cheruku muthyam reddy
-
సుజాతను ఎందుకు బరిలో నిలిపారు..?
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించగా.. గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వహఖ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి కుమారుడిని కాదని ఆయన భార్య సుజాతను ఎందుకు నిలబెట్టారని ప్రశ్నించారు. సీనియర్ నేతగా, ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన రామలింగారెడ్డిగా సీఎం కేసీఆర్ మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. (ఇద్దరు సీనియర్ల మరణం.. సానుభూతి ఎవరికి?) అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి అనుసరిస్తోందని గుర్తుచేశారు. సాంప్రదాయానికి విరుద్ధంగా గతంలో ఖైరతాబాద్, నారాయణ్‌ఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులను నిలబెట్టారని విమర్శించారు. ఆణిముత్యం లాంటి ముత్యంరెడ్డి కొడుకును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించి ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల పని చేయాలని పిలపునిచ్చారు. -
ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్‌రావు ఈ విడత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!) అనుకూలంపై అంచనా.. ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి 1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్) వరుస ఓటమి చవిచూసినా.. వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్‌రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్ఆర్ఏస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్‌రావు రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు. చేనేత సమస్యలపై లోక్‌సభలో చర్చిస్తా.. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం
సాక్షి, హైదరాబాద్ : చెరుకు ముత్యం రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గొప్ప నాయకుడని టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి అహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకకే కాకుండా తెలంగాణ మొత్తానికి ఆదర్శ నాయకులని కొనియాడారు. దుబ్బాక-దొమ్మట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషిచేసిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. చదవండి: (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) అదే విధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్‌లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట-గజ్వేల్‌కు మధ్యలో ఉందని, టీఆర్ఎస్ దుబ్బాకకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో టీఆరెస్ తరపున తనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారని, మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా రేపు ఏఐసీసీ ప్రకటన చేస్తుందని వెల్లడించారు. తనతో సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటుందని, ఈ ఎన్నికల తరువాత సైతం దుబ్బాక అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటూ కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాకలో ఎవరు పైసలు ఇచ్చిన మద్యం పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని కోరారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్) టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది నిజాయితీకి మారుపేరు రైతు, ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో, సెక్రటేరియట్లో, తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేశారు. రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుంది. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు. శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎం చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది. 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము. దుబ్బాకలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ రెండేళ్లలో ఒక్క రూపాయి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు.ఎన్నికలు ఉన్నాయని 9వేల కొత్త పెన్షన్స్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావుకు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.’ అని అధికార టీఆర్ఎస్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భయపడదు దుబ్బాకలో టీఆర్ఎస్ సెంటిమెంట్ డ్రామా ఆడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు. రాంలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే.. కానీ ఆయన సెంటిమెంట్ ఆలోచిస్తే ముత్యం రెడ్డి గారు చనిపోయిన సెంటిమెంట్ ఏం కావాలని ప్రశ్నించారు. దుబ్బాకకు ఎనలేని సేవలు అందించిన ముత్యం రెడ్డి కుమారుడే బరిలోకి దిగుతున్నారున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్డినా కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డికి అవకావం దక్కలేదు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి నేడు హస్తం గూటికి చేరారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలవడం పూర్తిగా ఖరారు అయినట్లే. -
దుబ్బాక ఎన్నిక : టీఆర్ఎస్కు ఝలక్
సాక్షి, సిద్దిపేట : కీలకమైన దుబ్బాక ఉప ఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు. అంతేకాకుండా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన మాజీమంత్రి ముత్యంరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయం ముందు టీఆర్ఎస్లో చేరారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు విడుదల చేయనున్నారు. -
దుబ్బాకలో టీఆర్ఎస్కు ఝలక్
-
ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం.. దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. . అధిష్టానంపై ఒత్తిడి అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందలని పక్కా ప్రణాళిక బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి. -
చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, సిద్దిపేట: మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యియి. ముత్యంరెడ్డి స్వస్థలం తొగుట మండలంలోని తిక్కాపూర్ గ్రామంలో జరిగిన ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ముత్యంరెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, మాజీమంత్రి సునీతా లక్ష్మా రెడ్డి, కార్పోరేషన్ ఛైర్మన్లు ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలెటి రాధాకృష్ణ శర్మ, బక్కి వెంకటయ్య తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, ముత్యం రెడ్డి అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముత్యం రెడ్డికి సంతాప సూచకంగా గౌరవ వందనం సమర్పించి పోలీసులు 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా ముత్యంరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. -
‘వారి నోట్లో పురుగులు పడతాయి’
సాక్షి, మెదక్ : దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి అన్నారు. గురువారం చేగుంటలో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముత్యంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. నాలుగేళ్లు తిప్పుకుని తన టికెట్ అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయకుండా నిజాయితీగా బతుకుతున్నానని.. తాను అమ్ముడు పోయే మనిసి కాదని స్పష్టం చేశారు. తనను విమర్శించే వారి నోట్లో పురుగులు పడతాయంటూ మండిపడ్డారు. చిల్లర పాలిటిక్స్ చేయనని ఆయన చెప్పారు. -
డబ్బులిచ్చిన వాళ్లకే టికెట్లు
తొగుట(దుబ్బాక): శాసన సభ ఎన్నికల్లో గెలిచే వారికి కాకుండా డబ్బు సంచులిచ్చిన వారికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి ఆరోపించారు. మెదక్‌లోని ఆయన స్వగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా కేవలం దుబ్బాకలో గ్రూపులను ప్రోత్సహించి పార్టీని భ్రష్టు పట్టించారనిమండిపడ్డారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన నిజాయితీని గుర్తించి టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. వైఎస్‌తోనే నిజమైన కాంగ్రెస్ పోయిందని, ప్రస్తుతం పైరవీకారులు, లంచాలిచ్చేవారి హవా నడుస్తోందని దుయ్యబట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దుబ్బాకలో పార్టీని బతికించానని చెప్పారు. స్వార్థంతో నియోజకవర్గంలో ముగ్గురి మధ్య అగ్గి రాజేసి పార్టీని నాశనం చేస్తున్నారని ఉత్తమ్‌పై మండిపడ్డారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభకు వాహనాలలో కార్యకర్తలను తీసుకురమ్మని ఎందుకు చెప్పారని నిలదీశారు. ఆర్థికంగా తనను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే తనకు టికెట్ ఇవ్వబోమని చెప్పాల్సిందన్నారు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్, అందోల్ నియోజకవర్గాలలో గ్రూపులకు స్థానం లేకుండా చూశానన్నారు. గాంధీ భవన్ బండారాన్ని బయటపెడతానని ఆయన హెచ్చరించారు. నా తడాఖా ఏంటో ఉత్తమ్‌కు చూపిస్తానని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతీ మండలాన్ని పర్యటిస్తామన్నారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. తన నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పత్రాన్ని మెసేజ్ ద్వారా పంపించినట్టు ఆయన ప్రకటించారు. సమావేశంలో ఆయన అనుచరులు పాగాల కొండల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, బాలమల్లు, యాదగిరి, రామస్వామి, వెంకట్, అశోక్, స్వామి, చంద్రం, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హస్తానికి షాకిచ్చిన మాజీ మంత్రి
సాక్షి, మెదక్ : దుబ్బాక నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించేందుకు గులాబీ దళం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించింది. ఆపధర్మ మంత్రి హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆదివారం చెరుకు ముత్యం రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని వారి ముందు ఆయన కంటతడి పెట్టారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ది వెనుక ముత్యం రెడ్డి శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆయన చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాగా నియోజకర్గంలో రామలింగారెడ్డిని ఓడించాలంటే ముత్యం రెడ్డిలాంటి నేతను బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిన విషయం తెలిసిందే. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించడంతో ముత్యం రెడ్డికి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో తీవ్ర మనస్థానం చెందిన ముత్యం రెడ్డి టీఆర్ఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. ముత్యం రెడ్డి పార్టీని వీడడంతోతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే అని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరుఫున రామలింగారెడ్డి పోటీలో నిలవగా..టీజేఎస్ నుంచి చిందం రాజ్‌కుమార్ బరిలో నిలిచారు. -
ఎన్నికల సమీక్షకు కాంగ్రెస్ నేతల డుమ్మా
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: స్థానిక సంస్థలు, మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో విజయావకాశాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. దీంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి విదేశీ పర్యటన లో ఉన్నందున సమావేశానికి రాలేకపోయారని డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి సమావేశంలో తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థులైన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డితోపాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పి.కిష్టారెడ్డి, నందీశ్వర్‌గౌడ్, మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదిలావుంటే జహీరాబాద్, మెదక్ లోక్‌సభ అభ్యర్థులు సురేశ్ షెట్కార్, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలు సైతం డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే సమావేశానికి హాజరు కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్లే వీరు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. సమావేశం సాగింది ఇలా.. డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి అధ్యక్షత మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలోని ఇందిర భవన్లో సమావే శం కొనసాగింది. ఈ సమావేశంలో పోలింగ్ సరళిపై చర్చించారు. ఈ సందర్భంగా గజ్వేల్ తాజా మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను మూడేళ్ల క్రితమే నిర్వహించి ఉంటే జిల్లాకు రూ.3,500 కోట్లు వచ్చి ఉండేవన్నారు. జెడ్పీ పీఠాన్ని సైతం దక్కించుకునేందుకు సమష్టిగా పని చే యాలని సూచించారు. -
అధికారులవల్లే ప్రభుత్వ పథకాలు విఫలం
తొగుట,న్యూస్‌లైన్: ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇందిరమ్మ పచ్చతోరణం కింద చెట్టూ పట్టా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్ష్యం నెరవేరకుండా పోతోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి పథకం నిర్వహణ ప్రత్యేక కమిషనర్ సైదులు దృష్టికి తీసుకవచ్చారు. మండలంలోని తుక్కాపూర్ కాశితుర్క కాలనీలో, ఎల్లారెడ్డిపేటలో పథకంలో చేపట్టిన పనులను సోమవారం కమిషనర్ సైదులుతో కలిసి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించడానికి కనీసం రెండు నెలలకు ఒకసారైనా ఏపీడీ ఏగొండస్వామి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఏపీఓ శైలజ తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సకాలంలో చెల్లించక పోవడంతో గ్రామాల్లో చాలా మంది ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోడ్లవెంట మొక్కలు నాటే పథకానికి సీఎం కిరణ్‌తో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు. ఫలితంగా కాలుష్య నివారణతో పాటు, ప్రయాణికులకు అహ్లాదకరమైన వాతావరణం అందించటంతోపాటు వలసల నివారణకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాటిన మొక్కల్లో సగం కూడా దక్కకుండా పోతున్నాయన్నారు. ప్రత్యేక కమిషనర్ సైదులు మాట్లాడుతూ ఇందిరమ్మ పచ్చతోరణం పథక నిర్వహణ విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించే అధికారులు ఎంతటి హోదాలో ఉన్న ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. వారం రోజుల్లో మండలంలో మళ్లీ పర్యటిస్తానని ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఈజీఎస్ అధికారులను హెచ్చరించారు. పర్యావరణ పరిశుభ్రత కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ముందుగా సొంత డబ్బులు ఖర్చు చేసి నిర్మాణాలు చేయిస్తున్న తుక్కాపూర్ సర్పంచ్ చెరుకు విజయ్‌రెడ్డిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, తహశీల్దార్ నజీబ్ అహ్మద్, సీఐ అశోక్‌బాబు, సర్పంచ్ బుర్ర అనితా నర్సింలుగౌడ్, డీసీసీ కార్యదర్శి గాంధారి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘చెట్టు పట్టా’ అమలులో జిల్లా వెనుకంజ మిరుదొడ్డి: చెట్టు పట్టా కార్యక్రమం అమలులో దుబ్బాక నియోజక వర్గం వెనుకంజలో ఉందని ఇందిరమ్మ పచ్చతోరణం జిల్లా జాయింట్ కమిషనర్ సైదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాలలో సోమవారం చెట్టు పట్టా కార్యక్రమాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మిరుదొడ్డి ఎంపీడీఓ కార్యలయంలో ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్టు పట్టా కార్యక్రమం విజయవంతం కావడానికి ఈజీఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. పథకంపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మొక్కలను ఈజీఎస్ ద్వారా పంపిణీ చేశామన్నారు. చెట్టు పట్టా కార్యక్రమంలో పని చేసిన కూలీలకు 3 నెలలుగా డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం ఎందుకని ఏపీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. నియోజక వర్గంలో చెట్టు పట్టా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ చెట్టు పట్టా పథకం ద్వారా పర్యావరణంతో పాటు బడగు బలహీన వార్గాలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ కొంగరి రాజయ్య, మిరుదొడ్డి ఏఎంసీ చైర్మన్ నేరండ్ల భూమాగౌడ్, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.