కమలం @ 303 | BJP will win 303 seats in Lok Sabha polls | Sakshi
Sakshi News home page

కమలం @ 303

Published Sat, May 25 2019 3:11 AM | Last Updated on Sat, May 25 2019 3:11 AM

BJP will win 303 seats in Lok Sabha polls - Sakshi

నాగ్‌పూర్‌లో మనవళ్లతో కలసి కేక్‌ కట్‌ చేస్తున్న గడ్కరీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే (44) ఈసారి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు.

పార్టీలవారీగా చూస్తే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ తర్వాతి స్థానంలో నిలిచాయి. డీఎంకే 23, వైఎస్సార్‌సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు 22 చొప్పున, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. యూపీలో బీజేపీ దాని మిత్రపక్షం మొత్తం 80కి గాను 64 సీట్లలో గెలుపొందగా ఎస్పీ, బీఎస్పీల కూటమి దాదాపుగా చతికిలబడిపోయింది. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. 2014లో ఈ పార్టీలు 10 సీట్లు దక్కించుకున్నాయి.   

కమలదళం జోరు
ఇతర రాష్ట్రాల్లో ప్రభావాన్ని పెంచుకున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో మొత్తం 65 సీట్లకు గాను ఏకంగా 61 సీట్లలో విజయదుందుభి మోగించింది. ఆరు నెలల క్రితం ఈ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 28 లోక్‌సభా స్థానాలకు గాను 25 సీట్లలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ ప్రభంజనంలో తుముకూరు నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ కూడా ఓటమి చవిచూశారు. ఒడిశాలో గత ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ ఈసారి 8 సీట్లు గెలుచుకుంది.

కాంగ్రెస్‌ ఖాళీ
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణ వంటి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. అరుణాచల్‌ప్రదేశ్, దాదర్‌ అండ్‌ నాగర్‌హవేలీ, డామన్‌ అండ్‌ డయు, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూక శ్మీర్, లక్షద్వీప్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా గురువారం చెప్పారు.

బెంగాల్‌లో కమల వికాసం
18 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ  
పశ్చిమబెంగాల్‌లో పాగా వేయాలన్న ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాల ప్రయత్నాలు ఫలించాయి. సై అంటే సై అంటూ సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ తొలి సారి సత్తా చాటింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 చోట్ల ఘనవిజయం సాధించింది. మరో 22 చోట్ల రెండోస్థానంలో నిలిచి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కు గుబులు పుట్టించింది. మరోవైపు టీఎంసీ 22 స్థానాలతో తొలిస్థానంలో నిలిచింది. కాగా, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్షాలు ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి 43.3 శాతం ఓట్లు పోల్‌కాగా, బీజేపీకి 40.25 శాతం ఓట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిసారించిన బీజేపీ ఉత్తరబెంగాల్‌లోని జంగల్‌ మహల్‌ ప్రాంతంలో క్లీన్‌స్వీప్‌ చేసింది. జాఘ్రామ్, మేదినిపురి, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్‌ సీట్లను గెలుచుకుంది. అయితే దక్షిణబెంగాల్‌లో మమత పట్టును నిలుపుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement