సాక్షి, హైదరాబాద్: గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్న కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు దుబ్బాకను ఎందుకు పట్టించు కోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రామలింగా రెడ్డి దుబ్బాకలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేశారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయ లేకపోతున్నానని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. శనివారం దుబ్బాక నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నా అధి కారులు తనకు సహకరించడం లేదని రామ లింగారెడ్డి అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేశా రని చెప్పారు. నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, హరీశ్‌రావు ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అలాంటి హరీశ్ ఏం మొహం పెట్టుకుని దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై రేప్ కేసు ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీశ్‌రావు–రఘునందన్‌రావు ఒకే సామాజిక వర్గం వారని, ఇద్దరూ బంధువులని తెలిపారు. రఘునందన్ గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని చెప్పారు. దుబ్బాకను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని, ఏ గ్రామానికి వెళ్లినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..
శ్రవణ్‌కుమార్ అనే డాక్టర్ తన సొంత వ్యాపారం నిమిత్తం డబ్బులు తీసుకెళ్తుంటే పట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ అన్నారు. తనిఖీలు, సోదాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్‌హౌస్, టీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓ రిటైర్డ్ అధికారికి ప్రత్యేక బృందం ఇచ్చి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక సామాజిక వర్గం వారు రిటైర్ అయినా మళ్లీ పదవులు ఇస్తూ రాష్ట్ర నిధులన్నీ వారి చేతుల్లో పెడుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ కార్యకర్తలు వెనక్కు తగ్గరని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ ఆదివారం సాయంత్రం వరకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త విశ్రమించకుండా పని చేయాలని పిలుపునిచ్చారు.
నో ఎల్‌ఆర్‌ఎస్... నో టీఆర్‌ఎస్
నో ఎల్‌ఆర్‌ఎస్– నో టీఆర్‌ఎస్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్ కోరారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని చెప్పారు. పంట బీమా కల్పించకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాలని టీపీసీసీ చీఫ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment