చారిత్రక స్థలాల్లో వివాదం మెజార్టీ ప్రజల్లో జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుందని గుర్తించిన బీజేపీ అందుకు తగినట్లు పావులు కదుపుతోంది. బీజేపీ ప్రణాళికలో భాగంగా అయోధ్యతో ఆరంభమైన అడుగులు తాజాగా వారణాసి వైపు మరలాయి. స్థానిక కాశీ విశ్వనా«థ మందిరం– జ్ఞానవాపి మసీదు వివాదంలో మరో సంచలన తీర్పునకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మసీదు కమిటీ అభ్యంతరాలను పక్కనబెట్టిన స్థానిక కోర్టు మసీదులో సర్వే పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదే శించింది. ఇక తదుపరి న్యాయపోరాటం మధుర శ్రీకృష్ణ జన్మస్థలంపై జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తాజ్‌మహల్‌లో సర్వేకు అయోధ్య బీజేపీ చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.
వారణాసి: జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియోగ్రఫీని నిర్వహించేందుకు నియమించిన అడ్వొకేట్ కమిషనర్‌ను తొలగించాలన్న విజ్ఞప్తిని స్థానిక కోర్టు తోసిపుచ్చింది. జ్ఞానవాపి– శ్రీంగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వేను పదిరోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఈ పని కోసం ఇప్పటికే నియమించిన అడ్వొకేట్ కమిషనర్‌కు సాయంగా మరో ఇద్దరు లాయర్లను జిల్లా కోర్టు నియమించింది. ఈ మొత్తం ప్రక్రియను ఎవరు అడ్డుకున్నా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గత ఆదేశాలకు అనుగుణంగా సర్వే పూర్తి చేయాల్సి ఉండగా మసీదు కమిటీ ఈ పనిని అడ్డుకుంది. మసీదులో సర్వే, వీడియో తీయడాన్ని వ్యతిరేకించింది. కోర్టు నియమించిన కమిషనర్ పక్షపాతం చూపుతున్నాడని మసీదు కమిటీ కోర్టులో అభ్యంతరాలు తెలిపింది. దీంతో సర్వే పనులు ఇటీవల నిలిచిపోయాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ దివాకర్ సదరు అభ్యంతరాలను కొట్టివేశారు.
బేస్‌మెంట్లలో కూడా సర్వే: ఇప్పటికే నియమించిన అడ్వొకేట్ కమిషనర్ అజిత్ కుమార్ మిశ్రాకు సాయంగా విశాల్ సింగ్‌ను స్పెషల్ కమిషనర్‌గా, అజయ్ ప్రతాప్ సింగ్‌ను సహాయ కమిషనర్‌గా కోర్టు నియమించింది. మిశ్రాను తొలగించాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ ముగ్గురూ కలిసి సర్వేపనులు పూర్తి చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జ్ఞానవాపి మసీదు అంతర్భాగంలో వీడియో తీయాలని కోర్టు ఆదేశించినట్లు హిందూ పిటిషనర్ల న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు.
మసీదుకు చెందిన రెండు బేస్‌మెంట్లకు తాళాలున్నాయని మసీదు మేనేజ్‌మెంట్ కోర్టుకు తెలియజేసింది. వీటిలో వీడియో తీయడానికి అభ్యంతరం చెప్పింది. అయితే తాళాలు లేకపోతే పగలకొట్టి సర్వే పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిందని మదన్ మోహన్ చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి అడ్డంకులు కలిగించినవాళ్లను అదుపులోకి తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించిందన్నారు. దీంతో ఇకపై ప్రతిరోజూ ఉదయం 8– 12 మధ్య ఈ సర్వేను పూర్తయ్యేవరకు నిర్వహిస్తారు. మంగళవారం సర్వే ఎంతవరకు జరిగిందని కోర్టుకు నివేదిక సమర్పిస్తారు. కోర్టు తీర్పు అన్యాయమని, అప్పీలుకు వెళ్తామని మసీదు కమిటీ తెలిపింది.
ఇలా మొదలైంది..
మసీదు గోడ వద్ద ఉన్న గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని, వీటిని ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని రాకీసింగ్‌తో పాటు నలుగురు మహిళలు 2021లో స్థానిక కోర్టునాశ్రయించారు. ఇప్పటివరకు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఈ పూజలకు అనుమతిస్తున్నారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు వీడియో సర్వేకు గతనెల ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మే 6న వీడియో సర్వే ఆరంభించారు. అయితే సర్వే కోసం నియమించిన మిశ్రాను తొలగించాలని మసీదు కమిటీ కోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా మసీదులోపల వీడియో తీయమని కోర్టు ఆదేశించలేదని, కేవలం ఛబుత్రా ప్రాంతానికే వీడియో సర్వే పరిమితమని అడ్డుకుంది. శుక్రవారం మిశ్రా ఈప్రాంతంలో ఒక సర్వే నిర్వహించారు. ఈ సమయంలో ఇరుపక్షాల నుంచి పెద్ద ఎత్తున గుమికూడి నినాదాలిచ్చారు.
ప్రార్థనా స్థలాల చట్టం వర్తిస్తుందా?
ప్రార్థనా స్థలాల చట్టం– 1991 ప్రకారం 1947 తర్వాత ఏ స్థలంలో ఏ ప్రార్థనాస్థలం ఉంటే అదే కొనసాగుతుందని, సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ వాదిస్తోంది. జ్ఞానవాపి మసీదులో కోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామని తెలిపింది. రామజన్మభూమి తీర్పు తర్వాత ఏ ప్రార్థనాస్థలంలోనైనా మార్పులకు కోర్టులు ఆదేశిస్తే, సుప్రీంకోర్టు రామజన్మభూమి తీర్పును అతిక్రమించినట్లేనని పేర్కొంది. అయితే సదరు స్థలం మసీదు లేదా దేవాలయం అని తేలిన తర్వాతే ఆ స్థలానికి ప్రార్థనా స్థలాల చట్టం వర్తిస్తుందని హిందువుల తరఫు న్యాయవాదులు చెప్పారు. 1936 నుంచి ఈ స్థలంపై ఇరుపక్షాల మధ్య కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. 1991 కేసులో సైతం సదరు చట్టం గురించి ప్రస్తావన వచ్చింది. ఇక్కడ మసీదును గుడిపై కట్టినందున సదరు చట్టం వర్తించదని అప్పట్లో హిందువుల తరఫు న్యాయవాదులు వాదించారు. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరి నిలిచిపోయింది.
భద్రతపై ఆందోళన
‘‘చిన్న సివిల్ కేసును అసాధారణ కేసుగా మార్చారు. దీంతో అంతటా భయోత్పాత వాతావరణం నెలకొంది. చివరకు నా భద్రతపై నా కుటుంబసభ్యులు, వారి భద్రతపై నేను ఆందోళనపడుతున్నాము. ఇంటి నుంచి బయటకు వస్తే నాకేం జరుగుతుందోనని నా భార్య భయపడుతోంది’’
– జస్టిస్ రవి కుమార్ దివాకర్
తాజ్‌పై పిల్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: తాజ్‌మహల్ చరిత్రపై నిజ నిర్థారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తాజ్ ఆవరణలోని మూసి ఉన్న 22 గదుల కారణంగా తన చట్టబద్ధ హక్కులకు భంగం ఎలా వాటిల్లుతోందో వివరించడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్‌దారు చెబుతున్నట్లుగా ఆర్టికల్–226 ఈ అంశంలో వర్తించదని స్పష్టం చేసింది. శివాలయం ఉన్న తేజో మహాలయను తాజ్‌మహల్‌గా మార్చారని, దాంట్లోని 22 గదుల సమాచారం తెలపాలని ఆదేశాలివ్వాలంటూ బీజేపీ అయోధ్య విభాగం మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజ్‌నీష్ సింగ్ వేసిన పిల్‌ను గురువారం జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ విషయమై ఆగ్రా జిల్లా కోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ ఉందని, తాజా పిల్ ఈ కోర్టు పరిధిలోని కాదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకొని ‘‘తాజ్‌ను షాజహాన్ నిర్మించలేదని అంటారా? ఎవరు కట్టారు? వయసెంత? అని తీర్పు ఇవ్వడానికి మేమున్నామా.. మీరు నమ్మే చారిత్రక వాస్తవాల్లోకి మమ్మల్ని తీసుకెళ్లొద్దు. నిజాలు తెలుసుకోవాలంటే వెళ్లి పరిశోధన చేయండి.. ఎంఏ, పీహెచ్‌డీ చేయండి.. ఏదైనా సంస్థ/వర్సిటీ నిరాకరిస్తే అపుడు కోర్టుకు రావొచ్చు’’అని వ్యాఖ్యానించింది. పిల్‌కున్న ఉద్దేశాన్ని అపహాస్యం చేయొద్దని పేర్కొంది. పిల్‌ను వెనక్కి తీసుకుని, మరో పిటిషన్ వేస్తామంటూ చేసిన వినతిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment