అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
► కలెక్టర్లకు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం
► జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ఆదిలాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మండలం, డివిజన్, మున్సిపల్, జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్పోరేషన్ కార్యాలయాల్లో పతాక అవిష్కరణ గావించాలని, ఆసుపత్రులు, వృద్ద ఆశ్రమాలు, సంక్షేమ వసతి గృహాలలో, మున్సిపాలిటీలలో స్వీట్లు పంచాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి ఎంపిక చేసి నగదు బహుమతితో పాటు ఘనంగా సత్కరించాలని తెలిపారు.
ప్రతి జిల్లా నుంచి 100 మంది కళాకారులను జూన్ 1న రాత్రి హైదరాబాద్‌కు పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడానికి బాధ్యతలు అప్పగించామని, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు, క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ సుందర్ అబ్నార్, డీఆర్వో సంజీవరెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, సీపీవో కేశవ్‌రావు, ఎస్‌ఈపీఆర్ శంకర్, అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అవతరణ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు శాఖల వారీగా అప్పగించి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డీఈవో సత్యనారాయణరెడ్డి, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో జలపతి నాయక్, సోషల్ ఫారెస్ట్ అధికారి గోపాల్‌రావు, అధికారులు పాల్గొన్నారు.