మోదీ మంత్ర | Narendra Modi all set to become PM again | Sakshi
Sakshi News home page

మోదీ మంత్ర

Published Fri, May 24 2019 6:43 AM | Last Updated on Fri, May 24 2019 6:43 AM

Narendra Modi all set to become PM again - Sakshi

భారతావని కమలవనమయ్యింది. చౌకీదార్‌ ప్రభంజనం సృష్టించాడు. చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. పార్టీకి మరో ఐదేళ్ల అధికారాన్ని కానుకగా ఇచ్చారు. పైకి కన్పించని, నిశ్శబ్ద తరంగంలా వీచిన మోదీ గాలి హిందీ రాష్ట్రాలతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలనూ కుదిపేసింది.  

నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బలనుంచి పుంజుకుని..
2016 నవంబర్‌లో మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రూ.1,000, రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు జనం పరుగులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బే పడింది. వేరే నాయకులెవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కూడా దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ నిర్ణయానికి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మోదీ వీటన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొన్నారు. తర్వాత అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతులకు ఆదాయ కల్పన, భారీ ఆరోగ్య బీమా పథకం, ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు,  స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలు, హామీలు తిరిగి మోదీ పుంజుకునేలా చేశాయి. అవినీతిని అరికట్టే క్రమంలో దేశానికి తాను కాపలాదారు (చౌకీదార్‌)నని కూడా మోదీ చెప్పుకున్నారు.  

రాహుల్‌ వైఫల్యం
ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కాంగ్రెస్‌లో కొత్త ఆశలు నింపింది. ఈ నేపథ్యంలో మోదీ లక్ష్యంగా చౌకీదార్‌ చోర్‌ హై  (కాపలాదారే దొంగ) అనే నినాదాన్ని, రఫేల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రయత్నించారు. పదే పదే ఇవే అంశాలను వల్లెవేశారు. రఫేల్‌ కేసులో సుప్రీం క్లీన్‌చిట్‌ ఇచ్చినా తీర్పును ‘చౌకీదార్‌ చోర్‌ హై’ నినాదానికి తప్పుగా ఆపాదించి చివరకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. ఈ నినాదాలు కరుడుగట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలను తప్ప మిగతావారిని ఆకర్షించలేక పోయాయి. మరోవైపు రాహుల్‌ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్‌’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు.

దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. ఇదే సమయంలో యూపీఏ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు కూడా కాంగ్రెస్‌ వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తామూ ప్రధాని రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా స్పష్టంగా ప్రకటించలేని కాంగ్రెస్‌ నిస్సహాయత బీజేపీకి కలిసొచ్చింది. మా వైపు మోదీ.. మీ వైపు ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా బీజేపీ విజయం సాధించింది.

అలాగే పొత్తుల విషయంలో కూడా మోదీ పరిణతితో వ్యవహరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూస్తే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యింది. అలాగే బీజేపీతో ముఖాముఖి పోరు జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నా కాంగ్రెస్‌ ఆమెను ఒక అతిథి నటి మాదిరిగానే పరిగణించింది తప్ప పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధిస్తే చాలన్నట్టుగా వ్యవహరించి దెబ్బతింది. ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి వైఫల్యం కూడా బీజేపీకి లబ్ధి చేకూరేలా చేసింది.  

రెండుసార్లు ఘన విజయం..
1984లో లోక్‌సభలో కేవలం రెండు సీట్లు కలిగిన బీజేపీ 2 సార్వత్రిక ఎన్నిక ల్లో ఘన విజయం సాధించడం ద్వా రా భారత రాజకీయాల్లో కాంగ్రెస్‌ ను తప్పించి సెంటర్‌ స్టేజిని ఆక్రమించింది.  అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో 1996లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పడు 13 రోజులపాటు మొద టిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1998లో 13 నెలల పాలన తర్వాత లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ వాజ్‌పేయి నాయకత్వం.. పార్టీపై ఉన్న అస్పృశ్యత ముద్ర పోయి కొత్త కూటముల ఏర్పాటుకు దోహదపడింది. అది ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పా టుకు దారితీసింది. 2014లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. అమిత్‌ షా బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ–షా 18 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికల్లో సైతం 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి దేశంలోనే బలమైన రాజకీయపార్టీగా బీజేపీ అవతరించేలా కృషి చేసింది.  

దేశభద్రత ప్రధాన అస్త్రంగా..
ఓట్ల లెక్కింపు జరుగుతూ ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతుంటే ఈ అంశాలతో పాటు మోదీ తన ప్రధానాస్త్రంగా చేసుకున్న దేశ భద్రత, జాతీయవాదం దేశవ్యాప్తంగా ఓటర్లను ఏవిధంగా ఆయనవైపు తిప్పాయో స్పష్టమైంది.  కొన్ని కీలక రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది.  భారత్‌ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని పలు సూచీలు వెల్లడించాయి.  జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్‌ దాడిలో 40 మంది సైనికులు ప్రా ణాలు కోల్పోవడం, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రశిక్షణ శిబిరంపై  ఐఏఎఫ్‌ బాంబుల వర్షం (సర్జికల్‌ స్ట్రైక్స్‌) కురిపించిన తర్వాత జాతీయవాదం, దేశ భద్రతను, దేశభక్తిని మోదీ ఎన్నికల అస్త్రాలుగా చేసుకున్నారు. పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరాన్ని  నొక్కి చెప్పారు. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటూ ఉగ్రవాదుల శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో సమానమని చెప్పారు.
రాహుల్‌ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్‌’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement