తొగుట,న్యూస్‌లైన్: ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇందిరమ్మ పచ్చతోరణం కింద చెట్టూ పట్టా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్ష్యం నెరవేరకుండా పోతోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి పథకం నిర్వహణ ప్రత్యేక కమిషనర్ సైదులు దృష్టికి తీసుకవచ్చారు. మండలంలోని తుక్కాపూర్ కాశితుర్క కాలనీలో, ఎల్లారెడ్డిపేటలో పథకంలో చేపట్టిన పనులను సోమవారం కమిషనర్ సైదులుతో కలిసి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించడానికి కనీసం రెండు నెలలకు ఒకసారైనా ఏపీడీ ఏగొండస్వామి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఏపీఓ శైలజ తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సకాలంలో చెల్లించక పోవడంతో గ్రామాల్లో చాలా మంది ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోడ్లవెంట మొక్కలు నాటే పథకానికి సీఎం కిరణ్‌తో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు.
ఫలితంగా కాలుష్య నివారణతో పాటు, ప్రయాణికులకు అహ్లాదకరమైన వాతావరణం అందించటంతోపాటు వలసల నివారణకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాటిన మొక్కల్లో సగం కూడా దక్కకుండా పోతున్నాయన్నారు. ప్రత్యేక కమిషనర్ సైదులు మాట్లాడుతూ ఇందిరమ్మ పచ్చతోరణం పథక నిర్వహణ విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించే అధికారులు ఎంతటి హోదాలో ఉన్న ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. వారం రోజుల్లో మండలంలో మళ్లీ పర్యటిస్తానని ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఈజీఎస్ అధికారులను హెచ్చరించారు. పర్యావరణ పరిశుభ్రత కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ముందుగా సొంత డబ్బులు ఖర్చు చేసి నిర్మాణాలు చేయిస్తున్న తుక్కాపూర్ సర్పంచ్ చెరుకు విజయ్‌రెడ్డిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, తహశీల్దార్ నజీబ్ అహ్మద్, సీఐ అశోక్‌బాబు, సర్పంచ్ బుర్ర అనితా నర్సింలుగౌడ్, డీసీసీ కార్యదర్శి గాంధారి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘చెట్టు పట్టా’ అమలులో జిల్లా వెనుకంజ
మిరుదొడ్డి: చెట్టు పట్టా కార్యక్రమం అమలులో దుబ్బాక నియోజక వర్గం వెనుకంజలో ఉందని ఇందిరమ్మ పచ్చతోరణం జిల్లా జాయింట్ కమిషనర్ సైదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాలలో సోమవారం చెట్టు పట్టా కార్యక్రమాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మిరుదొడ్డి ఎంపీడీఓ కార్యలయంలో ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్టు పట్టా కార్యక్రమం విజయవంతం కావడానికి ఈజీఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. పథకంపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించి విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలో 18 లక్షల మొక్కలను ఈజీఎస్ ద్వారా పంపిణీ చేశామన్నారు. చెట్టు పట్టా కార్యక్రమంలో పని చేసిన కూలీలకు 3 నెలలుగా డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం ఎందుకని ఏపీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. నియోజక వర్గంలో చెట్టు పట్టా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ చెట్టు పట్టా పథకం ద్వారా పర్యావరణంతో పాటు బడగు బలహీన వార్గాలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ కొంగరి రాజయ్య, మిరుదొడ్డి ఏఎంసీ చైర్మన్ నేరండ్ల భూమాగౌడ్, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.