సాక్షి, హైదరాబాద్ : చెరుకు ముత్యం రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గొప్ప నాయకుడని టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి అహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకకే కాకుండా తెలంగాణ మొత్తానికి ఆదర్శ నాయకులని కొనియాడారు. దుబ్బాక-దొమ్మట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషిచేసిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. చదవండి: (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల)
అదే విధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్‌లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట-గజ్వేల్‌కు మధ్యలో ఉందని, టీఆర్‌ఎస్ దుబ్బాకకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో టీఆరెస్ తరపున తనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారని, మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా రేపు ఏఐసీసీ ప్రకటన చేస్తుందని వెల్లడించారు. తనతో సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటుందని, ఈ ఎన్నికల తరువాత సైతం దుబ్బాక అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటూ కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాకలో ఎవరు పైసలు ఇచ్చిన మద్యం పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని కోరారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్)
టీఆర్‌ఎస్ నైతికంగా ఓడిపోయింది
నిజాయితీకి మారుపేరు రైతు, ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో, సెక్రటేరియట్‌లో, తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేశారు. రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుంది. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు. శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎం చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది. 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము. దుబ్బాకలో టీఆర్‌ఎస్ నైతికంగా ఓడిపోయింది. టీఆర్‌ఎస్ రెండేళ్లలో ఒక్క రూపాయి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు.ఎన్నికలు ఉన్నాయని 9వేల కొత్త పెన్షన్స్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావుకు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.’ అని అధికార టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ భయపడదు
దుబ్బాకలో టీఆర్ఎస్ సెంటిమెంట్ డ్రామా ఆడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు. రాంలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే.. కానీ ఆయన సెంటిమెంట్ ఆలోచిస్తే ముత్యం రెడ్డి గారు చనిపోయిన సెంటిమెంట్ ఏం కావాలని ప్రశ్నించారు. దుబ్బాకకు ఎనలేని సేవలు అందించిన ముత్యం రెడ్డి కుమారుడే బరిలోకి దిగుతున్నారున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్డినా కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డికి అవకావం దక్కలేదు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి నేడు హస్తం గూటికి చేరారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలవడం పూర్తిగా ఖరారు అయినట్లే.
Comments
Please login to add a commentAdd a comment