2023 Nobel Prize: కోవిడ్‌–19 టీకా పరిశోధనలకు నోబెల్‌ | Nobel Award In Medicine To Katalin Kariko And Drew Weissman | Sakshi
Sakshi News home page

2023 Nobel Prize: కోవిడ్‌–19 టీకా పరిశోధనలకు నోబెల్‌

Published Mon, Oct 2 2023 7:00 PM | Last Updated on Tue, Oct 3 2023 3:35 PM

Nobel Award In Medicine To Katalin Kariko And Drew Weissman - Sakshi

స్టాక్‌హోమ్‌:  కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణ కోసం ఎంఆర్‌ఎన్‌ఏ (మెసెంజర్‌ రైబోన్యూక్లియిక్‌ యాసిడ్‌) వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి లభించింది. హంగేరీకి చెందిన కాటలిన్‌ కరికో, అమెరికన్‌ డ్రూ వీజ్‌మన్‌కు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్‌ ప్రైజ్‌ను స్వీడన్‌లోని నోబెల్‌ కమిటీ సోమవారం ప్రకటించింది. న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లలో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి.

కాటలిన్‌ కరికో, డ్రూ వీజ్‌మన్‌ పరిశోధనలతో రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని, ఈ వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయని నోబెల్‌ కమిటీ వెల్లడించింది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పట్ల ఎంఆర్‌ఎన్‌ఏ ఎలా ప్రతిస్పందిస్తున్న దానిపై వీరిద్దరి పరిశోధన మన అవగాహనను పూర్తిగా మార్చివేసిందని పేర్కొంది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి గాను ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు వీరిని నోబెల్‌తో సత్కరించనున్నట్లు తెలియజేసింది.

ఇదిలా ఉండగా, భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని మంగళవారం, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్‌ బహుమతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. ఈ నెల 9న అర్థశాస్త్రంలో ఈ బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు. విజేతలకు డిసెంబర్‌ 10న నోబెల్‌ బహుమతులు ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్‌ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లు అందజేశారు. ఈసారి 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు.   

సంకల్పానికి తోడైన కృషి  
1997లో యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్న సమయంలో కాటలిన్‌ కరికో, డ్రూ వీజ్‌మన్‌ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై ఉమ్మడి పరిశోధనలు మొదలుపెట్టారు. వీజ్‌మన్‌ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీలలో బోస్టన్‌ యూనివర్సిటీ నుంచి 1987లో పీహెచ్‌డీ పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌లో హెచ్‌ఐవీ వైరస్‌పై పరిశోధనలు చేశారు.

ఆ తరువాతి కాలంలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వ్యాక్సిన్లపై పరిశోధనలకు శాస్త్రవేత్తల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కాటలిన్‌ కరికో ఎంఆర్‌ఎన్‌ఏ బయో కెమిస్ట్రీలో నిపుణులు. ఎంఆర్‌ఎన్‌ఏను వైద్యానికి ఉపయోగించాలన్న సంకల్పం ఇరువురిలోనూ మెండు. వేర్వేరు ఆర్‌ఎన్‌ఏ రకాలపై వీరు పరిశోధనలు చేపట్టగా 2005లో న్యూక్లియోటైడ్‌ బేసెస్‌లో మార్పులకు, దు్రష్పభావాలకు మధ్య సంబంధం స్పష్టమైంది. దీని ఆధారంగానే వారు ఆ బేస్‌లను మారిస్తే అప్పటివరకూ ఉన్న పరిమితులు తొలగిపోతాయని ప్రతిపాదించారు. తదుపరి పరిశోధనలతో దాన్ని రుజువు చేశారు.  

ఎంఆర్‌ఎన్‌ఏ బేస్‌లు మార్చారు.. టీకా సిద్ధం చేశారు!
2019లో మొదలై నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్‌ మహమ్మారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలినాళ్లలో ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు కావాల్సిన టీకా అంత తొందరగా తయారవుతుందా? తయారయ్యేలోపు ఎన్ని ప్రాణాలు పోవాలో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. కానీ.. మానవ సంకల్పం, ఆధునిక టెక్నాలజీల పుణ్యమా అని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం పెను విపత్తు నుంచి చివరి క్షణంలో తప్పించుకుంది. అంతేకాదు, ఈ టీకాల్లో ఒక రకం (ఎంఆర్‌ఎన్‌ఏ) మనకు అందుబాటులోకి రావడానికి ఈ సంవత్సరం వైద్యశాస్త్ర నోబెల్‌ బహుమతి గ్రహీతలైన కాటలిన్‌ కరికో, డ్రూ వీజ్‌మన్‌ల పరిశోధనలు కీలకమయ్యాయి! ఎందుకు? ఏమిటి? ఎలా?  

30 ఏళ్లుగా పరిశోధనలు   
టీకాల తయారీకి శాస్త్రవేత్తలు వందేళ్లుగా నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యాధికారక సూక్ష్మజీవిని నిరీ్వర్యం చేసి వాడేది ఒక రకమైతే.. ఆ సూక్ష్మజీవి భాగాన్ని ఉపయోగించుకోవడం ఇంకో పద్ధతి. వీటితోపాటు మరికొన్ని పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. కానీ.. సుమారు 30 ఏళ్ల క్రితం శరీర కణాల్లోని అతి సూక్ష్మ భాగమైన ఎంఆర్‌ఎన్‌(మెసెంజర్‌ రైబోన్యూక్లియిక్‌ యాసిడ్‌)ను కూడా వాడుకోవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలైతే జరిగాయి గానీ సాధించిన ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కోవిడ్‌ వ్యాధి ప్రపంచంపై పంజా విసిరిన సందర్భంలో మాత్రం పరిస్థితి వేగంగా మారిపోయింది. వ్యాధి నియంత్రణకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకా  సిద్ధమైంది.  



ఎన్నో వ్యాధుల నియంత్రణకు ఉపయోగకరం?  
ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలనేవి ప్రస్తుతం మనం కోవిడ్‌ నియంత్రణకు వాడుకున్నాం కానీ.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వ్యాధుల కట్టడికి ఉపయోగపడుతుందని, కొన్నింటికి చికిత్సగానూ పనికొస్తుందని శాస్త్రవేత్తల అంచనా. కోవిడ్‌ తరువాత జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సంబంధిత వ్యాధులు సోకే అవకాశాలు పెరిగినట్లు ప్రపంచం గుర్తించింది. అయితే, ఇప్పటికీ గుర్తించని వైరస్‌ రకాలు చాలా ఉన్నాయి.

ఒకవేళ భవిష్యత్తులో గుర్తు తెలియని వైరస్‌ ఏదైనా మనిషిపై దాడి చేస్తే ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో సులువుగా టీకా తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2000లో ఏర్పాటైన క్యూర్‌వ్యాక్, 2008లో ఏర్పాటైన బయో ఎన్‌టెక్, 2010 ఏర్పాటైన మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలను ముమ్మరం చేశాయి. ఈ మూడు కంపెనీల శాస్త్రవేత్తలు యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ టెక్నాలజీ సాకారమయ్యేలా చేయగలిగారు. జీకా వైరస్‌ విరుగుడుకు ఇప్పటికే ఎంఆర్‌ఎన్‌ఏ వైరస్‌ ఒకటి అందుబాటులో ఉండగా హెచ్‌10ఎన్‌8, హెచ్‌7ఎన్‌9 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల కట్టడికీ ప్రయోగాలు జరుగుతున్నాయి.  


ఏమిటీ ఎంఆర్‌ఎన్‌ఏ?  
మన కణాల్లోపల కణ కేంద్రకం.. అందులోపల మైటోకాండ్రియా, ఉండచుట్టుకుని క్రోమోజోములు ఉంటాయని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఈ క్రోమోజోముల మెలికలను విడదీస్తే అది... మెలితిరిగిన నిచ్చెన ఆకారంలోని డీఎన్‌ఏ అని కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో రెండు పోగులుంటాయి. ఈ డీఎన్‌ఏలో అక్కడక్కడ కొంత భాగంలో శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది.

కొన్ని రసాయన ప్రక్రియల కారణంగా ప్రొటీన్ల తయారీ సమాచారమున్న డీఎన్‌ఏ భాగాలు పోగు నుంచి విడిపోతుంటాయి. ఇలా విడిపోయిన భాగాన్నే ఎంఆర్‌ఎన్‌ఏ అని పిలుస్తారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ఎంఆర్‌ఎన్‌ఏలను టీకాలుగా వాడుకునేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలైతే జరుగుతున్నాయి. అయితే దు్రష్పభావాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని వాడటం అసాధ్యమైంది. అలాగే ఎంఆర్‌ఎన్‌ఏలు తగినంత మోతాదులో ప్రొటీన్లు ఉత్పత్తి చేయగలిగేవి కాదు.

ఈ నేపథ్యంలో కాటలిన్‌ కరికో, డ్రూ వీజ్‌మన్‌లు చేసిన పరిశోధనలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఎంఆర్‌ఎన్‌ఏ పోగులోని న్యూక్లియోటైడ్‌ బేసెస్‌(అడినైన్, థయామీన్, సైటోసైన్, గ్వానైన్‌ అని నాలుగు బేస్‌లు ఉంటాయి. రెండు పోగుల డీఎన్‌ఏ మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటే.. నిచ్చెన మెట్లకు రెండువైపుల ఉండే ఆధారం ఈ బేస్‌లు)మారితే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించలేదని, తద్వారా ప్రొటీన్‌ ఉత్పత్తి పెరగడమే కాకుండా దు్రష్పభావాలూ ఉండవని వీరు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనలకు మరికొన్ని ఇతర పరిశోధనలూ తోడు కావడం వల్లనే కోవిడ్‌–19 విరుగుడుకు రికార్డు సమయంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. 

ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు?

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement