యం రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని వారి ముందు ఆయన కంటతడి పెట్టారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ది వెనుక ముత్యం రెడ్డి శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆయన చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ బలం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.
కాగా నియోజకర్గంలో రామలింగారెడ్డిని ఓడించాలంటే ముత్యం రెడ్డిలాంటి నేతను బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిన విషయం తెలిసిందే. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించడంతో ముత్యం రెడ్డికి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో తీవ్ర మనస్థానం చెందిన ముత్యం రెడ్డి టీఆర్‌ఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. ముత్యం రెడ్డి పార్టీని వీడడంతోతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే అని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరుఫున రామలింగారెడ్డి పోటీలో నిలవగా..టీజేఎస్ నుంచి చిందం రాజ్‌కుమార్ బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment