ముంబై, థాణే, భివండీ, నవీముంబైలలో 15 లక్షల మంది తెలుగు ప్రజలు
60 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క తెలుగు అభ్యర్థికీ చోటివ్వని ప్రధాన పార్టీలు
కార్యకర్తల్లా తప్ప నాయకులుగా చూడటం లేదని తెలుగువారి ఆగ్రహం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగువారిని రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తమను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు తప్పా నాయకులుగా ఎదగనివ్వడం లేదని తెలుగువారు ఆవేదన చెందుతున్నారు.
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రధాన పార్టీలలో ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. అయితే ముంబైతోపాటు థాణే, భివండీ, నవీముంబైలలో సుమారు 15 లక్షలకుపైగా తెలుగు ప్రజలున్నప్పటికీ ఏ పార్టీ కూడా తెలుగు అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కన్పించడంలేదు. దీంతో ఈ సారి కూడా అసెంబ్లీలో తెలుగువారి ప్రాతినిధ్యానికి మొండి చెయ్యి ఎదురైనట్లైంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో అత్యధికంగా ముంబైలో 36 తర్వాత ఉమ్మడి థాణే జిల్లాలో 24 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నప్పటికీ ఒక్క రాజకీయపార్టీ కూడా తెలుగువారికి అభ్యర్థిత్వమివ్వలేదు. ఇకపై ప్రకటించే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ప్రయత్నలోపమే అసలు కారణం
అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ముంబై, థాణే, భివండీ, నవీముంబైలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు ప్రముఖులమని, నాయకులమని చెప్పుకునేవారెవరూ తమ తమ పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించడం లేదు. తమకు అనుకూలమైన నాయకులతో చేతులు కలిపి ఎదిగేందుకు ప్రయత్నించడం లేదా ఇతర పార్టీలతో లాభమనుకుంటే వాటిలో చేరడం తప్ప టికెట్ ఇవ్వమని అడిగే ధైర్యం చేయడం లేదని స్థానిక తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తెలుగువారిని కార్యకర్తల్లా తప్ప నాయకులుగా చూడటం లేదని ఇక్కడున్న తెలుగువారి ఓట్ల కోసం కూడా కనీసం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో దింపే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు.
గత ఎన్నికల్లో నవీముంబై జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముంబై, భివండీ, నవీముంబై, థాణే మొదలగు ప్రాంతాల్లో కొందరు కొందరు ప్రముఖ తెలుగు నాయకులున్నప్పటికీ టికెట్లు లభించే అవకాశాలు కన్పించడంలేదు. ఇలా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసించే ముంబై, థాణే, భివండీ, నవీముంబైలలో తెలుగువారెవరూ రాజకీయ చర్చల్లో చోటుకల్పించుకోలేక పోతున్నారు. అయితే కార్పొరేటర్లుగా మాత్రం ముంబై, థాణేల్లో ఒక్కొక్కరు, భివండీలో ఇద్దరు మాత్రం కార్పొరేటర్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడి, సంస్కృతీ, సంప్రదాయాల్లో మమేకమైన తెలుగువారికి ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు.
కలిసికట్టుగా సాగితే ఫలితం...
తెలుగు వారంతా కలిసికట్టుగా ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్‌నైనా దక్కించుకుని వారిని గెలిపించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ముంబై, థాణే, నవీ ముంబైల్లో అనేక మంది విద్యావేత్తలతోపాటు వివిధ రంగాల్లో ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నవారున్నారు. అనేక మందిలో సేవాభావం, సమాజసేవ చేయాలని, రాజకీయంగా ఎదగాలనే తపన కూడా ఉంది. కానీ ఐకమత్యం లేకపోవడం, అందరినీ ఏకంచేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సఫలం కావడంలేదని కొందరి వాదన. ఈ నేపథ్యంలో కులమతాలు, ప్రాంతాల తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఫలితం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్
ముంబైలో ప్రస్తుతం ఒకే ఒక తెలుగు కార్పొరేటరున్నప్పటికీ రాబోయే రోజులలో తెలుగు వారు ఏకమైతే ప్రధాన పార్టీలు అనేక ప్రాంతాల్లో తెలుగు వారికి కార్పొరేటర్ పదవులిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లభించలేదని నిరుత్సాహ పడకుండా ఇప్పటి నుంచే కార్పొరేషన్ ఎన్నికలకు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు నాయకులందరూ సిద్ధమవ్వాలి. రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై థాణే జిల్లాల్లో రాజకీయంగా బలం పెంచుకునేందుకు, తెలుగు కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునేందుకు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాల్సిఉంది.
ఘనచరిత్రే..
ముంబైలో తెలుగు వారిది ఘనమైన చరిత్ర. ముంబై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది క్రియాశీలపాత్ర. స్వాతంత్య్రానికి ముందు సుమారు 1877 నుంచి సుమారు 1950 వరకు తెలుగు వారంతా రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. కానీ తరువాత మాత్రం రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబైలో వర్లీ, పరెల్, కామాటిపురా, కొలాబా, బాంద్రా, గోరేగావ్, బోరివలి, ఘాట్కోపర్, అంటాప్‌హిల్, వడాలా తదితర అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అదేవిదంగా థాణే, నవీముంబై, భివండీ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారున్నారు. రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా ఎన్నికైన సయాజీ శీలం తెలుగువారే. ఆయనతోపాటు అనేక మంది తెలుగువారు మేయర్, కార్పొరేటర్ సహా అనేక పదవులను చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment