
ముంబై: మహా రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆహార, పౌరసరఫరా శాఖల మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) తన పదవులకు రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసులో ఆయన అనుచరుడు అరెస్ట్ కాగా.. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ధనంజయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
గత డిసెంబర్‌లో బీడ్ జిల్లా మస్సాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి.. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడు వాల్మీక్ కరాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనంజయ్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.
రాజకీయ విమర్శలు తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ చీఫ్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో భేటీ అయి చర్చించారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు ధనంజయ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆపై ఆ లేఖను ఆమోదించిన ఫడ్నవిస్.. గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు.
ధనంజయ్ ఎవరంటే..
ధనంజయ్ పండిత్‌రావ్ ముండే.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత గోపినాథ్ ముండేకు దగ్గరి బంధువు. గతంలో ఈయన బీజేపీలో పని చేశారు. బీజేవైఎం యువ విభాగానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా చేపట్టారు. ఆపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో చేరారు. ధనంజయ్ 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలోని ఫడ్నవిస్ కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు బీడ్ జిల్లాకు సంరక్షణ మంత్రిగా ఉన్నారు.
గతంలో ఈయన ఓ వివాదంలోనూ చిక్కుకున్నారు. ప్రముఖ గాయని రేణు శర్మ 2021జనవరిలో ఆయనపై అత్యాచార కేసు పెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. అయితే ఆ ఆరోపణలు తోసిపుచ్చిన ఆయన.. సంచలన ప్రకటన చేశారు. రేణు శర్మ సోదరి కరుణా శర్మతో తాను సహజీవనంలో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయం తన భార్య, కుటుంబ సభ్యులకూ తెలుసని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత రేణు శర్మ ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment