minister resignation
-
అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. కానీ!: బెంగాల్ మంత్రి
కోల్‌కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.కాగా రామ్‌నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారుఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్‌పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు. -
మహిళా అధికారితో దురుసు ప్రవర్తన.. మంత్రి రాజీనామాకు ఆదేశం
కలకత్తా: సొంత పార్టీ నేత, పశ్చిమబెంగాల్ జైళ్ల మంత్రి అఖిల్గిరిపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరి ఓ మహిళా అధికారిని బెదిరిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పార్టీ సీరియస్ అయింది. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పడంతో పాటు మంత్రిపదవికి వెంటనే రాజీనామా చేయాలని గిరిని పార్టీ ఆదేశించింది. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ సంతనుసేన్ మాట్లాడుతూ ‘ఒక మహిళా అధికారితో మా మంత్రి అనుచితంగా ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తనను మేం సమర్థించం. ఆ మంత్రిని మహిళా అధికారికి క్షమాపణ చెప్పడంతోపాటు మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాం.తృణమూల్ కాంగ్రెస్ రాజధర్మాన్ని పాటిస్తుంది. మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ సొంత పార్టీ నేతలపై ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీపీఎం కూడా ఈ విషయాల్లో రాజధర్మాన్ని పాటించలేదు’అని సంతనుసేన్ తెలిపారు. -
ఎన్నికల్లో ఓటమి.. మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర మంత్రి కిరోడి లాల్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనకు అప్పగించిన పలు స్థానాల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పంపించారు. ‘‘ కిరోడి లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. పది రోజుల క్రితం సీఎంకు రాజీనామా లేఖను అందజేశారు’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి.లోక్‌సభ ఎన్నికల్లో కిరోడి లాల్ మీనాకు బీజేపీ ఏడు స్థానాలను అప్పగించింది. ఈ స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. తన సొంత నియోజకవర్గం దౌసాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలకు 14 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 ఎనిమిది సీట్లు విజయం సాధించింది. మిగతా పార్టీలు మూడు సీట్లను గెలుచుకున్నాయి. -
ఢిల్లీలో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిడి వివాదంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పదవి నుంచి తొలగించాలని ఆందోళనలు చేపట్టటంతో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వివాదాస్పదం కాకుండా ఉండేందుకు మంత్రి చేత రాజీనామా చేయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వివాదం ఏమిటి? దసరా రోజు(ఈనెల 5న) ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో భారీ సంఖ్యలో హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమంలో ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొనడంపై తీవ్ర వివాదం ముసురుకుంది. మతం మారుతున్న వ్యక్తులు హిందూ దేవుళ్లు, దేవతలను దూషిస్తున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యాలు గత శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నేతృత్వం వహించటంపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో గౌతమ్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. #BreakingNews Delhi social welfare minister @AdvRajendraPal, at the centre of an alleged conversion row, resigns@htTweets pic.twitter.com/jlM4XXkljD — Alok K N Mishra HT (@AlokKNMishra) October 9, 2022 ఇదీ చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్ -
కాంగ్రెస్‌కు షాక్: మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వైఖరిని నిరసిస్తూ ఓ మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. అయితే పార్టీ వైఖరి సక్రమంగా లేకనే రాజీనామా చేశామని వారు ప్రకటించారు. వీరి రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రజా పనుల శాఖ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపాయందన్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ శివకుళందైను కలిసి స్వయంగా రాజీనామా పత్రాలను సమర్పించారు. తనపై పార్టీ నాయకత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని మంత్రి నమశ్శివాయం బహిరంగంగానే చెబుతున్నారు. అసంతృప్తిని వెళ్లగక్కినా పార్టీ పట్టించుకోకపోవడంతో నమశ్శివాయం ఇక ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. అందులో భాగంగా ఇటీవల తన అనుచరులతో సమావేశమై చర్చించి చివరకు పార్టీని వీడాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీకి ద్రోహం చేస్తున్నారనే కారణంతో నమశ్శివాయంను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని బాధ్యతల నుంచి బహిష్కరిస్తున్నట్లు పాండిచ్చేరి పీసీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణియన్ ప్రకటించారు. రాజీనామాలు చేసినా పార్టీ దిగిరాకపోవడంపై వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. పైగా పార్టీ నుంచి తమను బహిష్కరించడంతో నమశ్శివాయంతోపాటు దీపాయందన్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిద్దరి రాజీనామాతో కాంగ్రెస్ బలం 12కు చేరింది. ముగ్గురు డీఎంకే సభ్యులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్‌కు 7 మంది, ఏఐఏడీఎంకేకు నలుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. వీరిద్దరి రాజీనామాతో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చి ఇబ్బందేం లేదు. కాకపోతే ఇలాంటి అసంతృప్తులు ఇంకా ఉన్నారని.. వారు రాజీనామా చేస్తే మాత్రం ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది. -
నా రాజీనామా సిద్ధంగా ఉంది: మంత్రి
మహారాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలైన పంకజా ముండే రాజీనామాకు సిద్ధపడ్డారు. తన ప్రత్యర్థులు పదే పదే తనను టార్గెట్ చేస్తున్నారని, తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలని భావిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఆ ప్రత్యర్థులు వేరే పార్టీ వాళ్లా.. తమ సొంత పార్టీలోని వాళ్లేనా అన్న విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. ''మా నాన్న వారసత్వాన్ని నా లేత భుజాలపై మోయాల్సి వచ్చింది. నన్ను ఎంతగా టార్గెట్ చేస్తారు? నా మీద అవినీతి ఆరోపణలు చేశారు. నేను బెదిరించానని ఒక వ్యక్తి ఆరోపించాడు, నన్ను గూండా అని కూడా అంటున్నారు. వాటిలో ఏ ఒక్క ఆరోపణా ఇంతవరకు రుజువు కాలేదు గానీ, నా పేరు ప్రతిష్ఠలను మాత్రం మంటగలుపుతున్నారు. నేను పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోతున్నాను. నా రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచాను. నేను ఏదైనా తప్పు చేశానని ప్రలు భావించిన వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకొంటా'' అని అహ్మద్‌నగర్- బీద్ రోడ్డులోని భగవాన్గఢ్లో నిర్వహించిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆమె ఆవేశంగా అన్నారు. పంకజా ముండే మద్దతుదారులకు, అక్కడ వంజారాల ఆధ్యాత్మిక నేత నామ్‌దేవ్ శాస్త్రి వర్గీయులకు మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంటుందన్న సమాచారం ఉండటంతో పోలీసులు అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భగవాన్గఢ్ వద్దకు ముండేను రానిచ్చేది లేదని అంతకుముందు నామ్‌దేవ్ వర్గం హెచ్చరించింది. ఇది ఆధ్యాత్మిక ప్రాంతమని, దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకోనివ్వబోమని తెలిపింది. అయితే, పంకజ తండ్రి.. దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే ప్రతియేటా దసరా సందర్భంగా భగవాన్గఢ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవారు. అదే సంప్రదాయాన్ని పంకజ కూడా కొనసాగిస్తున్నారు. అయితే.. ఆమె భగవాన్బాబా సమాధిని దర్శించుకోడానికి కొండ మీదకు వెళ్లినా, అక్కడ కాకుండా కొండ దిగువన మాత్రమే మాట్లాడటంతో చాలావరకు వివాదం తప్పింది. అలాగే నామ్‌దేవ్ శాస్త్రిని కూడా ఆమె కలవలేదు. తాను గొడవ పడదలచుకోలేదని.. వచ్చే సంవత్సరం ఆయన తనను తప్పనిసరిగా ర్యాలీకి పిలుస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు పంకజ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది.