ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అంతర్జాతీయంగా కొన్ని వేల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇతర దేశాలకన్నా తమ దేశమే ముందుగా వ్యాక్సిన్‌ను తమ దేశ ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు ప్రకటించారు. తాము కూడా ఇదే వైఖరి అవలంబిస్తామని భారత్, రష్యా దేశాలు కూడా ప్రకటించాయి.
ఇలా పలు దేశాల డొమెస్టిక్ మార్కెట్లకు, అంటు సొంత ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వ్యాక్సిన్ నేషనలిజం (వ్యాక్సిన్ జాతీయవాదం)గా వ్యవహరిస్తారని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ జాతీయవాదం హానికరమైనదని, అమెరికా లాంటి దేశాలకు ఇది మరింత ప్రమాదకరమని సెయింట్ లూహీ యూనివర్శిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ హెల్త్ లా స్టడీస్’ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆన సంతోష్ హెచ్చరించారు. ఇలా సొంత దేశ ప్రజల కోసం ముందుగా వ్యాక్సిన్‌ను దక్కించుకోవాలనుకోవడం వల్ల ప్రయోగాలు విజయవంతం కాకముందే వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. (డెక్సామిథాసోన్ వినియోగం, వాడకానికి డబ్ల్యూహెచ్‌ఓ ఓకే)
జర్మనీకి చెందిన ప్రముఖ డ్రగ్ కంపెనీ ‘క్యూర్‌వాక్’ను గత మార్చి నెలలోనే వైట్‌హౌజ్ ప్రతినిధులు కలుసుకొని వ్యాక్సిన్ విషయమై చర్చలు జరిపారు. ఆ కంపెనీ తయారు చేయనున్న కరోనా వ్యాక్సిన్‌పై తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇవ్వాలంటూ బేరమాడారు. ఈ విషయం తెల్సిన జర్మనీ ప్రభుత్వం ‘జర్మనీని అమ్మకానికి పెట్టలేదు’ అంటూ తీవ్రంగా స్పందించింది. అలాగే అమెరికాకు చెందిన ‘బయోమెడికల్ అడ్వాన్స్‌డ్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ’ ఫ్రెంచ్ కంపెనీ సనోఫీకి కరోనా వైరస్ కోసం ముందస్తు చెల్లింపులు జరిపింది. దాంతో తాము కనిపెడుతున్న వ్యాక్సిలో ఎక్కువ భాగం ముందుగా అమెరికాకే వెళుతుందని ఆ కంపెనీ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. దాంతో ఆ కంపెనీపై ఫ్రెంచ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ తన వైఖరిని మార్చుకుంది. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు?)
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సహించే లేదా సిఫార్సు చేసే బయోటెక్ కంపెనీల జోలికి వెళ్లవద్దని అమెరికా, భారత్, రష్యా దేశాలు నిర్ణయించాయి. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉంది. ఆ వ్యాక్సిన్‌లో అధిక భాగాన్నే దేశీయ అవసరాలకే ఉపయోగించాలంటూ ఇప్పటికే భారత్ ప్రభుత్వం ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇలా ప్రతి దేశం తమ దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఫర్వాలేదుగానీ, అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ప్రమాదమని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. దాని వల్ల అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేని దేశాలు బాగా దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ జాతీయవాదం కొత్తగా వచ్చింది కాదని, 2009లో కూడా ఇదే జరిగిందని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment