'జాతీయతా భావం జెండా పండుగనాడే కాదు..'
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి గల్లీ వరకు మువ్వన్నెల పతాకం రెపరెపలాడే రోజున జాతి జనుల్లో జాతీయభావం పెల్లుబికటం సహజమేనని, అయితే జాతీయ పండుగలనాడేకాక అనునిత్యం పౌరులందరూ ఆ భావనను కలిగిఉండేలా ప్రోత్సహించాలన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ. 67వ గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసంలో జెండా ఎగురవేసిన అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడారు.
'ప్రస్తుతం పౌరుల్లో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉంది. రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశభక్తి పెల్లుబికటం సహజమే. అయితే ఆ భావనను మిగతా రోజుల్లోనూ కలిగిఉండాలి. కేవలం కేవలం విద్యా, క్రీడల ద్వారానేకాక ఇతర అన్ని రంగాల ద్వారా ప్రజల్లో జాతీయతా భావాన్ని ద్విగుణీకృతం చేయాలి' అని అద్వానీ అన్నారు. ఎన్డీఏ హయాంలో భావస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందన్న ఆరోపణలపై స్పందిస్తూ 'బ్రిటిష్ వారితో పోరాడిమరీ మనం స్వేచ్ఛను సాధించాం. ఒకవేళ మా ప్రభుత్వమే గనుక స్వేచ్ఛను హరించేప్రయత్నాలు చేస్తే ప్రజలు కచ్చితంగా పోరాడతారు. అయినా ఇప్పుడు భావస్వేచ్ఛకొచ్చిన ప్రమాదమేదీ లేదు. ఏదో జరిగిపోతోందనేది కల్పిత ప్రచారమేకానీ నిజంకాదు' అని తమ ప్రభుత్వం తీరును సమర్థించుకున్నారు బీజేపీ కురువృద్ధుడు.
గత ఆదివారం పార్టీ చీఫ్ అమిత్ షా తనను కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, కేవలం ఆశీర్వచనాలు తీసుకునేందుకు షా తన ఇంటికి వచ్చారని అద్వానీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు నజ్మా హెఫ్తుల్లా, రాజీవ్ ప్రతాప్ రూడీ, సీనియర్లు మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత కుమార్ తదితర ముఖ్యనాయకులు అద్వానీ నివాసంలో జరిగిన గణతంత్ర్యవేడుకలకు హాజరైనవారిలో ఉన్నారు.