సాక్షి, ముంబై: సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్యసమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూరత్‌లోని ప్రతాప్‌నగర్ ప్రాంతంలోగల శ్రీమార్కండేయ మందిరం ప్రాంగణంలో సోమవారం సాయంత్రం వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డుంబాల్ వార్డు తెలుగు కార్పొరేటర్ పి.వి.యస్. శర్మ, ప్రభుత్వ తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు బుచ్చిరాములు, సూరత్ పద్మశాలి సమాజం కార్యదర్శి అంకం సోమయ్య, శ్రీ మార్కండేయ మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్‌తోపాటు తెలంగాణ ప్రజలు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యఅతిథి శర్మ, రాపోలు బుచ్చిరాములు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించడానికి ముఖ్య భూమిక పోషించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తదుపరి బాణసంచా కాల్చి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాల కాలంగా ఎదురు చూసిన తెలంగాణ ప్రజల కల సాకారమైందని, తెలంగాణ అంటే నాలుగు అక్షరాలు కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు. అటువంటి తె లంగాణను సాధించడానికి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది అమరవీరుల త్యాగ ఫలితంగా కళ సాకారమై ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరికీ ఎనలేని సంతోషాన్ని కలుగజేసిందన్నారు.
తెలంగాణ ఏర్పాటైతే సొంత రాష్ట్రానికి వెళ్తామనే ఆశ స్థానికుల్లో ఉందని, తమ పిల్లలకు సొంత రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందనే ఆశ ఉందని, అవన్నీ తెలంగాణలో నెరవేరాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి సూరత్‌లో ఉన్న వలస ప్రజలకు మధ్య స్నేహ వారధిగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో, సూరత్‌లోని అన్ని వర్గాల ప్రజల సహాయసహకారాలతో సూరత్ తెలంగాణ వలస ప్రజల ఐక్యసమితిని ఏర్పాటు చేశామని, లక్ష్యం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తామని కార్యనిర్వాహకులు మచ్చ వీరన్న, శంకుపెల్లి బుగులాచారి, శ్రీనివాస్ తెలిపారు.
వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో...
ముంబైలోని వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుధీర్గ పోరాటంతో తెలంగాణ, అమరవీరుల త్యాగ ఫలితంగా కల సాకారమైందని వాషి తెలంగాణ సమితి అధ్యక్షుడు సైదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్, గిరి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
పశ్చి అంధేరీలో..
పశ్చిమ అంధేరీలోని కపాస్‌వాడి ప్రాంతంలో నివసిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు ప్రజలు సోమవారం సాయంత్రం తెలంగాణ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. గూడ నారాయణగౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డ్యాన్సులు చేస్తూ, రం గులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కె. చంద్రశేఖర్‌గౌడ్, ఎస్. బందయ్య గౌడ్, ఎం. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సూరత్‌లో ఘనంగా తెలంగాణ సంబరాలు
Published Tue, Jun 3 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement