అభిప్రాయం
ఇవాళ వ్యక్తులుగా పౌరులూ, సమాఖ్యలో భాగంగా ఉన్న రాష్ట్రాలూ తమ హక్కులను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయవాదం పేరుతో జాతీయోన్మాదాన్ని పాలకులు ప్రేరేపిస్తున్నారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తున్నారు.
రాజకీయ వ్యతిరేకతను, పౌర సమాజంలో భిన్నాభిప్రాయాలను కలిగివుండి, పాలనను విమర్శించే ప్రతి ఒక్కరినీ ప్రస్తుత భారత పాలక వ్యవస్థ తరచుగా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించింది. ఈ ద్వేషభావం... అసలు జాతీయవాదం అంటే ఏమిటి, నిజమైన జాతీయవాది ఎవరు అనే మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది. జాతీయవాదం అనే పదం విభిన్న రాజకీయ తత్త్వశాస్త్రాల ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడింది.
జాతీయవాదంపై వలసవాద వ్యతిరేక దృక్పథం... కుల, మత, వర్గ, ప్రాంతీయ అనుబంధాలతో సంబంధం లేకుండా నిర్దిష్ట రాజకీయ భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ తప్పనిసరిగా కలుపుతుంది. శక్తిమంతమైన వలస పాలకుల నుండి భార తదేశం విముక్తి పొందేందుకు అటువంటి జాతీయవాద దృక్పథం చాలా అవసరం. ఆ విధంగా, స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కలుపుకొని పోవడం వల్ల జాతీయవాదపు రాజ్యాంగ దార్శనికత అభివృద్ధి చెందింది. ఇతర సంకుచిత గుర్తింపుల కన్నా మిన్నగా అది పౌరుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.
మతం లేదా జాతి వంటి వివాదాస్పద పరిగణనలపై ఆధారపడిన జాతీయవాద విభజన దృక్పథం తన లోపలే ఒక శత్రువును కనుగొంటుంది. విభజించి పాలించే వలస రాజ్యాల ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్న బ్రిటిష్ వలసవాద వారసత్వపు కమ్యూనల్ అవార్డు చరిత్ర దృష్ట్యా, భారతదేశంలోని మతపరమైన మెజారిటీ శక్తులు ఇప్పుడు ముస్లింలను లోపలి శత్రువుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్ వంటివి సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ విభజిత ఎన్నికల చర్చలో ఆధిపత్యం చలా యించాయి. కానీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇతర జీవనోపాధి సమస్యలు దాని పాలనను సవాలు చేశాయి.
జాతీయవాదపు వలసవాద వ్యతిరేక దృక్పథంలోని మరొక కోణం ఏమిటంటే... వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడమే! నిజానికి, భారత రాజ్యాంగం, దానిలోని అనేక నిబంధనలు, దేశ న్యాయశాస్త్రం అనేవి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎల్లప్పుడూ ఆధునిక భారత జాతీయవాదపు కొనసాగుతున్న ఇతివృత్తంగా సమర్థించాయి. దేశం దైవపరిపాలనచే నడుస్తోందనే దృష్టి కోణం ఉద్దేశపూర్వకంగా దేశం, దాని ప్రజల సజాతీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా వైవిధ్యాన్ని అణిచివేస్తుంది.
జాతీయతలోని అనేక ఉపజాతి విధేయతలు తప్పనిసరిగా పరస్పర విరుద్ధమైనవి కానప్పటికీ, వాస్తవానికి అవి పరి పూర్ణమైనవి అనే వాస్తవాన్ని గుర్తించడానికి ఇది నిరాకరిస్తుంది. ఉదాహరణకు, భాషాపరమైన గుర్తింపులు జాతీయ గుర్తింపుతో విభేదించాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర పోరాటం భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పోరా టాన్ని హృదయపూర్వకంగా స్వీకరించింది, దాని చట్టబద్ధ మైన ప్రజాస్వామ్య స్వభావాన్ని గుర్తించింది.
కానీ, భిన్న త్వానికి విరుద్ధమైన వారు విస్తృతమైన జాతీయ గుర్తింపు పేరుతో సమాజంపై ఏకరూప దృక్పథాన్ని రుద్దడానికి ప్రయ త్నిస్తారు. ఒక దేశం – ఒకే మార్కెట్, ఒక దేశం – ఒకటే భాష, ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు, ఒక దేశం – ఒకటే పన్ను అలాంటి అసహన ప్రయత్నాలకు ఉదాహరణలు.
ప్రస్తుత పాలక జాతీయవాద కథనం ప్రజల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుతో కూడిన చిహ్నాలతో దేశం గురించిన నైరూప్య ఆలోచనను స్పృహతో ప్రోత్సహిస్తుంది. సాంఘిక, ఆర్థిక అసమానతలను సాధారణ మనిషికి హాని కలిగించేలా చేస్తుంది. కార్పొరేట్ సంపదలో పెరుగుదలను అసహజమైన అసమానతలపై జాతీయ గర్వకారణంగా చూపుతుంది. ఈ దృక్పథం అంతిమంగా కులం, వర్గం, అటువంటి ఆధిపత్య ధోరణులన్నింటినీ శాశ్వతంగా కొనసాగించే లక్ష్యానికే ఉపయోగపడుతుంది.
జాతీయవాదానికి సంబంధించి పైన పేర్కొన్న వక్రీకృత దృక్పథం స్వభావం ఏమిటంటే, ప్రక్రియ దిద్దు బాటును ప్రభావితం చేసే లక్ష్యంతో వాస్తవికతపై విమర్శనాత్మక ప్రశంసలను నిరోధిస్తూనే, గతం లేదా వర్తమానాన్ని విమర్శారహితంగా కీర్తించడం! అటువంటి విమర్శనాత్మక దృక్పథాన్ని వృత్తిపరమైన నిరాశా వాదంగా కొట్టివేయడం జరుగుతుంది. కానీ, ఇది యథాతథ స్థితిని మాత్రమే ప్రోత్సహిస్తుంది. దేశ పురోగతిని అడ్డుకుంటుంది.
నిరంకుశ జాతీయవాద ఉద్దేశ్యం స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. అందు వల్ల, భారతదేశ నాగరికత వారసత్వంగా ఉన్న వాదనా విధానం అణచివేయబడింది. దేశద్రోహం వంటి ప్రాచీన చట్టాల బలిపీఠం వద్ద వాక్ స్వాతంత్య్రాన్ని త్యాగం చేశారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తారు. పౌర హక్కులు, స్వేచ్ఛ వంటివి జాతీయవాద ప్రాజెక్టుకు సహించరానివిగా చిత్రీకరించబడ్డాయి.
నిజమైన జాతీయవాదం దాని సొంత గుర్తింపును మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆత్మగౌరవాన్ని వేడుక చేసు కుంటుంది. కానీ, జాతీయోన్మాదం బలవంతంగా, అసంకల్పితంగా అటువంటి స్వీయ అహంకారాన్ని దాని పౌరులపై మోపుతుంది. అటువంటి జాతీయోన్మాదాన్ని ప్రశ్నించే ఎవరైనా దేశం పట్ల అసంతృప్తిని ప్రదర్శించే వ్యక్తిగా పరిగణించబడతారు. నిజానికి అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో ఓ అంతర్భాగం.
కానీ, మెజారిటీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే సామాజిక, రాజకీయ శక్తులు చట్టబద్ధమైన జాతీయ గర్వాన్ని తగినంతగా ప్రకటించనప్పుడు జాతీయోన్మాదం విశ్వసనీయతను పొందుతుంది. ఆధునిక భారతీయ జాతీయవాదాన్ని ప్రజాస్వామ్యం, భాష, మతపరమైన బహుళత్వం, వైవిధ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మొదలైన రాజ్యాంగ విలువలపై తిరుగులేని నిబద్ధతతో నిర్వచించాలి.
అందువల్ల రాజ్యాంగ జాతీయవాదం ఆధునిక ప్రజాస్వామ్యాలలో అభివృద్ధి చెందిన పౌరసత్వ భావనపై కేంద్రీకృతమై ఉంది. దీనికి విరుద్ధంగా, విభజన గుర్తింపులపై ఆధారపడిన జాతీయవాదం... రాజ్యాంగవాదానికి వ్యతిరేక సిద్ధాంతం. అందువల్ల, మెజారిటీ గుర్తింపుపై ఆధారపడిన జాతీయవాద కథానాయకుడు రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణాన్ని ద్వేషిస్తాడు. అటువంటి మెజారిటీ జాతీయ వాదం అసంపూర్తిగా ఉన్న ప్రజాస్వామిక ప్రాజెక్టులో కొనసాగుతున్న సామాజిక దోష రేఖలను ఉపయోగించు కోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.
అంబేద్కర్ ‘రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు, ఎవరికి వారు పెంపొందించుకోవాల్సినది’ అని గమనించారు. అందువల్ల, మెజారిటీ జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాటం కేవలం నైతిక లేదా నైతిక విమర్శ కాదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో నేటికీ కొనసాగుతున్న సామాజిక లోపాలను సరిదిద్దడానికి కఠిన ప్రయత్నం అవసరం. కొందరిని అతి శక్తిమంతుల్ని చేసే ఘనత వహించిన జాతీయవాదంపై తద్వారానే పోరాడ వచ్చు.
కానీ జాతీయవాదపు లౌకిక, ఉదారవాద విమర్శ మెజారిటీ జాతీయవాద సాంస్కృతిక అంశాలపై దృష్టి పెడుతోంది. అసలు జాడ్యాన్ని విడిచిపెట్టి, దాని లక్షణాలపై మాత్రం ఇలాంటి పోరాటం చేస్తే, అది స్వీయ ఓటమినే మిగులుస్తుంది. దానికి బదులు అటువంటి వక్రీకృత జాతీయవాద ప్రపంచ దృక్పథానికి జవజీవాలను అందించే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోష రేఖలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగించడమే మార్గం.
ప్రొ‘‘ కె నాగేశ్వర్
వ్యాసకర్త ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment