![Pondicherry Minister, MLA Resigns - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/26/Pondicherry-Resigns.jpg.webp?itok=3rKNzz1L)
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వైఖరిని నిరసిస్తూ ఓ మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. అయితే పార్టీ వైఖరి సక్రమంగా లేకనే రాజీనామా చేశామని వారు ప్రకటించారు. వీరి రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రజా పనుల శాఖ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపాయందన్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ శివకుళందైను కలిసి స్వయంగా రాజీనామా పత్రాలను సమర్పించారు.
తనపై పార్టీ నాయకత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని మంత్రి నమశ్శివాయం బహిరంగంగానే చెబుతున్నారు. అసంతృప్తిని వెళ్లగక్కినా పార్టీ పట్టించుకోకపోవడంతో నమశ్శివాయం ఇక ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. అందులో భాగంగా ఇటీవల తన అనుచరులతో సమావేశమై చర్చించి చివరకు పార్టీని వీడాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీకి ద్రోహం చేస్తున్నారనే కారణంతో నమశ్శివాయంను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని బాధ్యతల నుంచి బహిష్కరిస్తున్నట్లు పాండిచ్చేరి పీసీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణియన్ ప్రకటించారు. రాజీనామాలు చేసినా పార్టీ దిగిరాకపోవడంపై వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. పైగా పార్టీ నుంచి తమను బహిష్కరించడంతో నమశ్శివాయంతోపాటు దీపాయందన్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిద్దరి రాజీనామాతో కాంగ్రెస్ బలం 12కు చేరింది. ముగ్గురు డీఎంకే సభ్యులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు 7 మంది, ఏఐఏడీఎంకేకు నలుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. వీరిద్దరి రాజీనామాతో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చి ఇబ్బందేం లేదు. కాకపోతే ఇలాంటి అసంతృప్తులు ఇంకా ఉన్నారని.. వారు రాజీనామా చేస్తే మాత్రం ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment